సెల్‌ఫోన్‌ వాడకంతో మాటలు రాని చిన్నారులు | Mobile Addiction in Children | Sakshi
Sakshi News home page

మాటరాని మౌనమిది!.. వైద్యుల వద్దకు తల్లిదండ్రుల క్యూ

Jun 23 2025 5:55 AM | Updated on Jun 23 2025 6:04 AM

Mobile Addiction in Children

మాటరాని మౌనమిది!

మూడేళ్లయినా మాటలు రాని చిన్నారులు

పదాలు పలికేందుకు ఇబ్బందులు

సెల్‌ఫోన్‌ వాడకమే కారణమంటున్న వైద్యులు

చిన్నపిల్లల వైద్యుల వద్దకు తల్లిదండ్రుల క్యూ

కర్నూలు వెంకటరమణకాలనీకి చెందిన శివరాముడుకి ఒక కుమారుడు ఉన్నాడు.  పాలుతాగాలన్నా, ఏదైనా తినాలన్నా మొబైల్‌ ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఆ బాలునికి మూడేళ్ల వయస్సు. ఇప్పటికీ ఆ బాలుడికి మాటలు రావడం లేదు.

కర్నూలుకు చెందిన లలితకుమారికి భర్త ఇటీవలే మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారున్ని అల్లారుముద్దుగా పెంచేందుకు ఆమె రెండేళ్ల వయస్సు నుంచే పిల్లాడిని గారాబం ఎక్కువ చేసింది. ఈ క్రమంలో ఆ బాలుడు సెల్‌ఫోన్‌కు ఎక్కువగా బానిసయ్యాడు. అర్ధరాత్రి 2 గంటలైనా సెల్‌ఫోన్‌ చూస్తూ గడిపేవాడు. ఈ క్రమంలో బాలుడు నాలుగేళ్ల వయస్సు వచ్చినా మాట్లాడటం లేదు.

ఒకప్పుడు చంటిపిల్లలకు చందమామను చూపి గోరుముద్దలు తినిపించేవారు. ఆ తర్వాత తరం వారు వీధిలోకి వెళ్లి జంతువులు, ఇతర పిల్లలను చూపిస్తూ అన్నం పెట్టేవారు. గత తరం వారు టీవీలో కార్టూన్‌ బొమ్మలు చూపించి పిల్లలకు భోజనం పెట్టేవారు. కానీ నేటితరం మాత్రం మొబైల్‌ చేతికిచ్చి భోజనం తినిపిస్తున్నారు.  అలవాటైన చిన్నారులు రాత్రింబవళ్లూ మొబైల్‌ కావాలంటున్నారు. దీంతో వారికి మూడేళ్ల వయస్సు వచ్చినా  మాటలు రాని పరిస్థితి నెలకొంటోందని, చిన్న పదాలు కూడా పలకడం లేదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. – కర్నూలు(హాస్పిటల్‌)

ఒకప్పుడు ప్రతి ఇంట్లో పిల్లలకు అమ్మానాన్నలతో పాటు తాతయ్య, నానమ్మ, చిన్నాన్న, చిన్నమ్మ, అత్తమ్మలు ఉండేవారు. వీరందరూ పిల్లలను ఆడిస్తూ పెంచేవారు. బయటకు తీసుకెళ్లి ప్రపంచాన్ని చూపించి పిల్లలను ఆనందింపజేసేవారు. ఇప్పుడు ఇంట్లో ఎంత మంది ఉంటే అందరూ బిజీగా మారారు. చిన్నకుటుంబాలు ఎక్కువ కావడంతో పిల్లలను ఆడించేవారు కరువయ్యారు. వారికి సెల్‌ఫోన్‌లో వచ్చే ఆటలే ఆటవస్తువులుగా మారాయి. అందులో వచ్చే కార్టూన్‌ బొమ్మలను, రంగులను చూసి పిల్లలు ఆకర్షితులు అవుతున్నారు. రెండేళ్ల వయస్సు కూడా రాకముందే పెద్దల కంటే మిన్నగా మొబైల్‌ను ఆపరేట్‌ చేసేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. వారి ఉత్సాహం, చైతన్యం చూసి ఆ వయస్లులోని చిన్నారులను చూసి ఇంట్లో తల్లిదండ్రులతో పాటు పెద్దలు కూడా ఎంతో సంతోషిస్తున్నారు.  

మాట ముచ్చట కురువై.. 
అతి చిన్న వయస్సులోనే సెల్‌ఫోన్‌లోని ఫీచర్లను వాడేయడం, యూట్యూబ్‌తో పాటు సోషల్‌ మీడియాను ఎలా వాడాలో పెద్దలకు చూపించడం వంటివి నేర్వడంతో సంతోషించడం పెద్దల వంతైంది. ఈ క్రమంలోనే వారికి మూడేళ్లు వచ్చినా మాటలు రాకపోవడం చాలా మంది గమనించలేకపోతున్నారు. ఒకప్పుడు ఏడాదిన్నరకే అమ్మా నాన్నతో పాటు అవ్వా తాత, అత్తమ్మ, మామ అనే చిన్న చిన్న పదాలు పలికేవారు. రెండేళ్ల వయస్సుకు పొట్టిపదాలతో మాట్లాడేవారు. మూడేళ్లకు వచీ్చరానీ మాటలతో గలగలా మాట్లాడుతూ అల్లరి చేసేవారు. ఇప్పుడు ఏ ఇంట్లో చూసినా ఆ ముచ్చటే కరువైంది. పెద్దలతో పాటు పిల్లలు కూడా సెల్‌ఫోన్‌లకు బానిసలు కావడంతో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మానేశారు. 

చికిత్స కోసం ఆసుపత్రులకు 
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఆవరణలోని బాలల సత్వర చికిత్స కేంద్రంలో గత ఐదేళ్లలో పుట్టుకతో వచ్చిన లోపాలతో పాటు ఎదుగుదల లోపాలతో వచ్చే చిన్నారులు కూడా ఉన్నారు. వీరిలో అధిక శాతం చిన్నతనంలోనే మొబైల్‌ వాడకం వల్ల మాటలు రాకపోవడంతో పాటు దృష్టిలోపం, వినికిడిలోపం, నేర్చుకోలేకపోవడం, భాష తెలియకపోవడం వంటి లోపాలతో వస్తున్నారు. ఇక్కడే గాకుండా చిన్నపిల్లల విభాగంలోనూ ఇలాంటి చిన్నారులు చికిత్స కోసం వస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రులు,క్లినిక్‌లలోనూ ప్రతిరోజూ పదుల సంఖ్యలో ఇలాంటి చిన్నారులను చూస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు.  

పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం 
చిన్నతనంలో ఎక్కువ సమయం డిజిటల్‌ తెరలను చూడటంతో వారిలో సమాజంలో ఇతరులను కలిసే తత్వం తగ్గుతుంది. పిల్లలు ఆటల పట్ల దృష్టి పెట్టే సమయాన్ని తగ్గిస్తాయి. ఎక్కువసేపు మొబైల్‌ చూసే పిల్లల్లో ఊబకాయం వస్తుంది. ఇది భవిష్యత్‌­లో వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వారు నిద్రించే సమయాన్ని తగ్గిస్తుంది. డిజిటల్‌ తెరల నుంచి వెలువడే నీలికాంతి ఎండోజెనస్‌ మెలటోనిన్‌ను అణిచివేస్తుంది.  

మొబైల్‌కు దూరంగా ఉంచడమే మేలు 
పిల్లల భాషా నైపుణ్య అభివృద్ధికి మొబైల్‌ తెరలే అవరోధంగా నిలుస్తున్నాయి. అల్లరి మాని్పంచేందుకు, ఆహారం తినిపించేందుకు అలవాటు పడిన ఈ మొబైల్‌ ఫోన్‌ వారిని బానసలుగా మార్చుకుంటోంది. ఈ క్రమంలో చిన్నారుల ఎదుగుదలపై అవి తీవ్రంగా ప్రభావాన్ని చూపిస్తోంది. భవిష్యత్‌ ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఇంట్లో తల్లిదండ్రులతో పాటు ఇంట్లోని పెద్దలు సైతం వారి ఇంట్లోని చిన్నారులను మొబైల్‌కు దూరంగా ఉంచే ప్రయత్నం చేయాలి. ఈ మేరకు ముందుగా పిల్లల ముందు పెద్దలు సైతం మొబైల్‌ ఎక్కువగా వాడకుండా ఉండటమే మేలు.

పెద్దలు వాడకపోతే పిల్లలు అటువైపు దృష్టి సారించరు. ఈ సమయంలో పిల్లలు ఆడుకునేందుకు బొమ్మలను కొనివ్వడం, ఆటలు ఆడించడం, మైదానాలు, పార్కులకు తీసుకెళ్లి ఆడించడం, బందువుల ఇళ్లకు తీసుకెళ్లి వారిని పరిచయడం చేయించడం, వారి పిల్లలతో స్నేహం చేయించడం వంటివి చేయాలి. అప్పుడే పిల్లల్లో శారీరక, మానసిక అభివృద్ధి చెందుతుంది.  

Advertisement
 
Advertisement
Advertisement