అంగన్‌వాడీల పోరుబాట
నెల్లూరు(పొగతోట): సమస్యల సాధన కోసం అంగన్‌వాడీలు పోరుబాట పట్టారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయాలనే డిమాండ్‌తో నిరసన కార్యక్రమాలను పది రోజులుగా నిర్వహిస్తున్నారు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో చలో విజయవాడ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సోమవారం చేపట్టనున్నారు. వీరికి సీఐటీయూ మద్దతిస్తోంది.
ఇవీ హామీలు..
తమను ప్రభుత్వోద్యోగులుగా గుర్తించడంతో పాటు కనీస వేతనంగా రూ.26 వేలను ఇవ్వాలని అంగన్‌వాడీలు డిమాండ్ చేస్తున్నారు. గ్రాట్యుటీ అమలుకు మార్గదర్శకాలను రూపొందించడంతో పాటు మేలో వేసవి సెలవుల జీఓను విడుదల చేయాలంటున్నారు. జిల్లాలోని 2934 అంగన్‌వాడీ కేంద్రాల్లో దాదాపు ఆరు వేల మందికిపైగా కార్యకర్తలు, ఆయాలు అతి తక్కువ వేతనాలతో ఏళ్లుగా పనిచేస్తున్నారు. పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు.
తుంగలో తొక్కి..
గత ఎన్నికల్లో విజయమే పరమావధిగా ఊకదంపుడు హామీలను చంద్రబాబు గుప్పించారు. తీరా అధికారంలోకి వచ్చాక, వీటి అమలుకు డబ్బుల్లేవంటూ తుంగలో తొక్కారు. బడ్జెట్ కేటాయింపుల్లోనూ ఐసీడీఎస్ శాఖకు అన్యాయం చేశారనే ఆవేదన అంగన్‌వాడీ కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. డబ్బుల్లేవనే విషయం హామీలిచ్చే సమయంలో తెలియదానని వీరు మండిపడుతున్నారు.
బెదిరింపు ధోరణి
పోలీసుల ద్వారా ప్రభుత్వం బెదిరింపు చర్యలకు పాల్పడుతుండటంతో అంగన్‌వాడీలు వేర్వేరుగా విజయవాడ చేరుకుంటున్నారు. ఆరోగ్యం సక్రమంగా లేని వారు, గర్భిణులు, బాలింతల మినహా అధిక శాతం మంది ఇందులో పాల్గొననున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలను పూర్తి స్థాయిలో సోమవారం మూసేయనున్నారు.
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందే
మా సత్తా ఏమిటో ప్రభుత్వానికి
తెలియజేస్తాం
చలో విజయవాడ నేడు


