
ఎంఈవో పోస్టులు ప్రభుత్వ యాజమాన్య స్కూళ్ల హెచ్‌ఎంలకే పరిమితం
హెచ్‌ఎంలు లేకపోతే ఎస్‌ఏలకు అవకాశం
జెడ్పీ హెచ్‌ఎంలకు మాత్రం ఇచ్చేది లేదు
కూటమి ప్రభుత్వ వింత నిర్ణయం
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం మళ్లీ ఉపాధ్యాయుల మధ్య విభజన చిచ్చు రాజేసింది. ఎంఈవో పోస్టుల భర్తీని అడ్డం పెట్టుకుని గురువుల మధ్య గొడవలు సృష్టిస్తోంది. మండల, జిల్లా పరిషత్, మున్సిపల్ మేనేజ్‌మెంట్ స్కూళ్లలోని ప్రధానోపాధ్యాయులను పక్కనబెట్టి, కేవలం రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న అతి తక్కువ స్కూళ్లలో పనిచేస్తున్న హెచ్‌ఎంలు, సీనియర్ స్కూల్ అసిస్టెంట్లను ఎంఈవో–1గా నియమిస్తోంది. ఎంఈవో–1గా పనిచేసేందుకు సమ్మతిని తెలిపాలని ప్రభుత్వ యాజమాన్య స్కూళ్ల హెచ్‌ఎంలు, స్కూల్ అసిస్టెంట్లను ఆర్జేడీలు ఇటీవల ఆదేశించారు.
కొన్ని జోన్లలో నియామకాలు సైతం పూర్తిచేసినట్టు సమాచారం. దీనిపై స్థానిక సంస్థల యాజమాన్యంలోని పాఠశాలల ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. ప్రస్తుతం ఎంఈవో–1గా ప్రభుత్వ, జెడ్పీ యాజమాన్య పాఠశాలల హెచ్‌ఎంలు పనిచేస్తున్నారని, అయినా ఈ అంశాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకుండా కేవలం ప్రభుత్వ యాజమాన్య ఉపాధ్యాయులకే అవకాశం కల్పించడం దుర్మార్గమని మండిపడుతున్నారు.
అందరికీ అవకాశమిచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం
సరీ్వస్ నిబంధనల ప్రకారం ప్రభుత్వ స్కూళ్లల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లకు ఫీడర్ కేడర్ పోస్టులుగా హెచ్‌ఎం/ఎంఈవో పోస్టు ఉంది. అయితే, విద్యాశాఖలోని వివిధ ప్రభుత్వ మేనేజ్‌మెంట్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీస్ రూల్స్ లేవు. దీనివల్ల ఎన్నో ఏళ్లుగా ఎంఈవో పోస్టులు ప్రభుత్వ యాజమాన్య ఉపాధ్యాయులకే ఇస్తున్నారు. తమకూ ఎంఈవో పోస్టులు ఇవ్వాలని జెడ్పీ టీచర్లు చాలాకాలంగా కోరుతున్నారు.
ఈ నేపథ్యంలో 2023లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంఈవో–2 పోస్టులను సృష్టించి, 679 మండలాల్లో జెడ్పీ హెచ్‌ఎంలను ఎంఈవో–2లుగా నియమించింది. దీంతో వివాదం సద్దుమణిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తర్వాత ఎంఈవో–2 పోస్టులను రద్దు చేసేందుకు యత్నిస్తోంది.
ఖాళీలను తిరిగి భర్తీ చేయడం లేదు. మరోవైపు ఎంఈవో–1 పోస్టులను కేవలం ప్రభుత్వ యాజమాన్య హెచ్‌ఎం లేదా స్కూల్ అసిస్టెంట్లకు మాత్రమే ఇస్తోంది. గత ఏడాది చాలామంది ఎంఈవో–1లు రిటైరయ్యారు. ప్రభుత్వం ఆ పోస్టులను భర్తీ చేయకుండా పక్క మండలాల వారికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తోంది. ప్రభుత్వ చర్యలను సంఖ్యాపరంగా ఎక్కువగా ఉన్న జెడ్పీ టీచర్లు వ్యతిరేకిస్తున్నారు.
ఉమ్మడి సీనియార్టీతో భర్తీ చేయాలి
ఎంఈవో–1 పోస్టులను ప్రభుత్వ, పంచాయతీరాజ్ యాజమాన్యాల ఉమ్మడి సీనియార్టీ ద్వారా మాత్రమే భర్తీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) డిమాండ్ చేసింది. ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేసే స్కూల్ అసిస్టెంట్లను ఎంఈవో–1గా నియమించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఫ్యాప్టో చైర్మన్ ఎల్.సాయిశ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఎస్.చిరంజీవి తెలిపారు.
ఉమ్మడి సర్వీస్ రూల్స్‌పై న్యాయ వివాదం కొనసాగుతున్నందున ఉమ్మడి సీనియార్టీతో మాత్రమే ఎంఈవో–1 పోస్టులను భర్తీ చేయాలని పీఆర్టీయూఏపీ కూడా కోరింది. ఎంఈవో–1 పోస్టుల భర్తీ విషయంలో జెడ్పీ స్కూళ్ల హెచ్‌ఎంలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు సీవీ ప్రసాద్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో జూనియర్లయిన ఎస్‌ఏలను ఎంఈవోలుగా నియమించడం తగదని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు ఎస్.బాలాజీ, ప్రధాన కార్యదర్శి జి.వెంకట సత్యనారాయణ పేర్కొన్నారు.