రూల్స్.. రిజర్వేషన్లకు పాతర! | Notification issued for filling 32 Principal vacancies zone wise | Sakshi
Sakshi News home page

రూల్స్.. రిజర్వేషన్లకు పాతర!

Jun 4 2026 4:53 AM | Updated on Jun 4 2026 4:58 AM

Notification issued for filling 32 Principal vacancies zone wise

అస్మదీయులను అందలం ఎక్కించడమే లక్ష్యంగా బాబు పాలన 

సబ్బవరం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌గా నివేదిత అడ్డగోలు నియామకం

అధికార పార్టీ ఎమ్మెల్సీ చిరంజీవి భార్య కావడమే అర్హత  

32 ప్రిన్సిపాల్‌ ఖాళీలు ఉంటే 40వ స్థానంలో ఉన్న నివేదితకు అందలం 

జాబితాలో సీనియర్లు, దళిత, బీసీ లెక్చరర్లను పక్కన పడేసిన వైనం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం రూల్స్, రిజర్వేషన్లను తుంగలో తొక్కుతూ కూటమి నేతల కుటుంబ సభ్యులకు పోస్టులు కట్టబెట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు (చిరంజీవి) భార్య టీఎంఏ నివేదితకు నిబంధనలను కాలరాస్తూ ఏకంగా ప్రిన్సిపాల్‌ పోస్టింగ్‌ ఇవ్వడం విస్తుగొలుపుతోంది. ఇటీవల ఉన్నత విద్య కమిషనర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో జోన్ల వారీగా 32 ప్రిన్సిపాల్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఇందులో సీనియార్టీ ప్రకారం అధ్యాపకుల జాబితాను సిద్ధం చేశారు. 

అయితే, తొలుత 2008 బ్యాచ్‌కు చెందిన ఎమ్మెల్సీ చిరంజీవి భార్య నివేదితకు 50 మంది సీనియార్టీ జాబితాలో 17వ స్థానం ఇచ్చారు. దీనిపై సీనియర్‌ లెక్చరర్లు లిఖిత పూర్వకంగా కమిషనరేట్‌కు ఫిర్యాదు చేయడంతో జాబితాను సవరించారు. రెండో జాబితాలో సీనియార్టీ ప్రకారం 40వ స్థానం వ చ్చింది. అయితే, 32 ప్రిన్సిపాల్‌ పోస్టులు ఖాళీగా ఉంటే..  సీనియర్లను కాదని, ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా అధ్యాపకులను వెనక్కి నెట్టి ఏకంగా సబ్బవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌గా  నివేదితను నియమించడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. 

ప్రతి అడుగూ అక్రమమే.. 
ఎమ్మెల్సీ చిరంజీవి భార్య నివేదిత జోన్‌–3కి చెందిన లెక్చరర్‌. 2009లోనే జోన్‌–1కు బదిలీ చేయించుకున్నారు. ఫలితంగా జోన్‌–1లో సు­న్నా నుంచి సర్వీసు ప్రారంభించా­రు. అంటే, 2008లో జోన్‌–1లో ప్ర­భుత్వ డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్లుగా నియామకం పొందిన వారి సర్వీసు కంటే నివేదిత సర్వీసు జూనియర్‌. ఏడాదిన్నర కిందట వరకు సబ్బవరం డిగ్రీ కళాశాలలో బోటనీ లెక్చరర్‌గా పని చేసేవారు. అప్పుడే ఎమ్మెల్సీ చిరంజీవి తన రాజకీయ, అధికార బలంతో పథకం ప్రకారమే సబ్బవరం నుంచి విశాఖ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు (అటానమస్‌) దొడ్డిదారి జీవోతో బదిలీ చేయించుకున్నారు. 

ఒకవైపు రెండు వేల మంది డిగ్రీ అధ్యాపకులు బదిలీల కోసం నిరీక్షిస్తుంటే  ఎమ్మెల్సీ చిరంజీవి మాత్రం అధికారాన్ని అడ్డంపెట్టుకుని భార్యకు న చ్చిన చోట పోస్టింగు వేయించుకున్నారు. తాజాగా ప్రిన్సిపాల్‌ ఖాళీల భర్తీల సమయంలో రూల్స్, రిజర్వేషన్లను కాలరాస్తూ సీనియార్టీ, దళిత సామాజిక వర్గాలకు చెందిన మహిళా ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేస్తూ ఏకంగా సొంత నియోజకవర్గం సబ్బవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకే ప్రిన్సిపాల్‌ను చేసేశారు.  

వీరి బాధలు వర్ణనాతీతం
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. రెండేళ్లుగా బదిలీల కోసం ఎదురు చూస్తూ విసిగిపోయారు. పదేపదే ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. ఎయిడెడ్‌ కళాశాలల నుంచి ప్రభుత్వంలో విలీనమైన సిబ్బందికి సర్వీసు రూల్స్‌ రూపొందించలేదనే సాకుతో బదిలీలను ఆపేస్తున్నారు. 

ఇప్పటికీ సర్వీసు రూల్స్‌ ఫైల్‌ను ఉన్నత విద్య కార్యదర్శి క్లియర్‌ చేయకుండా వేధింపులకు గురి చేస్తుండటం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు రెండు వేల మంది డిగ్రీ అధ్యాపకులు బదిలీల కోసం నిరీక్షిస్తుంటే  ఎమ్మెల్సీ చిరంజీవి మాత్రం అధికారాన్ని అడ్డంపెట్టుకుని భార్యకు నచ్చిన చోట (సబ్బవరం నుంచి విశాఖ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు) పోస్టింగు వేయించుకోవడమూ అప్పట్లో చర్చనీయాంశమైంది.  

ఖాళీలు చూపించని పోస్టుకు.. పోస్టింగా?
పీలేరు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ మే 31న పదవీ విరమణ పొందారు. అంతకు ముందు ఉన్నత విద్య కమిషన్‌ ఇ చ్చిన ప్రిన్సిపాల్స్‌ పోస్టుల ఖాళీల్లో పీలేరు ప్రిన్సిపాల్‌ పోస్టు ఖాళీ చూపించలేదు. ఫలితంగా ఆ కళాశాలను ఎవరూ ఎంపిక చేసుకోలేదు. కానీ, హఠాత్తుగా చిత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పని చేస్తున్న కామర్స్‌ లెక్చరర్‌ టి.వినీలకు పీలేరు ప్రిన్సిపాల్‌గా పోస్టింగ్‌ ఇచ్చేశారు. ఇదంతా ఎవరి కోసం... ఎవరు చేశారో ఉన్నత విద్యా కమిషనరేట్‌ స్పష్టం చేయాలని అధ్యాపకులు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement