మంత్రి లోకేశ్ పేషీ అవినీతి బాగోతం బట్టబయలు
యూనివర్సిటీల పరీక్షా పత్రాల డిజిటలైజేషన్ కాంట్రాక్టు
ఉన్నత విద్యా మండలి అభ్యంతరాలు బేఖాతరు
మూడేళ్లలో రూ.520 కోట్లు చెల్లించేందుకు స్కెచ్
ఒప్పందాలు చేసుకోవాలంటూ వర్సిటీలపై తీవ్ర ఒత్తిడి
30 లక్షల మంది యూనివర్సిటీ విద్యార్థుల జీవితాలతో చెలగాటం
సీబీఎస్‌ఈ డిజటలైజేషన్ ప్రక్రియలో కోంఎప్ట్ బండారం బట్టబయలు
ఇలాంటి కోఎంప్ట్ ఎడ్యూటెక్ సంస్థకు లోకేశ్ పేషీ పెద్దపీట
సాక్షి, అమరావతి: మంత్రి నారా లోకేశ్ మంత్రిత్వ శాఖలో అడ్డగోలు అవినీతి బాగోతాలు విభ్రాంతి కలిగిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా భారీ దోపిడీకి పాల్పడుతున్న వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ఇప్పటికే డీఎస్సీ నియామకాల్లో భారీ అక్రమాలతో యావత్ రాష్ట్రం విస్మయానికి గురైంది. ఇక లోకేశ్ పేషీ అవినీతి మకిలి రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకూ పాకింది.
ఇప్పటికే సీబీఎస్‌ఈ పరీక్షా పత్రాల డిజిటలైజేషన్ ప్రక్రియలో భారీ అవకతవకలతో కోఎంప్ట్ ఎడ్యూటెక్ సంస్థ నిర్వాకంతో యావత్ దేశం అవాక్కయింది. కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి సీబీఎస్‌ఈ బోర్డ్ చైర్మన్, కార్యదర్శులను తొలగించిన విషయం తెలిసిందే. అదే కోఎంప్ట్ సంస్థ నిర్వాకంతో గతంలో తెలంగాణలో 20 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం గమనార్హం. అటువంటి ట్రాక్ రికార్డు ఉన్న కోఎంప్ట్ సంస్థతో మంత్రి లోకేశ్ పేషీ సాగించిన అవినీతి జుగల్‌బందీ తాజాగా బట్టబయలైంది.
ఉన్నత విద్యా మండలి అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ ఏటా రూ.172 కోట్ల చొప్పున రానున్న మూడేళ్లలో దాదాపు రూ.520 కోట్ల కాంట్రాక్టును అడ్డగోలుగా కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. రాష్ట్రంలోని 30 లక్షల మంది యూనివర్సిటీ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ లోకేశ్ పేషీ సాగించిన అవినీతి నిర్వాకం విస్తుగొలుపుతోంది.
డిజిటల్ మూల్యాంకనం ముసుగులో దోపిడీ
హైదరాబాద్‌కు చెందిన కోఎంప్ట్ ఎడ్యూటెక్ సంస్థ ద్వారా మంత్రి లోకేశ్ పేషీ దోపిడీకి తెగబడింది. రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల విద్యార్థుల పరీక్షా పత్రాల డిజిటల్ మూల్యాంకనం ముసుగులో అవినీతికి తెరతీసింది. ఉన్నత విద్యా మండలి అభ్యంతరాలను కూడా బేఖాతరు చేస్తూ అడ్డగోలుగా వ్యవహారం సాగించింది. విశ్వవిద్యాలయాలతో నిమిత్తం లేకుండా ఏపీటీఎస్ ద్వారా కథ నడిపించి.. కోఎంప్ట్ సంస్థకు టెండరు కట్టబెట్టేయడం విస్మయ పరుస్తోంది. నిధుల దోపిడీకి కోఎంప్ట్ ఎడ్యూటెక్ మూడు కేటగిరీల ముసుగులో ప్రతిపాదనలకు లోకేశ్ పేషీ ద్వారా ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది.
ఒక్కో విద్యార్థి పరీక్షా పత్రం మూల్యాంకనం కోసం రూ.32, ఒక్కో పరీక్షా పత్రం ఆన్‌స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్‌ఎం) కోసం రూ.25.75 చొప్పున కోట్ చేసింది. మొత్తం అన్ని ఫీచర్లతో డిజిటలైజేషన్ సేవల కోసం రూ.115 చొప్పున కోట్ చేయడం గమనార్హం. అంతేకాదు కోఎంప్ట్ ఎడ్యూటెక్‌కు కంప్యూటర్లు, ఇతర మౌలిక వసతులను విశ్వవిద్యాలయాలే సమకూర్చాలి. అంటే ఎటువంటి మూల ధన వ్యయం లేకుండానే కేవలం డిజిటల్ ప్రక్రియను మాత్రమే కోఎంప్ట్ సంస్థ నిర్వహిస్తుందని నిబంధన పెట్టడం విడ్డూరంగా ఉంది.
ఆ ప్రతిపాదనలను లోకేశ్ పేషీ ఆమోదించి ఆ మేరకు కోంఎప్‌్టతో ఒప్పందం చేసుకోవాలని విశ్వవిద్యాలయాలపై ఒత్తిడి తెస్తోంది. త్వరలో విశ్వవిద్యాలయాలు అందుకు పచ్చజెండా ఊపనున్నాయి. ఏకంగా మంత్రి లోకేశ్ పేషీ నుంచి ఒత్తిడి వస్తుండంతో తమకు మరోమార్గం లేకుండా పోయిందని విశ్వవిద్యాలయాల అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.
ఏటా రూ.172 కోట్ల ప్రాజెక్టుకు ఎత్తుగడ
విశ్వవిద్యాలయాల పరీక్షా పత్రాల డిజిటలైజేషన్ ముసుగులో కోఎంప్ట్ సంస్థకు భారీ కాంట్రాక్టు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో అన్ని విశ్వవిద్యాలయాల్లో కలిపి మొత్తం 30 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. సెమిస్టర్ విధానంలో మొత్తం విద్యార్థులు అన్ని పరీక్షలకు కలిపి 1.50 కోట్ల బుక్‌లెట్లు (పరీక్షా పత్రాలు) రాస్తారు. ఒక్కో బుక్‌లెట్‌కు రూ.115 చొప్పున ఏడాదికి మొత్తం రూ.172 కోట్ల కాంట్రాక్టును కోఎంప్ట్ కు అడ్డగోలుగా కట్టబెట్టేందుకు లోకేశ్ పేషీ మంత్రాంగం వేగవంతం చేసింది.
ఆ ప్రకారం రానున్న మూడేళ్లలో దాదాపు రూ.520 కోట్ల కాంట్రాక్టు కట్టబెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ ముసుగులో కమీషన్ల రూపంలో భారీ అవినీతికి పన్నాగం పన్నింది. వాస్తవానికి రాష్ట్రంలో పాలిటెక్నిక్ కళాశాలల పరీక్షా పత్రాల డిజిటల్ మూల్యాంకనం కాంట్రాక్టును కోఎంప్ట్ సంస్థకు అప్పగించారు. ఆ సంస్థ డిజిటల్ మూల్యాంకనం ప్రక్రియ కూడా మొదలు పెట్టింది. ఇంతలో సీబీఎస్‌ఈ పరీక్షా పత్రాల మూల్యాంకనంలో కోఎంప్ట్ సంస్థ నిర్వాకం బట్టబయలైంది. దాంతో సాంకేతిక విద్యా మండలి ప్రస్తుతానికి పాలిటెక్నిక్ పరీక్షా పత్రాల డిజిటల్ మూల్యాంకనం నిలుపుదల చేసింది.
కోఎంప్ట్ సంస్థ కొన్ని నెలల క్రితం వరకు రాయలసీమ విశ్వవిద్యాలయంలో డిజిటల్ మూల్యాంకనం చేట్టింది. సీబీఎస్‌ఈ వ్యవహారంతో ప్రస్తుతం నిలిపివేసింది. అయినా సరే రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలు డిజిటల్ మూల్యాంకనం కోసం కోఎంప్ట్ సంస్థతో ఒప్పందం చేసుకోవాలని లోకేశ్ పేషీ తీవ్ర ఒత్తిడి తెస్తుండటం గమనార్హం. విశ్వవిద్యాలయాల రిజిస్ట్రార్లను పిలిపించి మరీ కోఎంప్ట్ సంస్థతో ఒప్పందం చేసుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు. అందుకు టైమ్ లిమిట్ పెట్టి మరీ ఒప్పందం చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారు.
తెలంగాణాలో 20 మంది ఆత్మహత్య
కోఎంప్ట్ నిర్వాకం గతంలో తెలంగాణను హడలెత్తించింది. 2019లో గ్లోబరెనా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌గా ఉన్న ఆ సంస్థ ఇంటర్మీడియట్ పరీక్షా పత్రాల డిజిటల్ మూల్యాంకనం కాంట్రాక్టు దక్కించుకుంది. అడ్డగోలుగా మూల్యాంకనం చేసింది. మొత్తం 9.70 లక్షల మంది విద్యార్థుల్లో 3.80 లక్షల మంది అంటే 40 శాతం మంది ఫెయిల్ అయ్యారు. అది తట్టుకోలేక 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం సృష్టించింది. దాంతో గ్లోబరెనా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌ను తెలంగాణ ప్రభుత్వం బ్లాక్ లిస్టులో పెట్టింది. ఆ తర్వాత ఆరు నెలలకు ఆ సంస్థ తన పేరును కోఎంప్ట్ ఎడ్యూటెక్‌గా మార్చుకోవడం గమనార్హం.
అప్పట్లోనే వెనకేసుకొచ్చిన టీడీపీ ప్రభుత్వం
2013లో అదే గ్లోబరెనా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కాకినాడ జేఎన్‌టీయూలో రూ.230 కోట్ల విలువైన మూడు ప్రాజెక్టులను దక్కించుకుంది. నిబంధనలకు విరుద్ధంగా సింగిల్ టెండర్‌గా అప్పటి జేఎన్‌టీయూ ఉన్నతాధికారులు కాంట్రాక్టు కట్టబెట్టారు. గ్లోబెరేనా టె క్నాలజీస్ ఇ–కంటెంట్ కోసం మలేషియాకు చెందిన ఓ సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఆ కాంట్రాక్టు కింద జేఎన్‌టీయూ గ్లోబెరేనా టెక్నాలజీస్‌కు రూ.20 కోట్లు చెల్లించింది.
అడ్డగోలుగా టెండరు కట్టబెట్టడం, నిబంధనలకు విర్దుద్ధంగా నిధుల చెల్లింపుపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో 2014లో టీడీపీ ప్రభుత్వం విచారణ కమిటీ పేరుతో కనికట్టు చేసింది. కానీ ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. అనంతరం 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ వ్యవహారంపై సమగ్రంగా విచారణ జరిపించి అవినీతిని నిగ్గు తేల్చింది. బిల్లుల చెల్లింపును నిలిపివేసింది. దీనిపై గ్లోబెరేనా టెక్నాలజీస్.. కాంట్రాక్టు మేరకు రూ.230 కోట్లు చెల్లించాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
పేరుమార్చుకుని ఏమార్చిన కోఎంప్ట్
సీబీఎస్‌ఈ పరీక్ష పత్రాల మూల్యాంకనం, డిజిటలైజేషన్ ప్రక్రియలో అవకతవకలతో కోఎంప్ట్ ఎడ్యూటెక్ బాగోతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గతంలో గ్లోబరెనా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌గా ఉన్న ఆ సంస్థను బ్లాక్‌లిస్టు్టలో పెట్టారు. కానీ అదే సంస్థ కోఎంప్ట్ ఎడ్యూటెక్‌గా పేరుమార్చుకుని ఏకంగా కేంద్ర ప్రభుత్వానికే మస్కా కొట్టింది. పరీక్షా పత్రాలను ఆన్‌లైన్‌లో మూల్యాంకనం చేసేందుకు సీబీఎస్‌ఈ ఈ ఏడాది ఆన్ స్క్రీన్ మార్కింగ్ సిస్టమ్ (ఓఎస్‌ఎం) విధానం చేపట్టింది. ఆ కాంట్రాక్టును హైదరాబాద్‌కు చెందిన కోఎంప్ట్ సంస్థ దక్కించుకుంది.
సీబీఎస్‌ఈ పరీక్షా ఫలితాల వెల్లడితో ఆ సంస్థ నిర్వాకం బట్టబయలైంది. విద్యార్థుల మార్కుల్లో భారీ వ్యత్యాసాలు బయటపడ్డాయి. ఎటువంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా పరీక్షా పత్రాలను పబ్లిక్ క్లౌడ్ (ఏడబ్ల్యూఎస్) బకెట్లలో భద్రపరచడం పట్ల సైబర్ నిపుణులు విస్మయం వ్యక్తం చేశారు. డిజిటల్ లీకేజీ బయట పడింది. ఇక పరీక్షా పత్రాలు కంప్యూటర్ స్క్రీన్ మీద సరిగా కనిపించక పోవడం, విద్యార్థులు రాసిన జవాబులకు.. వచ్చిన మార్కులకు పొంతన లేకపోవడం, విద్యార్థులకు రావాల్సిన మార్కుల కంటే తక్కువ మార్కులు వేయడం తదితర లోపాలు వెల్లడయ్యాయి.
అంతేకాదు కోఎంప్ట్ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా సీబీఎస్‌ఈ ఓఎస్‌ఎం కాంట్రాక్టు దక్కించుకున్న వ్యవహారాన్ని సార్థక్ సిద్ధాంత్ అనే 17 ఏళ్ల విద్యార్థి పరిశోధించి మరీ వెలుగులోకి తెచ్చారు. గతంలో బ్లాక్ లిస్టులో ఉన్న సంస్థలకు ఈ టెండర్లలో పాల్గొనడానికి అర్హత లేదనే నిబంధనను కోఎంప్‌్టకు అనుకూలంగా మార్చారు. ప్రస్తుతం బ్లాక్ లిస్టులో ఉన్న సంస్థలకే అర్హత లేదని మార్చడం గమనార్హం. కోఎంప్ట్ కు అడ్డగోలుగా కాంట్రాక్టు కట్టబెట్టేందుకు ఇలా అడ్డగోలుగా వ్యవహరించారు.
గతంలో గ్లోబరెనా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌గా ఉన్న ఈ సంస్థ బ్లాక్ లిస్టులో ఉన్న విషయాన్ని మరుగున పరిచేందుకే కోఎంప్ట్ ఎడ్యూటెక్‌గా పేరుమార్చుకుందన్న విషయం వెలుగులోకి వచ్చింది. సీబీఎస్‌ఈ బోర్డ్, కోఎంప్ట్ నిర్వాకంపై యావత్ విద్యార్థి లోకం, తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. దాంతో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది. సీబీఎస్‌ఈ బోర్డ్ చైర్మన్, కార్యదర్శిని పదవుల నుంచి తొలగించింది.


