ఎంపీ రఘురామ విడుదల వాయిదా

MP Raghurama Krishnam Raju release postponed - Sakshi

సాక్షి, గుంటూరు: ఎంపీ రఘురామకృష్ణ రాజు విడుదల మరో నాలుగు రోజుల పాటు వాయిదా పడింది. ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారిని కించపరుస్తూ, ఓ సామాజిక వర్గాన్ని, మతాన్ని టార్గెట్‌ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేసిన రఘురామకృష్ణరాజుపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేసి.. అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వైద్య పరీక్షల నిమిత్తం ఆయన్ని సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

ఈ నేపథ్యంలో ఆయనకు సుప్రీంకోర్టు 21వ తేదీన షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. బెయిల్‌ పొందడానికి అవసరమైన పత్రాలు, ష్యూరిటీ బాండ్‌లను రఘురామకృష్ణ తరపు న్యాయవాది లక్ష్మీనారాయణ గుంటూరు సీఐడీ కోర్టులో సోమవారం దాఖలు చేశారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణ ఆరోగ్య పరిస్థితిపై మెజిస్ట్రేట్‌ ఆరా తీశారు. మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఆస్పత్రిలో ఎంపీకి చికిత్స అవసరమని వైద్యులు సూచించారని న్యాయవాదులు మెజిస్ట్రేట్‌కు చెప్పారు. ఎంపీ ఆరోగ్యం కుదుటపడ్డాక డిశ్చార్జి సమ్మరీతో కలిపి బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయాలని మెజిస్ట్రే ట్‌ ఆదేశించారు. దీంతో రఘురామకృష్ణరాజు విడుదల వాయిదా పడింది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top