ఇ‘స్మార్ట్‌’గా.. పెళ్లిళ్లూ..

Online Wedding Celebrations in This COVID 19 Pandemic YSR Kadapa - Sakshi

పలుకరింపులూ అంతా స్మార్ట్‌ఫోన్‌ల ద్వారానే 

చావులు, దినాలు సైతం.. 

 విద్యా వ్యవహారాలూ దాంతోనే ముడిపడి 

కడప నగరానికి చెందిన రంజిత్‌కుమార్‌కు.. ప్రొద్దుటూరుకు చెందిన కీర్తితో ఆరు నెలల క్రితం వివాహం నిశ్చయమైంది. జూలై 26న పెళ్లి నిర్వహించేందుకు ఇరువైపులా ఉన్న పెద్దమనుషులు ఒప్పుకుని తేదీలను ఖరారు చేశారు. అయితే ఇంతలోనే కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. వారి జాతకాల ప్రకారం ఆ తేదీన ముహూర్తం బాగుండటంతో పెద్దలు పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు. తీరా అనుమతుల కోసం వెళ్తే కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో నిబంధనలు అనుసరించి కేవలం కొద్దిమందికి మాత్రమే అనుమతిస్తామని చెప్పారు.

అప్పటికే వివాహం గురించి పత్రికలు పంపిణీ చేద్దామని ఆలోచించిన పెద్దమనుషులకు వారి బంధువులంతా స్మార్ట్‌గానే పత్రికలు పంపండి. మేము వచ్చేస్తామని చెప్పారు. దీంతో పెళ్లిపత్రికలు సైతం మొబైల్, సోషల్‌మీడియా ద్వారా బంధువులు, స్నేహితులకు పెళ్లిపత్రికలు పంపారు. పెళ్లిరోజున ఎక్కువ మందికి అనుమతులు లేకపోవడంతో బంధువులు, స్నేహితులందరూ పెళ్లిని వీక్షించేందుకు అందరికీ సోషల్‌మీడియా ద్వారా లింక్‌ పంపారు. ఈ లింక్‌ ద్వారా నేరుగా వారి పెళ్లిని లైవ్‌ద్వారా వీక్షించి నూతన దంపతులను ఆశీర్వదించారు. ఇలా పెళ్లిసైతం స్మార్ట్‌గా పూర్తవడం గమనార్హం. 

వైవీయూ : రక్త సంబంధాలు, చుట్టరికాలు, కష్టసుఖాల్లో పాలు పంచుకునే ఆత్మీయ బంధాలు నేడు కరోనా వల్ల కరువవుతున్నాయి. ఎవరిళ్లకు ఎవరూ వెళ్లే అవకాశం లేకపోవడంతో కష్టమొచ్చినా.. సుఖమొచ్చినా స్మార్ట్‌ ఫోన్‌ మాధ్యమంగా మారిపోయింది. శుభవార్తలెలా ఉన్నా.. కష్టకాలంలో కనీసం వారి వద్దకు వెళ్లి కనబడి భుజంతట్టి ఓదార్చే పరిస్థితి లేదు. ఎక్కడికి వెళ్తే ఎక్కడ కరోనా మహమ్మారి అంటుకుంటుందోనన్న భయం అందరినీ ఇంటికే పరిమితం చేస్తోంది. అన్నింటినీ ఫోన్‌ ద్వారానే మానేజ్‌ చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. నగరం, పట్టణం, గ్రామాలు అన్న తేడా లేకుండా అందరూ ఫోన్ల ద్వారానే కుశలప్రశ్నలు వేసుకోవడం, ఓదార్పు మాటలు చెప్పుకోవడం, కరోనా జాగ్రత్తలు చెప్పడం నిత్యకృత్యమయ్యాయి. 

పీహెచ్‌డీ వైవాలు సైతం.. 
ఐదేళ్ల పాటు సంవత్సరాల పాటు తాను చేసిన పరిశోధనలను సమర్పించి అధ్యాపకులందరిచే ఆమోద ముద్ర వేసుకుని డాక్టరేట్‌ పట్టా అందుకునేందుకు నిర్వహించే వైవా సైతం స్మార్ట్‌గా నిర్వహించడం విశేషం. వైవీయూలో ఇప్పటి వరకు ప్రొద్దుటూరు ఇంజినీరింగ్‌ కళాశాల నుంచి ఒకరు, వైవీయూ తెలుగుశాఖ నుంచి ఒకరు ఇలా స్మార్ట్‌గా ఆన్‌లైన్‌ విధానంలో వైవా నిర్వహించి పీహెచ్‌డీ పట్టా పొందడం విశేషం. అదే విధంగా పిల్లలకు నిర్వహించే ఆన్‌లైన్‌ పాఠాలు అంతా స్మార్ట్‌ మయం అయిన విషయం తెలిసిందే. 

లైవ్‌ స్ట్రీమింగ్‌తో వీక్షించవచ్చు.. 
ప్రస్తుతం పెళ్లిళ్లకు ఎక్కువ మందిని అనుమతించకపోవడంతో సన్నిహితులు, బంధువులు, స్నేహితులు ఇలా అందరూ పెళ్లిని చూసేందుకు ఉన్నంతలో ఉత్తమ మార్గం లైవ్‌స్ట్రీమింగ్‌. దీన్ని స్మార్ట్‌ఫోన్‌ ఉన్న ప్రతి ఒక్కరికి లింక్‌ పంపితే.. ఆ లింక్‌ ద్వారా పెళ్లిని నేరుగా వీక్షించవచ్చు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో పెళ్లికి వెళ్లలేని వారందరూ లైవ్‌లో చూస్తూ ఆశీర్వదిస్తున్నారు. ప్రస్తుతం ఇదే ట్రెండ్‌ పెళ్లిళ్లు, ఫంక్షన్‌లలో నడుస్తోంది. – గణేష్, ఫొటోగ్రాఫర్, మంత్ర ఫొటోస్టూడియో, కడప 

భవిష్యత్‌ అంతా స్మార్ట్‌ వర్కే.. 
ఇప్పటికే చదువులు అంతా ఆన్‌లైన్‌తో స్మార్ట్‌మయం అయ్యాయి. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు సైతం హోం టు వర్క్‌పేరుతో సేవలు అందిస్తున్నారు. ఇంటర్వ్యూలు, సమావేశాలు, సమీక్షలు సైతం స్కైప్, గూగుల్‌మీట్‌ తదితర మాధ్యమాల ద్వారా నిర్వహిస్తున్నారు. రానున్న రోజుల్లో ‘స్మార్ట్‌’వినియోగం మరింత పెరుగుతుంది. 
– ధావన్‌ కుమార్, ఎంసీఏ, ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్, ఐటీ నిపుణుడు, కడప 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top