సహాయం కోసం మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలుస్తాం
భూములు కోల్పోతున్న చేబ్రోలు మండలం నారా కోడూరు గ్రామస్తులు
గుంటూరు వెస్ట్: ఔటర్ రింగ్ రోడ్డు పేరుతో చిన్న, సన్నకారు రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందుల పాల్జేస్తోందని, ఖరీదైన పొలాలు రింగ్ రోడ్డులో పోతే తమ జీవితాలు రోడ్డున పడతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారా కోడూరు ప్రాంత రైతులు సుమారు 150 మంది సోమవారం గుంటూరులోని కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్‌కు తమ గోడు వెళ్లబోసుకుని చంద్రబాబు సర్కారుపై ఫిర్యాదు చేశారు. నారా కోడూరు ప్రాంతంలో ఔటర్‌రింగ్ రోడ్డు పేరిట సుమారు 650 ఎకరాల పచ్చని పొలాలను అక్రమంగా తీసుకుంటున్నారని వారు వాపోయారు. ఈ రోడ్డుకు సుమారు 80 ఎకరాలు అవసరం అవుతుందని, అంతవరకు ఇవ్వడానికి తమకు ఇబ్బంది లేదని చెబుతున్నారు.
అయితే అవసరం లేకపోయినా పచ్చని పొలాలను తీసుకుంటే సహించేది లేదంటున్నారు. 2014–19 కాలంలో రాజధాని పేరిట సుమారు 35 వేల ఎకరాలు రైతుల నుంచి తీసుకుని వారిని ఇప్పటికీ వేధింపులకు గురిచేస్తున్న పరిస్థితిని చూస్తున్నామన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జిల్లా రైతులను ఇబ్బందులు పెట్టలేదని.. జగనన్న కాలనీల కోసం తీసుకున్న భూములకు క్రమం తప్పకుండా డబ్బులు కూడా చెల్లించారని గుర్తు చేసుకున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌తో పాటు ఇతర నాయకులను కలిసి తమ పరిస్థితిని వివరించి సహాయం కోరుతామని చెబుతున్నారు.
రాజకీయ క్రీడ ఆడుతున్నారా ?
ఇటీవల కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పొన్నూరు ఎమ్మెల్యే నరేంద్ర నారా కోడూరు ప్రాంత రైతులను కలిసి వివరాలు అడిగారని రాంబాబు అనే రైతు తెలిపాడు. రైతుల తరఫున పోరాటం చేస్తామన్నారని.. అయితే వారికి తెలియకుండానే భూములకు మార్కింగ్ జరిగిందా? అని నిలదీస్తున్నారు. తమతో రాజకీయ క్రీడలు ఆడితే భవిష్యత్ గల్లంతేనని హెచ్చరిస్తున్నారు. చిన్న, సన్నకారు రైతులపై ప్రభుత్వం ఎందుకు కక్ష కడుతుందో అర్థం కావడం లేదంటున్నారు. గ్రామసభ కూడా నిర్వహించకుండా, రైతులకు చెప్పకుండా భూములు తీసుకుంటామనడం దారుణమన్నారు. రైతుల ఉసురు తగిలితే ప్రభుత్వాలు మనుగడ సాగించలేవని రైతులంతా చెబుతున్నారు.


