సుప్రీం కమాండర్‌ దేవ్‌జీ లొంగుబాటు!? | Maoist Supreme Commander Devji surrenders | Sakshi
Sakshi News home page

సుప్రీం కమాండర్‌ దేవ్‌జీ లొంగుబాటు!?

Nov 19 2025 5:35 AM | Updated on Nov 19 2025 5:35 AM

Maoist Supreme Commander Devji surrenders

సామూహికంగా అదే బాటలో అగ్రనేతలు  

ఆయన అంగరక్షకులను అరెస్టు చేసిన పోలీసులు

దేవ్‌జీ ఆచూకీపై పోలీసుల మౌనం 

మూడంచెల భద్రత దాటుకుని పట్టుకెళ్లారా.. 

ఆ సమయంలో ఎలాంటి ప్రతిఘటనా జరగలేదంటే స్వచ్ఛందంగా లొంగిపోయినట్లే! 

రాష్ట్రంలో అరెస్టు అయిన 50 మందిలో పలువురు కేంద్ర కమిటీ సభ్యులు  

హిడ్మా ఎన్‌కౌంటర్‌ ఫలితం.. పక్కాగా కథ నడిపిన కేంద్ర నిఘా వర్గాలు

హిడ్మాకు తెలియకుండానే ఈ కథ అంతా నడిచినట్టు సమాచారం. దాంతో కేంద్ర నిఘా వర్గాలు, కేంద్ర బలగాలు హిడ్మాను అదుపులోకి తీసుకుని.. రెండు రోజుల తర్వాత మారేడుమల్లిలో ఎన్‌కౌంటర్‌ చేసినట్టు తెలుస్తోంది. అందుకు కేంద్ర నిఘా వర్గాలు ఏపీ గ్రేహౌండ్స్‌ ద్వారా ఎన్‌కౌంటర్‌ కథ నడిపించాయి. హిడ్మాకు కనీసం 20 మంది అంగరక్షకుల భద్రత ఉంటుంది. కానీ మారేడుమల్లి ఎన్‌కౌంటర్‌లో ఆయనతోపాటు మరో ఐదుగురే హతమవ్వడం గమనార్హం. ఆయన మిగిలిన అంగరక్షకులను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్టు చూపించారు.  

సాక్షి, అమరావతి: దశాబ్దాల సాయుధ పోరాటాల చరిత్ర కలిగిన పీపుల్స్‌వార్, మావోయిస్టు పార్టీ ప్రస్థానానికి ముగింపు కార్డు పడనుందా.. మంగళవారం అనూహ్యంగా సంభవించిన పరిణామాలు అందుకు అవుననే సమాధానం చెబుతున్నాయి. మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్టు హిడ్మా ఎన్‌కౌంటర్‌ కాగా, మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్‌ దేవ్‌జీ ఆచూకీ ఎక్కడన్నది అంతుచిక్కడం లేదు. ఆయనతోపాటు ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు పలువురు పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది. 

కాదు.. వారు పోలీసులకు లొంగిపోయారు అనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది. వాటిలో ఏది నిజమైనా.. మావోయిస్టు పార్టీకి శరాఘాతమేనన్నది సుస్పష్టం. ఇదే జరిగితే ఇక ఆ పారీ్టకి చరమగీతం పాడినట్టే. 2026 మార్చి నాటికి మావోయిస్టుల ఉనికి లేకుండా చేయాలన్న కార్యాచరణ మేరకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ కగార్‌ సత్ఫలితాలు సాధించే దిశగా దూసుకుపోతోంది. 

దేవ్‌జీతోపాటు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుల ఆచూకీపై బుధవారం మరింత స్పష్టత సంతరించుకోనుంది. అంత వరకు కొంత సస్పెన్స్‌ కొనసాగనుంది. హిడ్మా ఎన్‌కౌంటర్‌ అనంతరం కూడా ఆ పార్టీ తరఫున ఎటువంటి ప్రకటన విడుదల కాకపోవడం గమనార్హం. 

మంగళవారం ఏకంగా  50 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేయడంతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అరెస్టు అయిన వారిలో మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్‌ దేవ్‌ జీ, హిడ్మా అంగరక్షకులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. హిడ్మా మారేడుమిల్లిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడనే విషయాన్ని పోలీసులే ప్రకటించారు. కానీ దేవ్‌ జీ ఎక్కడున్నారనే విషయంపై మాత్రం పోలీసులు వ్యూహాత్మక మౌనం దాల్చడం గమనార్హం. 

దేవ్‌ జీ ఎక్కడ? 
దేవ్‌ జీ అంగరక్షకులను అరెస్టు చేసిననప్పుడు.. మరి ఆయన ఎక్కడున్నార్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. అంటే ఆయన పోలీసుల అదపులోనే ఉన్నట్టు పోలీసువర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ప్రధాన కార్యదర్శి స్థాయి అగ్రనేతకు మూడంచెల అంగరక్షకుల వ్యవస్థ రక్షా కవచంగా నిలుస్తుంది. అటువంటి నేతను సజీవంగా పట్టుకోవడం దాదాపు అసాధ్యం. నంబాల కేశవరావు ఉదంతం ప్రస్తావనార్హం. 

తనను చుట్టుముట్టిన పోలీసు బలగాలతో కేశవరావు, ఆయన అంగరక్షకులు చివరి వరకు పోరాడారు. ఆ ఎన్‌కౌంటర్‌లో ఆయన హతమయ్యాడు. అంతేగానీ ప్రధాన కార్యదర్శిని సజీవంగా పట్టుకోవడం అసాధ్యం. నంబాల కేశవరావు తదనంతరం ప్రస్తుతం మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా దేవ్‌ జీ నియమితులయ్యారు. ఆయనకు ఆ స్థాయిలో అంగరక్షకుల భద్రత ఉంటుంది. 

ఇలాంటప్పుడు దేవ్‌జీ అంగరక్షకులను పోలీసులు అరెస్టు చేస్తే.. మరి ఆయన ఎక్కడున్నారన్న ప్రశ్న తలెత్తడం సహజం. ఆయన అంగ రక్షకులకు పోలీసులతో ఎదురు కాల్పులు జరగనే లేదు. అంటే దేవ్‌ జీ ఉద్దేశ పూర్వకంగానే పోలీసులకు లొంగిపోయారా.. అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయనతోపాటు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు పలువురు పోలీసులకు లొంగిపోయారని తెలుస్తోంది. దాదాపు తొమ్మిది మంది ముఖ్యులు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం.   

కేంద్ర బలగాలు సూత్రధారి.. ఏపీ పోలీసులు పాత్రధారి 
మావోయిస్టు పార్టీని కూకటి వేళ్లతో సహా పెకలించి వేసేందుకు కేంద్ర నిఘా వర్గాలు పక్కాగా స్కెచ్‌ను అమలు చేసినట్టు స్పష్టమవుతోంది.  రెండేళ్లుగా ఆపరేషన్‌ కగార్‌ పేరుతో మావోయిస్టు పార్టీని దెబ్బతీస్తూ వచ్చిన కేంద్ర బలగాలు.. తాజాగా కొట్టిన దెబ్బ ఆ పార్టీ పాలిట పిడుగుపాటే అయ్యింది. అందుకోసం సామ దాన బేధ దండోపాయాలను ప్రయోగించింది. 

ఇప్పటికే పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావును ఈ ఏడాది మొదట్లోనే ఎన్‌కౌంటర్‌లో హతమార్చింది. ఇక పార్టీలో సీనియర్‌ నేత, మావోయిస్టు సిద్ధాంత కర్త ముప్పాళ్ల వేణుగోపాలరావు, ఆశన్నలు లొంగిపోయేలా చేసింది. తద్వారా మావోయిస్టు పార్టీలో మిగిలి ఉన్న కొద్ది మంది అగ్రనేతల్లో లొంగుబాటు ఆలోచన వచ్చేలా ప్రేరేపించింది. 

ఈ నేపథ్యంలోనే ఓ వైపు మోస్ట్‌ వాంటెడ్‌ హిడ్మా కోసం వేట ముమ్మరం చేస్తూనే మరోవైపు ఇతర అగ్రనేతల లొంగుబాటు కార్యాచరణను వేగవంతం చేసింది. వారి కుటుంబ సభ్యుల ద్వారా మావోయిస్టు అగ్రనేతలతో గుట్టు చప్పుడు కాకుండా మంతనాలు సాగించింది. లొంగుబాటుకు  వివిధ ప్రతిపాదనలను వారి ముందుంచింది. తద్వారా మావోయిస్టు అగ్రనేతలను దారికి తెచ్చుకుంది. 

హిడ్మా మాత్రం కాకినాడ నుంచి శ్రీలంకకు పారిపోయేందుకు నిర్ణయించుకున్నారు. అందుకు ఇతర అగ్రనేతలు కూడా సమ్మతించినట్టు తెలుస్తోంది. అగ్రనేతలు ఏపీలోని కాకినాడ, మచిలీపట్నం పోర్టుల ద్వారా సముద్ర మార్గంలో శ్రీలంకకు వెళ్లిపోయేందుకు ప్రణాళిక వేశారు. కానీ అదే అగ్రనేతల్లో కొందరు ఆ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించినట్టు తెలుస్తోంది. లొంగుబాటుకు సుముఖంగా ఉన్న అగ్రనేతలే ఈ మేరకు పోలీసులకు టచ్‌లోకి వెళ్లినట్టు తెలుస్తోంది.  

నాడు 42 మంది... నేడు 12 మందే
» నక్సలిజం సైద్ధాంతిక పార్టీలైన పీపుల్స్‌వార్, మావోయిస్టు కమ్యూనిస్ట్‌ సెంటర్‌(ఎంసీసీ) విలీనమై 2004లో మావోయిస్టు పార్టీగా ఆవిర్భవించాయి. ఆ సమయంలో 42 మంది సభ్యులతో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీని ఏర్పాటు చేశారు. రెండు దశాబ్దాల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో అధికంగా అగ్రనేతలను కోల్పోవడంతోపాటు కొందరు వృద్ధాప్య సమస్యలతో మరణించగా, మరికొందరు పోలీసులకు లొంగిపోయారు.   
»   ఇటీవల ఎన్‌కౌంటర్లలో పార్టీ సుప్రీం కమాండర్‌ నంబాల కేశవరావుతోపాటు, కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి మరణించారు. కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్న ఇద్దరు అగ్రనేతలు ముప్పాళ్ల వేణుగోపాల రావు, ఆశన్న పోలీసులకు లొంగిపోయారు. దాంతో మావోయిస్టు పారీ్టలో కేవలం 12 మంది కేంద్ర కమిటీ సభ్యులే మిగిలారు.  
»   ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ ప్రధాన కా­ర్యదర్శి దేవ్‌జీతోపాటు పలువురు కేంద్ర కమి­టీ సభ్యులు పోలీసుల అదుపులో ఉన్నది నిజమైతే ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుల సంఖ్య ఒక అంకెకు పరిమితం కావడం ఖాయం. మా­వోయిస్టు పార్టీ 2004–10 లో ఉమ్మడి ఏపీలో పూర్తిగా పట్టు కోల్పోయి ఛత్తీస్‌గఢ్‌ను తమ కేంద్ర స్థానంగా చేసుకుంది. కానీ ఆపరేషన్‌ కగార్‌తో ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉనికి కాపాడుకోవడం కూడా పెను సవాల్‌గా మారింది.  
»  ఈ ఏడాదే చత్తీస్‌ఘడ్‌లోని కుల్హదీఘాట్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు రామచంద్రారెడ్డి అలియాస్‌ చలపతి మరణించారు. మహారాష్ట్రలోని బీజాపూర్‌ జిల్లాలో మేలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరో కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు అలియాస్‌ చంద్రన్న ప్రాణాలు కోల్పోయారు. చత్తీస్‌ఘడ్‌లోని ఇంద్రావతి వద్ద ఈ నెలలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరో కేంద్ర కమిటీ సభ్యుడు తెంటు లక్ష్మీ నరసింహాచలం అలియాస్‌ సుధాకర్‌ హతమయ్యారు. 
»  ఈ ఏడాది ఎన్‌కౌంటర్లలో మరణించిన ఐదుగురు కేంద్ర కమిటీ సభ్యుల్లో నలుగురు తెలుగు రాష్ట్రాలకు చెందినవారే కావడం గమనార్హం. మరో కేంద్ర కమిటీ సభ్యుడు ఆశన్న పోలీసులకు లొంగిపోయారు. ఇక పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక మండలిగా ఉన్న పొలిట్‌ బ్యూరో దాదాపు నామమాత్రంగా మారిపోయింది. రెండు నెలల క్రితం వరకు పోలిట్‌బ్యూరోలో నలుగురే మిగలగా, వారిలో మల్లోజుల వేణుగోపాల్‌ రావు ఇటీవల లొంగిపోయారు. దేవ్‌జీ పోలీసులకు లొంగిపోయినట్లయితే ఇక ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్‌ గణపతి, మిసిర్‌ బెస్రా అలియాస్‌ సునిర్మల్‌ మాత్రమే ఉన్నారు. వారిలో గణపతి చాలా ఏళ్లుగా క్రియాశీలంగా లేరు.  
»  ఇక మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో 12 మందే ఉన్నారు. పొలిట్‌బ్యూరో సభ్యులు కేంద్ర కమిటీలో కూడా ఉంటారు. ప్రస్తుతం మిగిలిన 12మంది కేంద్ర కమిటీ సభ్యుల్లో ఎనిమిది మంది తెలుగు రాష్ట్రాలకు చెందినవారే. కాగా జార్ఖండ్‌కు చెందిన వారు ముగ్గురు, చత్తీస్‌ఘడ్‌కు చెందిన వారు ఒకరు  ప్రాతినిధ్యం వహిస్తున్నారు.   
» ముప్పాళ్ల లక్ష్మణ రావు అలియాస్‌ గణపతి, కడారి సత్యనారాయణ రెడ్డి, మల్లా రాజిరెడ్డి, మోడెం బాలకృష్ణ, పాక హన్మంతు, కట్టా రామచంద్రారెడ్డి, పసునూరి నరహరి, పోతుల కల్పనలు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు. మిసిర్‌ బెస్రా, అనల్‌ దా, సహదేవ్‌లు జార్ఖండ్‌కు చెందినవారు. మాజ్జీదేవ్‌ చత్తీస్‌ఘడ్‌కు చెందిన వారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement