జీజీహెచ్ పిల్లల వార్డులో మంటలు
● బిడ్డలతో పరుగులు తీసిన తల్లిదండ్రులు
● త్రుటిలో తప్పిన ప్రాణాపాయం
కాలిబూడిదైన బెడ్లు
భయపడిన చిన్నారిని సముదాయిస్తూ.. నీరు తాగిస్తున్న తల్లి
బెడ్‌పై చిన్నారులు
నెల్లూరు(అర్బన్): నగరంలోని సర్వజన ఆస్పత్రి ఎమ్సీహెచ్ విభాగంలో గల హెచ్‌డీ పిల్లల వార్డులో పెద్ద శబ్దాలతో రెండు ఏసీలు ఆదివారం సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో పేలాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూటే కారణమనే ప్రాథమిక నిర్ధారణకు అధికారులొచ్చారు. డ్యూటీలో ఉన్న డాక్టర్ మాధురి మరో ఇద్దరు సిబ్బందితో కలిసి పిల్లల వార్డులో ఉన్న అద్దాలను పగలగొట్టారు. పెద్దగా కేకలేయడంతో సిబ్బంది హుటాహుటిన వచ్చి విద్యుత్ సరఫరాను నిలిపేశారు. దీంతో పిల్లల వార్డుతో సహా ఎమ్సీహెచ్ బ్లాక్ మొత్తం ఒక్కసారిగా అంధకారంగా మారింది. అప్రమత్తమైన సిబ్బంది అగ్నినిరోధక పరికరాల్లో ఉండే గ్యాస్‌ను వదిలి మంటలను ఆర్పేశారు. తల్లిదండ్రులు తమ బిడ్డలను తీసుకొని బయటకు పరుగులు తీశారు. కొంతసేపు భయంతో రోగులు వణికిపోయారు. ఏమి జరిగిందో అర్ధం కాక హాహాకారాలు చేశారు. అక్కడ పిల్లలు, పురిటి పిల్లలు, కాన్పుల వార్డులున్నాయి. బ్లాక్‌లో 150 మంది వరకు రోగులున్నారని అంచనా. పిల్లల వార్డుతో పాటు ఎన్‌ఐసీయూలో ఉన్న వారిని అధికారులు ట్రామా వార్డులోకి మార్చి వైద్యసేవలకు ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు చేపట్టారు. త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. ఆస్తి నష్టం ఏ మేర సంభవించిందనే వివరాలు తెలియాల్సి ఉంది. సూపరింటెండెంట్ మాధవి, అడ్మినిస్ట్రేటివ్ అధికారి, డిప్యూటీ కలెక్టర్ మహేశ్వరరెడ్డి, డాక్టర్లు సుశీల్, కళారాణి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ రోగులకు అండగా నిలిచి ఇబ్బందుల్లేకుండా చర్యలు చేపట్టారు.
● తొమ్మిది మంది పురిటి పిల్లలను కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఎస్పీ అజిత, ఆర్డీఓ అనూష, విద్యుత్ శాఖ డీఈ శ్రీధర్ పరిశీలించారు.
నిర్లక్ష్యమే కొంపముంచిందా..?
రెండు నెలల క్రితం కూడా ఆటో గ్లవ్ మెషీన్ పేలింది. అప్పట్లోనే అద్దాలు పగిలి, కుర్చీలు ఎగిరిపడ్డాయి. కొంతమేర ఆస్తి నష్టం సంభవించింది. అయితే ఈ విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు. ఇదే అంశమై సాక్షిలో కథనం సైతం ప్రచురితమైంది. అయినా అఽధికారులు పట్టించుకోకపోవడంతో మళ్లీ షార్ట్ సర్క్యూట్ సంభవించిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఆస్పత్రి ఆవరణలో చంటి పిల్లలతో తల్లులు తదితరులు
చిన్నారులను ట్రామా వార్డుకు అంబులెన్స్‌లో తరలిస్తున్న అధికారులు
ఏసీ పేలడంతోనే ప్రమాదం
నెల్లూరు(అర్బన్): నగరంలోని ప్రభుత్వ పెద్దాస్పత్రిలో ఏసీ పేలడంతోనే మంటలు చెలరేగాయని ఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ ఎస్‌ఈ రాఘవేంద్రం తెలిపారు. ఆస్పత్రిలోని ఎమ్సీహెచ్ విభాగాన్ని సిబ్బందితో కలిసి ఆదివారం పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రసూతి వార్డులో ఒక రూమ్‌లో ఏసీ పేలడంతో షార్ట్ సర్క్యూట్ సంభవించిందని, దీని ప్రభావంతో పక్కనే ఉన్న రెండు బెడ్లపై నిప్పు రవ్వలు పడి కాలిపోయాయన్నారు. ఈ ఘటన ఆ రూమ్‌కు మాత్రమే పరిమితమైందన్నారు. మిగిలిన అన్ని వార్డులకు విద్యుత్ సరఫరా యథావిధిగా కొనసాగుతోందని, భయపడాల్సిన అవసరం లేదన్నారు.
జీజీహెచ్ పిల్లల వార్డులో మంటలు
జీజీహెచ్ పిల్లల వార్డులో మంటలు
జీజీహెచ్ పిల్లల వార్డులో మంటలు
జీజీహెచ్ పిల్లల వార్డులో మంటలు


