డీఎస్సీ నియామకాలపై అనుమానాలు | Doubts over DSC appointments says Neha Bora | Sakshi
Sakshi News home page

డీఎస్సీ నియామకాలపై అనుమానాలు

Aug 20 2026 5:15 AM | Updated on Aug 20 2026 5:15 AM

Doubts over DSC appointments says Neha Bora

స్పోర్ట్స్‌ కోటా పెంచడం, పాత నోటిఫికేషన్లలో మార్పులపై సందేహాలు 

ఎగ్జామ్‌ సెంటర్లలో సీసీటీవీలను ఎందుకు తీసేశారు 

విద్యార్థుల సందేహాలు, అపోహలను తొలగించాలి 

మిమ్మల్ని ఎన్నుకున్న తర్వాత తప్పులనుగత ప్రభుత్వాలపై తోయడం కుదరదు 

వ్యవస్థను బాగుచేయడానికి ఎన్నికల్లోనే పోటీ చేయక్కర్లేదు

ఈ జెన్‌జీ ఉద్యమం ద్వారా దేశాన్ని సరికొత్తగా తీర్చిదిద్దుకోవాలి 

ఇందులో విద్యార్థులు, పౌరులు పాల్గొనాలి 

కాక్రోచ్‌ జనతా పార్టీ సభ్యురాలు, ఏఐఎస్‌ఏ జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా 

సాక్షి, అమరావతి:  డీఎస్సీ పరీక్ష నిర్వహణపై రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలతో పాటు నిరుద్యోగ భృతి, ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ వంటి అంశాలపై రాష్ట్ర విద్యార్థులకు సంఘీభావంగా కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) అండగా ఉంటుందని ఆ పార్టీ సభ్యురాలు,  ఏఐఎస్‌ఏ జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా తెలిపారు. డీఎస్సీలో స్పోర్ట్స్‌ కోటా రెండు నుంచి మూడు శాతం పెంచడం, పాత నోటిఫికేషన్‌ స్థానంలో కొత్త నోటిఫికేషన్లు తీసుకురావడంపై విద్యార్థుల నుంచి పలు ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఏదైనా పరీక్షల నిర్వహణపై విద్యార్థులు సందేహాలు, అనుమానాలను రేకెత్తించినప్పుడు స్వేచ్ఛగా న్యాయ విచారణ జరిపి వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. 

ఆంధ్రప్రదేశ్‌ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్టుల (ఏపీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో బుధవారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీట్‌ ది ప్రెస్‌లో నేహా బోరా మాట్లాడుతూ.. పరీక్షల్లో భారీగా కాపీ జరిగిందన్న అనుమానంతో అభ్యర్థులు సీసీటీవీ ఫుటేజ్‌ అడిగితే లేదని చెప్పడం అనుమానాలకు తావిస్తోందన్నారు. మొత్తం మీద చూస్తే రాష్ట్ర డీఎస్సీలో కొన్ని అక్రమాలు జరిగాయని.. ఈ అంశంపై పోరాటం చేస్తున్న విద్యార్థులకు తాము అండంగా ఉంటామని ఆమె స్పష్టంచేశారు. ఈ మొత్తం వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ ఎపిసోడ్‌లో అధికార పార్టీ ప్రజల గురించి కాకుండా ప్రతిపక్ష పార్టీల గురించి ఎక్కువ ఆందోళన చెందుతోందన్న విషయం అర్థమవుతోందన్నారు. 

అధికారంలో ఉన్న పార్టీలు ఇచ్చిన హమీలను అమలుచేయాలని డిమాండ్‌ చేసినప్పుడు గత ప్రభుత్వాన్ని నిందిస్తూ తప్పించుకోవడాన్ని నేటి యువత ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదని ఆమె స్పష్టంచేశారు. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరే సమాధానం చెప్పాలిగానీ గత ప్రభుత్వమంటూ తప్పించుకోలేరంటూ నేహా బోరా హెచ్చరించారు. రాజకీయ పార్టీలు ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశ్యం ఉంటే ఇటువంటి ఆటలు ఆడటం ఆపేయాలన్నారు. 

ప్రత్యక్ష ఎన్నికలే అవసరంలేదు.. 
ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయడం ద్వారానే సమస్యలను పరిష్కరించనవసరంలేదని ప్రజా ఉద్యమాల ద్వారా కూడా వీటిని పరిష్కరించవచ్చని నేహా బోరా అభిప్రాయపడ్డారు. ఈ జెన్‌జీ ఉద్యమం ద్వారానే కేంద్ర విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయించామని, అలాగే.. మూడు వ్యవసాయ చట్టాలు కూడా రైతుల పోరాటం ద్వారా ఉపసంహరించుకున్న విషయాలను గుర్తుపెట్టుకోవాలన్నారు. ఉద్యమాల్లో పాల్గొనడం ద్వారా యువత, పౌరులు ఈ దేశాన్ని కొత్తగా తీర్చుదిద్దుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రస్తుతం సీజేపీ జన ఉద్యమ సంస్థగానే ఉందని, రాబోయే కాలంలో తాను ఎన్నికల ప్రజాస్వామ్యంలోకి వెళ్లాల్సి వస్తే అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement