సాక్షి, నెల్లూరు: చంద్రబాబు ప్రభుత్వంలో మద్యం ఏరులై పారుతోంది. నెల్లూరు నగరంలో వేకువజాము నుండే మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. సూర్యుడు ఉదయయించక మునుపే బార్ తెరుచుకుంది. ఉదయాన్నే హరినాధపురం సమీపంలోని పికాక్ బార్ అండ్ రెస్టారెంట్‌లో జోరుగా మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. షెటర్ పూర్తీగా తెరిచి మరీ విక్రయాలు జరుపుతున్నారు. సిట్టింగ్‌కు సైతం అనుమతి ఇచ్చేశారు. బార్ ముందు మద్యం మత్తులో ఓ వ్యక్తి తూలుతూ హల్‌చల్ చేశాడు. ఎక్సైజ్, పోలీస్ శాఖ అటువైపు కన్నెత్తి అయినా చూడటం లేదు.
కాగా, రాష్ట్రంలో ఊరూరా బెల్టుషాపులు దర్శనమిస్తున్నాయి. ఏనీటైమ్ మద్యం అందుబాటులో ఉంటోంది. మద్యం దుకాణాలు లేని గ్రామాల్లో లిక్కర్ సిండికేట్లు స్థానిక కూటమి నేతలతో కలిసి బడ్డీ దుకాణాల్లో బెల్టుషాపులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నకిలీ మద్యం తయారీని ఒక పరిశ్రమలా మార్చి టీడీపీ పెద్దల కనుసన్నల్లోనే రాష్ట్రమంతా పారించి అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నారని ప్రజలు ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు.


