
నరసన్నపేట మండలం బసివలస ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం కోసం బియ్యం సిద్ధం చేస్తుండగా బయటపడిన పురుగులివి
విద్యార్థులకు సన్నబియ్యం పేరుతో నాసిరకం బియ్యం సరఫరా
శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా ఇదే తీరు అధికారుల తనిఖీల్లో బయటపడ్డ పురుగులు
నాసిరకం నిల్వ బియ్యాన్ని పాఠశాలలు, హాస్టళ్లకు అంటగట్టిన వైనం
శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పెట్టే మధ్యాహ్న భోజనం కోసం పురుగుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. వీటిని తినలేక విద్యార్థులు, ఆ బియ్యంతో భోజనం తయారుచేసి పెట్టలేక ఉపాధ్యాయులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వ విద్యార్థుల్లో పోషకాహార లోపాలను తగ్గించేందుకు గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఫోర్టిఫైడ్ బియ్యాన్ని అందజేస్తే.. అంతకంటే మంచివైన సన్నబియ్యంతో భోజనం పెడుతున్నామని కూటమి ప్రభుత్వం చెబుతోంది.
మంచి బియ్యం కాదు కదా.. కనీసం పిల్లలు తినగలిగే బియ్యంతో కూడా భోజనం పెట్టడం లేదు. పురుగులతో ఉన్న ముక్కిపోయిన బియ్యాన్ని ప్రభుత్వం వండి పెడుతోంది. విద్యార్థులు ఆ భోజనం తినలేక ఇబ్బంది పడుతున్నారు. మధ్యాహ్నం భోజనం పథకం పేరుతో శ్రీకాకుళం జిల్లాలోని పాఠశాలలకు సరఫరా చేసిన బియ్యం బస్తాలను తెరిచిచూస్తే పురుగులు కన్పిస్తుండటమే కాకుండా బియ్యం మొత్తం ముక్కు వాసన వస్తున్నాయి. – సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం
అసలు సన్నబియ్యమేనా?
జిల్లాలోని 2,676 ప్రభుత్వ పాఠశాలలు.. 131 సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయి. వసతి గృహాల కోసం జూలై నెలకు 12,087 బ్యాగులతో 301.95 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేశారు. పాఠశాలలకు 379 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేశారు. సన్నబియ్యమని చెప్పి అందజేశారు. వాటిని తెరిచి చూస్తే చీమలతో పాటు పురుగులు బయటకు వస్తున్నాయి. అన్ని బస్తాల్లోని బియ్యం ముక్కు వాసన వస్తున్నాయి. ప్రభుత్వం చెప్పిన సన్నబియ్యం గుట్టురట్టు అవుతోంది. బియ్యం చూసిన ప్రతి ఒక్కరూ ఇవి సన్నబియ్యం కాదని, పాలిషింగ్ చేసి పంపించిన నాసిరకం బియ్యమని చెబుతున్నారు. విద్యార్థుల భోజనం కోసమని గుంటూరు జిల్లా తెనాలి నుంచి సన్నబియ్యం తీసుకొచి్చనట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి.

ఆ బియ్యాన్ని సింగన్నపాలెంలో మధ్యాహ్న భోజనం పథకం పేరుతో సంచుల్లో నింపి క్యూఆర్ కోడ్ కూడా వేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఏదో మోసం జరిగినట్టు తెలుస్తోంది. అక్కడి నుంచి సన్నబియ్యం వస్తే వాటిని పక్కదారి పట్టించి జిల్లాలోని అధికార పార్టీకి చెందిన పెద్దల మిల్లుల్లో నిల్వ ఉన్న నాసిరకం బియ్యాన్ని మధ్యాహ్నం భోజనం పథకం సంచుల్లో ప్యాక్‌చేసి పాఠశాలలకు, హాస్టల్స్‌కు పంపించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీకి చెందిన పెద్దల గోడౌన్‌లలో నిల్వ ఉన్న బియ్యానికి మూడు పాలిష్‌లు పెట్టి సన్నబియ్యంగా తోసేస్తున్నారన్న వాదనలు కూడా ఉన్నాయి.

చర్యలేవీ.. సరఫరా అవుతున్న నాసిరకం బియ్యంపై పాఠశాలలు, వసతి గృహాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. పురుగులున్న బియ్యం ఫొటోలు, వీడియోలు తీసి అధికారులకు పంపిస్తున్నారు. జిల్లా విద్యాశాఖాధికారి కూడా పాఠశాలల నుంచి నివేదికలు రప్పించుకుని పురుగులు ఉన్నట్టు నిర్ధారించుకున్నారు. ఇంత జరిగినా కిమ్మనకుండా ఉండిపోతున్నారే తప్ప ఏం జరిగిందనే దానిపై విచారణ చేయడం లేదు.