నేను దేవుడి దగ్గరికి వెళ్లిపోతున్నా..

Missing Degree Student Assassinated In Chittoor - Sakshi

దేవుడి దరికి వెళతానంటూ డిగ్రీ విద్యార్థి అదృశ్యం 

చచ్చి మళ్లీ తమ్ముడికి కొడుకుగా పుడతా  నోట్‌ బుక్‌లో రెండు పేజీల లేఖ 

తల్లిదండ్రులకు అంతులేని వేదన 

విద్యార్థి కోసం గాలిస్తున్న పోలీసులు 

‘అమ్మా.. నాన్నా..! నన్ను క్షమించండి.. నేను దేవుడి దగ్గరికి వెళ్లిపోతున్నా.. ఇలా చేసినందుకు బాధపడకండి.. మీ అంత గొప్ప తల్లిదండ్రులకు బిడ్డగా ఉండే హక్కు నాకు లేదు’ అంటూ మండలంలోని మార్జేపల్లెకు చెందిన గణేష్ (20) లేఖ రాసి అదృశ్యమైన సంఘటన గంగవరం మండలంలో కలకలం రేపింది. వారం కిందట జరిగిన ఈ ఉదంతం బుధవారం ఆలస్యంగా వెలుగుచూసింది. విద్యార్థి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు, పోలీసులు గాలిస్తున్నారు. 

గంగవరం: మండలంలోని మార్జేపల్లెకు చెందిన డిగ్రీ విద్యార్థి గణేష్‌ తాను దేవుడి దగ్గరికి పోతున్నానని లేఖ రాసి అదృశ్యమైన ఘటన తల్లిదండ్రులను శోకసంద్రంలో ముంచింది. గ్రామస్తులు, పోలీసుల కథనం.. మార్జేపల్లెకు చెందిన శివశంకర్, పద్మజ దంపతులకు గణేష్‌ మొదటి సంతానం. ఇతను మండల కేంద్రానికి సమీపంలోని ఓ కళాశాలలో బీకాం డిగ్రీ ఫైనల్‌ చదువుతున్నాడు. చదువుపై బాగా శ్రద్ధ పెట్టి మంచి ఫలితాలు సాధించేవాడు. ఇతర సాంఘిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనేవాడు. వ్యవసాయం, ఇంటి పనుల్లో తల్లిదండ్రులకు తోడ్పడుతూ చక్కగా మసలుకునేవాడు. ఈనెల 21వ తేదీ రాత్రి నోట్‌బుక్‌లో రెండు పేజీల లేఖను రాసి అదృశ్యమయ్యాడు. మోటార్‌ సైకిల్, సెల్‌ఫోన్, కళాశాల పుస్తకాల బ్యాగ్‌ కూడా కనిపించలేదు. అప్పటి నుంచి అతడు ఎక్కడున్నాడో..ఏమయ్యాడోనని నిద్రాహారాలు మాని తల్లిదండ్రులు, బంధువులు పలుప్రాంతాల్లో గాలించారు. ఆచూకీ తెలియక పోవడంతో శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్‌ మీడియా ద్వారా కూడా ఫొటో పోస్టు చేశారు. కుమారుడు లేని ఇంట్లో తల్లిదండ్రులు నరకయాతన అనుభవిస్తున్నారు. వాళ్లను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. అతడు రాసి రెండు పేజీల లేఖ చర్చనీయాంశమైంది. అన్నికోణాల్లో దర్యాప్తు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. సెల్‌ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసి ఉంది. సెల్‌ ఫోన్‌ ఐఎంఏ ద్వారా ఆచూకీ కోసం చర్యలు తీసుకుంటున్నాం. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం.    –సుధాకర్‌రెడ్డి, ఎస్‌ఐ

లేఖలోని ముఖ్య సారాంశం 
‘నాన్న! నన్ను క్షమించండి. నేను దేవుని దగ్గరకు వెళ్లిపోతున్నా.. నేను ఎంత మరిచిపోదామనుకున్నా ఈ బాధ రోజురోజుకూ నరకం చూపిస్తోంది. నటించడం ఇక నావల్ల కాదు. మళ్లీ జన్మంటూ ఉంటే మీ కడుపునే పుట్టాలని ఉంది. మరో జన్మలో అయినా మీరు చెప్పినట్టు నడుచుకునేట్టు ఆ దేవుడిని వరం అడుగుతా. అమ్మా.. నా కోసం మీరు ఎంత ఏడ్చినా నేను ఎక్కడా ఆనందంగా ఉండలేను. నేను అసలు పుట్టనే లేదనుకో. మా తమ్ముడు జాగ్రత్త. వాడే నేననుకో. నాన్నా.. నీకు ఒకవేళ నేను తలవంపులు తెచ్చింటే నన్ను క్షమించు. తమ్ముడికి కొడుకుగా పుడతా.. మళ్లీ నువ్వే నన్ను పెంచి పెద్ద చేయాలి. అప్పుడే నువ్వు చెప్పినట్టు వింటాను.  నేను ఎవరినీ సాధించడానికి ఈ పని చేయలేదు.త మ్ముడూ.. అమ్మానాన్నకు ఇక అన్నీ నువ్వే.’ అంటూ రాసిన ఆ రెండు పేజీల లేఖ ఆ కన్నవారికి తీరని వ్యథ మిగిల్చింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top