
కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధిత విద్యార్థినులు
‘కురుపాం’ హాస్టల్‌లో కలుషిత బోరు నీరే దిక్కు
తాగడానికి, వంటకు కూడా అదే నీరు
ఆర్వో ప్లాంటు పాడైనా మరమ్మతులు చేయించలేదు
హాస్టల్‌లో ఎలాంటి వసతుల్లేవ్..
611 మంది బాలికలకు 6 బాత్‌రూమ్‌లే ఉన్నాయి
హాస్టల్ నుంచి వస్తూనే వాంతులు, జ్వరాలు.. పైగా.. ఇళ్లలో ఏదో తిని ఉంటారంటూ ఎత్తిపొడిచారు
కూటమి ప్రభుత్వంపై మండిపడుతున్న ‘కురుపాం’ విద్యార్థినుల తల్లిదండ్రులు
ఇద్దరు విద్యార్థినుల మృతితో భయం గుప్పిట్లో బాలికలు
వంద మందికి పైగా కామెర్లు, జ్వరాలు
బోధనేతర సిబ్బందిదీ అదే పరిస్థితి..
కురుపాంలో మరో ఇద్దరు యువకుల మృతి.. తప్పును కప్పిపుచ్చుకునేందుకు పాలకుల కుయుక్తులు
సాక్షి, విశాఖపట్నం/డాబాగార్డెన్స్/ మహరాణిపేట/ బీచ్‌రోడ్డు/సాక్షి, పార్వతీపురం మన్యం: కూటమి సర్కారు నిర్లక్ష్యం మన్యంలో మరణ మృదంగం మోగిస్తోంది. మన్యం జిల్లాను జ్వరాలు, పచ్చ కామెర్లు వణికిస్తున్నాయి. సర్కారు నిర్వాకం కారణంగా ఉన్నత చదువులు చదివి.. గిరిసీమల బతుకు చిత్రాన్ని మార్చాలనుకున్న విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు. ఇప్పటికే ఇద్దరు విద్యార్థినులను మృత్యువు కబళించింది. మరో 120 మందికి పైగా ఆస్పత్రి పాలయ్యారు.
ఇదే కురుపాం నియోజకవర్గంలో మరో ఇద్దరు యువకులు కూడా పచ్చ కామెర్లతో మృత్యువాతపడ్డారు. గురుకులంలో విద్యార్థినులకు హెపటైటిస్–ఏ సోకినట్టు చెబుతున్నారు. కలుషిత నీరు, ఆహారం, మరుగుదొడ్ల నిర్వహణ అధ్వానంగా ఉండటం వల్ల ఇది మరింతగా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉంటే.. ప్రభుత్వం దీనికంతటికీ కారణం పిల్లలే అనేలా వ్యవహరిస్తోంది.
సెలవులకు ఇళ్లకు వెళ్లి, అక్కడ ఇంటి దగ్గర ఏం తిన్నారో.. ఆరోగ్యం పాడైతే అది మీ పిల్లల తప్పవుతుందే తప్ప.. హాస్టల్, స్కూల్‌కు ఏం సంబంధం అంటూ కొందరు కూటమి నాయకులు, అధికారులు వ్యాఖ్యలు చెయ్యడం గిరిజనులను మరింత బాధిస్తున్నాయి. విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వార్డెన్లు భోజనం సప్లై చేశారా అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
రెండు నెలల ముందే..
వాస్తవానికి రెండు నెలల క్రితమే ఒక విద్యార్థిని అనారోగ్యం పాలైనట్టు తెలుస్తోంది. గత నెల 25నే ఓ విద్యార్థి, ఈ నెల మొదట్లో మరో విద్యార్థిని మరణించారు. అప్పటికీ ప్రభుత్వం, అధికారులు తేలిగ్గానే తీసుకున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు పట్టించుకోలేదు. ఇప్పుడు ఊరూరా పాకుతోంది.
ఏకలవ్య పాఠశాల, పక్కనే ఉన్న బాలిక వసతి గృహంలో సరైన వసతులులేకపోవడం, అపరిశుభ్ర వాతావరణం, మురుగు నీరు కలిసిన తాగు నీరే విద్యార్థులకు ఇవ్వడం, అవే వంటకు వాడటం.. మొత్తంగా ప్రభుత్వ నిర్లక్ష్యం ఈ మృత్యుకేళికి ప్రధాన కారణం. వైఎస్సార్‌సీపీ నేతలు పరామర్శించి.. వైద్య సహాయక చర్యలపై ఆరా తీసిన తర్వాతే... విద్యార్థులకు వైద్య సేవలు ముమ్మరం చెయ్యడం ప్రారంభించారు.
హాస్టల్లో బాలికల అవస్థలు వర్ణనాతీతం.!
బాలికల వసతి గృహంలో సౌకర్యాలు అతి దారుణంగా ఉన్నాయి. ఈ వసతి గృహంలో మొత్తం 611 మంది బాలికలు ఉన్నారు. రెండు బ్లాక్‌లలో కలిపి 6 టాయిలెట్స్ మాత్రమే. దీంతో బాలికలు పడే వేదన వర్ణనాతీతం. ఏకలవ్య పాఠశాలలో బాలురుకి సరైన వసతి సౌకర్యమే లేదు. పాఠశాలలో 300 మందికిపైగా విద్యార్థులున్నారు. ఇందులో 150 మంది వరకూ బాలురు ఉన్నారు.
వీరికి, టీచింగ్ స్టాఫ్‌కి కలిపి ఉన్నవి 10 బాత్‌రూమ్‌లే. పడుకొనేందుకు కూడా చోటు వెదుక్కోవాల్సిన దుస్థితి. ఎవరైనా ఊళ్లకు వెళ్తే వేరే విద్యార్థులు పడుకునేందుకు చోటు దొరుకుతుంది. దుస్తులు ఆరబెట్టేందుకు కూడా క్లాస్‌రూమ్‌ల కిటికీలే గతి.
పెద్దలకూ వ్యాపిస్తున్న వ్యాధి
గురుకుల పాఠశాలలో భాగ్యలక్ష్మి అనే ఉద్యోగికి కామెర్లు రావడంతో కేజీహెచ్‌కు తరలించారు. మరొకరికి కూడా ఈ లక్షణాలు ఉన్నట్టు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రం మరో ఎనిమిది మందిని కేజీహెచ్‌కు తరలించారు. తాజాగా జియ్యమ్మవలస, గుమ్మలక్ష్మీపురం మండలాల్లో పెద్దలకు కూడా ఈ లక్షణాలు బయటపడుతున్నాయి. బాలేసు గ్రామానికి చెందిన నిమ్మక సుమన్, చినదోడ్జ గ్రామానికి చెందిన నిమ్మక ప్రశాంత్ అనే ఇద్దరు యువకులు కామెర్లతోనే మృతి చెందినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.
సమస్య చెబుదామని వస్తే కేసులు
రెండు రోజుల క్రితం జిల్లా ఆసుపత్రికి వచ్చిన రాష్ట్ర మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, గుమ్మిడి సంధ్యారాణికి సమస్యలు వివరించడానికి వచ్చిన గిరిజన సంఘాల నాయకుల్లో పాలక రంజిత్‌కుమార్, కూరంగి సీతారాంపై అక్రమ కేసు పెట్టారు. తహసీల్దారు వద్ద బైండోవర్ చేయించారు. కూరంగి సీతారాం కురుపాం గురుకుల పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ కూడా.
ఆయన కుమార్తె ఇదే పాఠశాలలో చదువుతూ, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రభుత్వ తప్పును కప్పిపుచ్చుకునేందుకే రంజిత్‌కుమార్, సీతారాంపై కేసులు బనాయించారని సీపీఎం నాయకులు బీవీ రమణ, సీపీఐ నేత ఆర్‌వీఎస్ కుమార్, రైతు కూలీ సంఘం నాయకులు ఎం.భాస్కరరావు తెలిపారు. తక్షణమే కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
సికిల్‌సెల్ కేసులూ బయట పడుతున్నాయి
విద్యార్థులకు మంచి నీరు అందించడంలోనూ కూటమి సర్కారు కుటిల బుద్ధి ప్రదర్శించింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విద్యార్థులకు సురక్షితమైన తాజా నీటిని అందించడానికి ఈ హాస్టల్‌లో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేసింది. ఏడాది క్రితం పిడుగు పడి ఆర్వో ప్లాంట్ పాడైపోయింది. అప్పటి నుంచి బాగుచెయ్యాలని పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోలేదు.
దీంతో.. పక్కనే ఉన్న బోరు నీరు లేదా మేడపైన ట్యాంకు నుంచి వచ్చిన నీటినే ఇక్కడి విద్యార్థులు తాగుతున్నారు. కూటమి ప్రభుత్వం గిరి బాలలకు కనీస స్థాయిలో పౌష్టికాహారాన్ని కూడా అందించలేకపోతోంది. అస్వస్థతకు గురైన విద్యార్థులను పరీక్షించగా, కొన్ని సికిల్‌సెల్ కేసులు కూడా బయటపడుతుండటం గమనార్హం.
విద్యార్థుల ఆరోగ్యాన్ని గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం
ప్రతి వసతి గృహంలోనూ నెలకోసారి లేదా రెండు నెలలకోసారి సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించాలి. హాస్టళ్లలో ఉన్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులపై ఆరాతీసి.. ఇబ్బందులేమైనా గుర్తిస్తే.. హాస్పిటల్‌కు తీసుకెళ్లాలని రిఫర్ చేస్తుంటారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దాదాపు ఏ వసతి గృహంలోనూ వైద్య పరీక్షలు నిర్వహించట్లేదు. హాస్టల్స్‌లో ఉండే విద్యార్థుల ఆరోగ్యాన్ని పూర్తిగా విస్మరించింది. బాలికల వసతి గృహంలో, ఏకలవ్య పాఠశాలలోనూ గతేడాది కాలంగా విద్యార్థులు తరచూ అనారోగ్యం బారిన పడుతున్నారు. అయినా అధికారులు ఎలాంటి చర్యలూ చేపట్టలేదు.
వైఎస్ జగన్ వస్తున్నారనీ..
ఈ నెల 3 నుంచి కురుపాం బాధిత విద్యార్థుల్ని కేజీహెచ్‌కు తరలించడం ప్రారంభించారు. మొత్తం 64 మందిని తీసుకొచ్చారు. ప్రస్తుతం 46 మంది చికిత్స పొందుతున్నారు. వైద్య సేవలు అందుతున్నాయా లేదా..? విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే విషయంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పటికప్పుడు ఆరా తీశారు. వైఎస్సార్‌సీపీ నేతలు కూడా విద్యార్థుల్ని పరామర్శించి.. వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుని భరోసా ఇచ్చారు.
విశాఖ జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన ఖరారయ్యాక కూటమి ప్రభుత్వం.. కేజీహెచ్ వైద్యాధికారులపై ఒత్తిడి తెచ్చింది. విద్యార్థులకు త్వరితగతిన వైద్యం అందించి.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చెయ్యాలంటూ హుకుం జారీ చేసింది. దీంతో విద్యార్థులు నీరసంగా ఉన్నా.. అంతా బాగానే ఉందంటూ డిశ్చార్జ్ చేసి.. ఇళ్లకు పంపించడం ప్రారంభించారు. మంగళవారం సాయంత్రం 8 మందిని, బుధవారం రాత్రికి రాత్రి మరో 10 మందిని పంపించేశారు.
గురువారం ఉదయం మరికొందర్ని పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. వారికి పూర్తిగా నయం కాకపోవడంతో పార్వతీపురం ఆస్పత్రిలో వైద్యం చేయాలంటూ కేజీహెచ్ అధికారులు డిశ్చార్జ్ సమ్మరీలో రాయడాన్ని బట్టి చూస్తే.. వైఎస్ జగన్ వస్తుండటంతో వైద్యం పూర్తిగా అందించకుండానే కూటమి ప్రభుత్వం బాధిత విద్యార్థుల్ని పంపించేస్తోందని స్పష్టమవుతోంది.
విద్యార్థిని మృతిపై అనుమానాలు
మహారాణిపేట: కురుపాం గిరిజన బాలికల హాస్టల్ విద్యార్థిని తోయల కల్పన మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెకు వ్యాధి ఒకటైతే, వైద్యం మరొకటి చేశారని గిరిజనులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క కల్పన మృతదేహానికి పోస్టుమార్టం చేయకుండానే తల్లిదండ్రులకు అప్పగించడం ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తోంది. ఇది ఇతర గిరిజన విద్యార్థులు, తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. అస్వస్థతకు గురైన కల్పనను గత నెల 29న కేజీహెచ్‌కు తీసుకొచ్చారు.
అక్కడ జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ రాధాకృష్ణ ఆధ్వర్యంలో పరీక్షలు చేసి, పచ్చకామెర్ల వ్యాధిగా నిర్ధారించారు. ఈనెల ఒకటో తేదీ ఉదయం కల్పన చనిపోయింది. డెత్ సమ్మరీలో కాంప్లికేటెడ్ సెరిబ్రల్ మలేరియా అని రాశారు. ముందు పచ్చకామెర్లు అని రాసి, డెత్ సమ్మరీలో కాంప్లికేటెడ్ సెరిబ్రల్ మలేరియా అని రాయడంపై గిరిజనులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఎందుకు ఇలా మార్చారని ప్రశ్నిస్తున్నారు. కల్పనకు వచి్చన వ్యాధి ఏమిటి, చికిత్స దేనికి చేశారన్న అనుమానాలు కలుగుతున్నాయి. వ్యాధి ఒకటి అయితే మందు మరొకటి ఇచ్చారన్న అనుమానాన్ని గిరిజనులు వ్యక్తం చేస్తున్నారు.
పోస్టుమార్టం ఎందుకు చేయలేదు?: చనిపోయిన తర్వాత కల్పన మృతదేహానికి పోస్టుమార్టం చేయకుండానే తల్లిదండ్రులకు అప్పగించారు. అంటే వైద్యంలో జరిగిన అవకతవకలు బయటపడకుండా ఇలా చేశారని గిరిజనులు అనుమానిస్తున్నారు. అంతేకాకుండా కల్పన మృతి చెందిన విషయాన్ని రహస్యంగా ఉంచారు. ప్రభుత్వం కావాలనే వైద్యుల చేత ఈ తరహాలో చేయించిందన్న విమర్శలు వస్తున్నాయి.
అందరు ఒకదగ్గర లేరు కదా?
కొందరు వచ్చి.. పిల్లలు ఇంట్లో ఏదో తిని ఉంటారని, అందుకే పచ్చకామెర్లు వచ్చాయని, దీనికి, హాస్టల్‌కి ఏం సంబంధం అని మాట్లాడారు. మా అబ్బాయే ఇంట్లో తినడం వల్ల పచ్చకామెర్లు వచ్చాయనుకుందాం. 120 మంది పిల్లలూ మా ఇంట్లోనే తిన్నారా? దానివల్లే పచ్చకామెర్లు వచ్చాయా? పిల్లలు మంచంమీద అచేతనంగా పడి ఉంటే.. ఇలా మాట్లాడాలని వారికి ఎలా అనిపిస్తోందో! ఏకలవ్య పాఠశాలలో తాగు నీటికీ బోర్ నీరే వాడుతున్నారు. పాఠశాల చుట్టూ అపరిశుభ్ర వాతావరణమే ఉంది. అడిగితే పట్టించుకునేవారు లేరు. – మండంగి శ్రీనివాస్, బొడ్లగూడ
611 మందికి 6 బాత్‌రూమ్‌లే ఉన్నాయి
మా హాస్టల్‌లో 611 మంది అమ్మాయిలం ఉన్నాం. అందరికీ ఆరే బాత్‌రూమ్‌లు ఉన్నాయి. ఆర్‌వో ప్లాంట్ పాడైపోయింది. ట్యాంక్ నీటినే తాగడానికి, వంటకీ కూడా వాడతారు. – కొండగొర్రె మోహిని, టెన్త్ విద్యార్థిని, దండుసుర గ్రామం
ఆర్వో ప్లాంట్ పాడైనా పట్టించుకోలేదు
నా కుమార్తె ఆరో తరగతి చదువుతోంది. హాస్టల్‌లోనే జ్వరం, వాంతులు మొదలయ్యాయి. పార్వతీపురం ఆస్పత్రికి తీసుకెళ్లాం. హాస్టల్ వద్ద డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదు. మురుగు నీరంతా ఒక దగ్గర నిల్వ ఉండిపోవడంతో పాటు బోర్ వాటర్‌లో కలిసిపోయింది. ఆర్వో ప్లాంట్ పాడైపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. – కె.అప్పారావు, విద్యార్థిని తండ్రి
హాస్టల్ అపరిశుభ్రంగా ఉంది..
మా పాప జ్వాలను ఈ ఏడాది హాస్టల్లో చేర్పించాం. ముందు జ్వరం ఎక్కువగా వచ్చింది. టెస్ట్స్ చేయిస్తామన్నారు. టెస్ట్స్ చేయించే లోపే జ్వరం మరింత ఎక్కువైంది. నీరసించిపోయింది. సోమవారం కురుపాం హాస్పటల్‌కి తీసుకెళ్లారు. అక్కడి నుంచి పార్వతీపురం హాస్పటల్‌కి, అత్యవసరంగా మంగళవారం కేజీహెచ్‌కు తీసుకొచ్చారు. హాస్టల్ పరిసర ప్రాంతం అపరిశుభ్రంగా ఉంటుంది. – ఉత్తమ, విద్యార్థిని జ్వాల తల్లి