సోమిరెడ్డిది అవినీతి బతుకు
● ధ్వజమెత్తిన కాకాణి గోవర్ధన్‌రెడ్డి
నెల్లూరు(అర్బన్): సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిదీ ఒక బతుకేనానంటూ మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. తనపై సోమిరెడ్డి చేసిన విమర్శలకు ప్రతిగా కాకాణి ఒక ప్రకటనను ఆదివారం విడుదల చేశారు. సర్వేపల్లిలో చిన్నపిల్లాడ్ని అడిగినా సోమిరెడ్డి చరిత్ర ఏమిటో చెప్తారన్నారు. అవినీతి గురించి మాట్లాడే అర్హత ఆయనకు ఉందానని ప్రశ్నించారు. ఆయన్ను చూసి సర్వేపల్లి ప్రజలు ఛీ కొడుతున్నారని తెలిపారు. అవినీతిని ప్రశ్నించినప్పుడల్లా ఎదుటివారిపై దాడి చేసే అలవాటు ఆయనకే సొంతమని విమర్శించారు. కాకుటూరు శివాలయ రోడ్డు వేసే కాంట్రాక్టర్ నుంచి డబ్బులు వసూలు చేసింది వాస్తవం కాదానని ప్రశ్నించారు. కాగితాలపూరు వద్ద పొలాన్ని కాజేయాలని చూసి వీలుకాక నుడాకు అప్పగిస్తున్నానంటూ మాట మార్చింది నిజం కాదానన్నారు. ఎదుటి వారి గురించి మాట్లాడేటప్పుడు నోటిని అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేదిలేదని స్పష్టం చేశారు. ధైర్యముంటే తనతో పోటీపడాలని సవాల్ విసిరారు. విమర్శలు చేయడాన్ని ఇప్పటికైనా మానుకోవాలని హితవు పలికారు. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని స్పష్టం చేశారు.


