
నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ చికిత్సల్లేవు
ఆస్పత్రులకు రూ.3 వేలకోట్లకుపైగా ప్రభుత్వ బకాయిలు
సీఎఫ్‌ఎంఎస్‌లోని రూ.670 కోట్లు విడుదల చేస్తే సేవలు పునరుద్ధరిస్తామంటున్న యజమానులు
అయినా.. ప్రజారోగ్య పరిరక్షణకు నిధులివ్వని కూటమి సర్కారు
యోగా డే, విజన్ డాక్యుమెంట్, జీఎస్టీ వేడుకలు.. ఇలా ఈవెంట్స్‌కు మాత్రం రూ.కోట్ల వరద
సాక్షి, అమరావతి: ఏ కార్యక్రమాన్నైనా ప్రచారానికి పనికొచ్చేలా ఈవెంట్ల మాదిరిగా నిర్వహించేందుకు కోట్లు కుమ్మరించే కూటమి సర్కారు.. ప్రజారోగ్యానికి మాత్రం నిధులు ఇవ్వడంలేదు. బకాయిలు చెల్లించకపోతే ఆరోగ్యశ్రీ చికిత్సల్ని ఆపేస్తామంటూ నెట్‌వర్క్ ఆస్పత్రులు హెచ్చరించినా పట్టించుకోనట్లే వ్యవహరించింది. ఆరోగ్యశ్రీ కింద చికిత్సల్ని ఆపేసి రోజులు గడుస్తున్నా ప్రభుత్వం స్పందించడంలేదు. పేదప్రజలు ఆస్పత్రుల్లో చికిత్స అందక, డబ్బు చెల్లించి వైద్యం చేయించుకోలేక నరకయాతన అనుభవిస్తున్నారు.
జూన్ నెలలో యోగా డే ఈవెంట్ కోసం రూ.వందకోట్లకుపైగా ప్రజాధనాన్ని ప్రభుత్వం ఖర్చుచేసింది. విజన్ డాక్యుమెంట్ విడుదలకు సరేసరి. జీఎస్టీ 2.0 వేడుకలకు రూ.65 కోట్లు వెచ్చించింది. కమీషన్లు ఇచ్చిన కాంట్రాక్టర్లకు వేగంగా బిల్లులు జమ చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల ఆడంబరాలు, హంగులు, ప్రచారాల కోసం నిధుల దుర్వినియోగం గురించి చెప్పనక్కర్లేదు.
ఈవెంట్స్, దుబారా ఖర్చులకు రూ.వందల కోట్లు వెచ్చిస్తున్న ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణలో అత్యంత కీలకమైన ఆరోగ్యశ్రీ పథకానికి మాత్రం నిధులు విదల్చడం లేదు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులకు రూ.3 వేల కోట్లకుపైగా ప్రభుత్వం బకాయి పడింది. ఈ బిల్లుల కోసం ఆస్పత్రుల యజమానులు సమ్మెలోకి వెళ్లి నెలరోజులు దాటింది. దీంతో పేదలు.. ముఖ్యంగా కిడ్నీ, గుండె, మెదడు సంబంధిత జబ్బులు, కేన్సర్ బాధితుల పరిస్థితి దయనీయంగా మారింది.
బకాయిల్లో 22 శాతం నిధులు కూడా విడుదల చేయని దుస్థితి
చంద్రబాబు సర్కారు వచ్చిన నాటినుంచి నెట్‌వర్క్ ఆస్పత్రులకు బిల్లుల చెల్లింపుల వ్యవస్థ పూర్తిగా గాడితప్పింది. వాస్తవానికి ఆస్పత్రుల నుంచి బిల్ అప్‌లోడ్ చేసిన 40 రోజుల్లో ప్రాసెస్ చేసి నిధులు చెల్లించాలి. అయితే 13 నెలలుగా ఈ ప్రభుత్వం క్లెయిమ్స్‌ను కనీసం ప్రాసెస్ చేయకుండా నిలిపేసింది. రూ.2,500 కోట్ల మేర విలువైన 10 లక్షలకు పైగా క్లెయిమ్‌లు ట్రస్ట్‌స్థాయిలోనే ప్రాసెస్ కాకుండా ఆగిపోయాయి.
మరో రూ.670 కోట్లకు పైగా బిల్లులు సీఎఫ్‌ఎంఎస్‌లో కొన్ని నెలలుగా మూలుగుతున్నాయి. దీంతో విసుగెత్తిపోయిన నెట్‌వర్క్ ఆస్పత్రులు బిల్లులు విడుదల చేయాలనే డిమాండ్‌తో గత నెల 15వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్లాయి. ఈ నెల 10 నుంచి సేవలు పూర్తిగా నిలిపేసి సమ్మెను మరింత ఉధృతం చేశాయి. ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చిన సమయంలోనే సీఎఫ్‌ఎంఎస్‌లోని బిల్లులను వెంటనే విడుదల చేయాలని, లేదంటే సేవలు నిలిపేస్తామని హెచ్చరించాయి.
అంటే మొత్తం పెండింగ్ బిల్లుల్లో కేవలం 22 శాతం చెల్లించాలని ప్రాధేయపడినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆస్పత్రుల నుంచి రోజురోజుకు ఒత్తిడి పెరుగుతుండటంతో సేవలు నిలిచిపోతే ప్రజలు ఇబ్బందులు పడతారని చెప్పాలని వైద్యశాఖ ఉన్నతాధికారులు, తమ సమస్యలను నేరుగా వినిపించాలని ఆస్పత్రుల నిర్వాహకులు వెళ్లినా.. ఆర్థికశాఖలో అపాయింట్‌మెంట్ కూడా దొరకలేదని తెలిసింది.
1.42 కోట్లకు పైగా కుటుంబాలకు ఆరోగ్య భరోసానిచ్చే ఆరోగ్యశ్రీ పథకం సేవలు అందిస్తున్న తమ సమస్యలు వినడానికి ఇటు ఉన్నతాధికారులు, అటు ప్రభుత్వ పెద్దలు సమయం కేటాయించడం లేదని వైద్యులు మండిపడుతున్నారు. అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకుండా ముఖం చాటేశారని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ష్.. గప్‌చుప్..
సీఎంతో చర్చించి సమస్యలను పరిష్కరిస్తానంటూ ఈ నెల 9న వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు. సేవలు ఆపవద్దని ఆస్పత్రులను అభ్యర్థించారు. అయితే మంత్రి హామీలన్నీ నీటిమీద మూటలేనని ఆస్పత్రుల ప్రతినిధులు యథావిధిగా సమ్మెలోకి వెళ్లిపోయారు. వీరు పూర్తిస్థాయి సేవలు ఆపేసి వారం రోజులవుతున్నా ఇటు మంత్రి, అటు సీఎం నుంచి ఎటువంటి చర్యలు లేవు. వైద్యసేవలు అందక, చికిత్సకు అప్పులు పుట్టక పేదలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నా సర్కారుకు చీమకుట్టినట్లు కూడా లేదు.