‘కాయ’కష్టం వృథా! | Mango purchases stalled at pulp factory | Sakshi
Sakshi News home page

‘కాయ’కష్టం వృథా!

Jun 26 2026 4:27 AM | Updated on Jun 26 2026 4:27 AM

Mango purchases stalled at pulp factory

స్తంభించిన మామిడి కొనుగోళ్లు

జీడీ నెల్లూరులో పండ్ల గుజ్జు పరిశ్రమ వద్ద రైతుల పడిగాపులు

3 కిలోమీటర్ల మేర బారులు తీరిన ట్రాక్టర్లు

వారం రోజులైనా అన్‌లోడింగ్‌ కాక 

రైతుల్లో ఆందోళన

కాణిపాకం/గంగాధరనెల్లూరు: రైతుల కాయ కష్టం వృథా అయిపోయింది. నిండా వ్యథ మిగిల్చింది. చిత్తూరు జిల్లా జీడీనెల్లూరు మండలంలోని ఓ గుజ్జు (పల్ప్‌) ఫ్యాక్టరీలో మామిడికాయల కొనుగోళ్లు స్తంభించడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతు­న్నా­రు.  బుధవారం సాయంత్రం నుంచి కొనుగోళ్లు ని­లి­చిపోగా, గురువారం కూడా పునఃప్రారంభం కాలేదు. శుక్రవారమూ కొనుగోళ్లు ప్రారంభమయ్యే పరిస్థితి కనిపించడం లేదని రైతులు ఆందోళన చెందు­తున్నారు. దీంతో ఫ్యాక్టరీ వద్ద దాదాపు మూడు కిలోమీటర్ల పొడవునా వందలాది ట్రాక్టర్లు నిలిచిపోయాయి.

కొందరు రైతులు ఐదు నుంచి ఏడు రోజులుగా అన్‌న్‌లోడింగ్‌ కోసం ఎదురుచూస్తున్నా­మని, రేయింబవళ్లూ నిద్రాహారాలు లేకుండా ట్రాక్టర్ల వద్దే ఉంటున్నట్టు ‘సాక్షి’కి చెప్పారు. అన్‌లోడింగ్‌ చేయకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండటంతో వేడికి కాయలు కుళ్లిపోవడం, నాణ్యత దెబ్బతింటుందని గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు ఫ్యాక్టరీలో కన్వేయర్‌ బెల్ట్‌ దెబ్బతినడంతో కొనుగోళ్లు నిలిపివేశామని, మరమ్మతులు పూర్తయిన వెంటనే ప్రారంభిస్తామని నిర్వాహకులు ప్రకటించారు. అయితే ఇప్పటికే భారీగా కాయలు ఫ్యాక్టరీకి చేరుకోవడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. ఇలా అయితే నిండా మునిగిపోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

టమాటా రైతు కంట కన్నీరు
15 కిలోల టమాటా బాక్సు రూ.100
పలమనేరు: మొన్నటి దాకా బాక్సు ధర రూ.500 దాకా పలికి రైతుల్లో ఆశలు రేకెత్తించిన టమాటా ఉన్నట్టుండి నిరాశ మిగిల్చింది. ధర రూ.100కు పడిపోయింది. రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టి సాగుచేసిన పంటకు ధర రాకపోవడంతో రైతులు కుమిలిపోతున్నారు.  చివరకు కూలి కూడా దక్కడం లేదని, అప్పులే మిగులుతున్నాయని ఆవేదన చెందుతున్నారు.  పలమనేరు మార్కెట్‌కు గత నాలుగైదు రోజుల నుంచి టమాటాలు ఎక్కువగా వస్తున్నాయి. 

గతంలో 30 లోడ్లు వస్తుండగా ఇప్పుడు 50 లోడ్లకు చేరింది. దీంతోపాటు అనంతపురం, అన్నమయ్య జిల్లాల సరుకుతోపాటు స్థానికంగా టమాటా సాగు పెరిగి ఇక్కడి సరుకు ఎక్కువగా మార్కెట్‌కు చేరుతోంది. దీంతో వ్యాపారులు టమాటా కొనేందుకు ఆసక్తిని చూపడం లేదు. డిమాండ్‌కు మించి సరఫరా ఉండడమే ధరాఘాతానికి కారణమని మండీ వ్యాపారులు చెబుతున్నారు. కాగా, పలమనేరు మార్కెట్‌లో గురువారం టాప్‌ ధర (15కిలోల) బాక్సు రూ.170 కాగా సగటు ధర బాక్సు రూ.100గా పలికింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement