
సాక్షి, విజయవాడ: స్పష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే డాక్టర్ అట్లూరి నమ్రతతో సహా 8 మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే కేసుల నేపథ్యంలో.. నగరంలోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ను రాత్రికి రాత్రే ఎత్తేసినట్లు తెలుస్తోంది. సెంటర్‌కి ఉన్న బోర్డులను తొలగించడంతో పాటు సెల్లార్‌లో ఉన్న రెండు కార్లు మాయం అయ్యాయి. అదే సమయంలో..
విజయవాడ సెంటర్‌కు అనుమతులు లేవని, అక్రమంగా నిర్వహిస్తున్నారని జిల్లా వైధ్యాధికారులు నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో సోమవారం ఉదయం సెంటర్‌కు ఉన్న బోర్డులు మాయం కావడం గమనార్హం. ఉదయం 11గం. అయినా సిబ్బంది సెంటర్‌కు రాలేదు. మరోవైపు ల్యాబ్ ఇంఛార్జి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పై వచ్చిన ఆరోపణలపై అధికారులు చర్యలు సిద్ధం అవుతుండగా.. డాక్టర్ కరుణ, డాక్టర్ వైశాలి, మిగతా సిబ్బంది సైతం అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. మరోవైపు.. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సెంటర్ వద్దకు చేరుకుని పరిశీలనలు జరుపుతున్నారు.
సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో దర్యాప్తు లోతుల్లోకి వెళ్లే కొద్దీ.. సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మరొకరి వీర్యకణాలతో సంతానం కలిగించడం లాంటి గలీజు దందా ఓ కేసు ద్వారా బయటపడింది. సికింద్రాబాద్‌లో ఇది చోటు చేసుకోగా.. అటుపై విజయవాడ, విశాఖపట్నంలోసెంటర్‌లలోనూ ఇంతకు మించే వ్యవహారాలు జరిగాయని తేలింది. వేరే మహిళకు పుట్టిన బిడ్డను తీసుకొచ్చి.. సరోగసి ద్వారా పుట్టిందని నమ్మించే ప్రయత్నాలు జరిగాయని వెల్లడైంది.

గతంలోనూ ఈ సెంటర్లపై ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. పేద మహిళలకు డబ్బు ఆశ చూపి సరోగసికి ఒప్పించి పిల్లలు లేని వారి నుంచి లక్షలు రూపాయలు వసూలు చేసింది డాక్టర్ నమ్రతా. ఢిల్లీకి చెందిన గర్భిణిని ఫ్లైట్‌లో విశాఖకు తీసుకొచ్చి .. కోల్‌కతాలోని ఓ దంపతులకు సరోగసి బిడ్డగా అప్పగించింది. ఇందుకుగానూ రూ.30 లక్షలు వసూలు చేసి.. ఇదే విధంగా కోట్ల రూపాయల దందా చేసినట్లు తేలింది. దీంతో ఆమెపై కేసు నమోదు కావడంతో పాటు సెంటర్‌లకు సీజ్ పడడం, ఆమె లైసెన్స్‌లు రద్దు కావడం జరిగిది. అయితే..
తీగలాగితే..
సికింద్రాబాద్ యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ కేంద్రం ఘటనతో.. శనివారం ఉత్తర మండలం డీసీపీ సాధనరష్మి పెరుమాళ్, డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటి, రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా వీర్య సేకరణ, ఐవీఎఫ్, సరోగసీ విధానం తదితర అంశాలను అధికారులు గుర్తించారు. ఇదే సమయంలో విశాఖపట్నం, విజయవాడల్లోనూ సోదాలు చేపట్టారు. ఏపీ, తెలంగాణ, ఒడిశా, కోల్‌కతాలలో యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీవారు బ్రాంచీలు నిర్వహిస్తున్నట్టు నిర్ధారణకు వచ్చారు.
ఆసుపత్రి నిర్వాహకులపై గతంలో హైదరాబాద్ కేపీహెచ్‌బీ, గోపాలపురం పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. నమ్రత వైద్యురాలి లైసెన్స్ రద్దు చేసినా(గతంలో) మరొక వైద్యురాలి పేరుతో అక్రమ సరోగసీ దందా కొనసాగిస్తున్నట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ తరుణంలో.. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఆగడాలపై పోలీసుల ఆరాలు తీయగా షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. వ్యాపార అభివృద్ధి కోసం బీహార్ నుంచి పూజారులను రప్పించి మరీ 9 రోజులపాటు నమ్రత హోమాలు చేయించింది.

బెజవాడ సృష్టిలో.. డాక్టర్ కరుణ, డాక్టర్ సోనాలి, డాక్టర్ వైశాలి ఆధ్వర్యంలో సెంటర్‌ను నమ్రత నడిపిస్తోంది. ఇటు విశాఖలోనూ మహారాణిపేట పీఎస్ పరిధిలోని సెంటర్‌లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. 2023లోనే వీటి లైసెన్లు ముగిశాయి. అయినా కూడా రెండు ఫ్లోర్‌లలో అనధికార సెంటర్లు నడుపుతున్నట్లు గుర్తించారు. అక్కడి మేనేజర్ కళ్యాణిని అదుపులోకి తీసుకుని.. కీలక రికార్డులు స్వాధీనపర్చుకున్నారు. ఇక్కడా ఇతర డాక్టర్ల లైసెన్స్‌ల మీద నమ్రత నడిపిస్తున్న దందా బయటపడింది.
నమ్రతకు నమ్మిన బంటుగా కల్యాణి..
విశాఖ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌లో మేనేజర్‌గా పని చేసిన కల్యాణి అరాచకాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. పేద మహిళలకు డబ్బు ఆశ చూపడంలో కల్యాణి నెట్ వర్క్ కీలకమని, వాళ్లకు బ్రెయిన్‌వాష్ చేయడంలో కల్యాణి సిద్ధహస్తురాలిగా మారిందని పోలీసులు గుర్తించారు. 2020 నుంచి నమ్రతతో కలిసి పని చేస్తున్న కల్యాణి.. గతంలో ఓ ఆసుపత్రిలో నర్సుగా పనిచేసింది. అయితే ఈ ఐదేళ్లలో నర్సు నుంచి ఏకంగా ఓ యూనిట్ మేనేజర్‌గా ఆమె ఎదిగడం కొసమెరుపు.