
సాక్షి, అమరావతి: మద్యంప్రియులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్తను చెప్పింది. మద్యం ధరలను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఐఎమ్ఎఫ్ లిక్కర్, ఫారిన్ లిక్కర్(మధ్య, ఉన్నత శ్రేణి బ్రాండ్లు) ధరలను క్రమబద్దీకరిస్తూ మార్పుచేర్పులు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణా నియంత్రణ చర్యల్లో భాగంగానే ధరలు సవరించినట్లు పేర్కొంది. తగ్గించిన మధ్యం ధరల పట్టికను తెలియజేస్తూ అబ్కారీ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. రూ. 50 నుంచి రూ.1350 వరకు వివిధ కేటగిరీల బ్రాండ్లపై మద్యం ధరలను తగ్గించింది. బీర్లు, రెడీ టూ డ్రింక్స్ రేట్లు మాత్రం యథాతథంగా కొనసాగనున్నట్లు స్పష్టం చేసింది. (చదవండి: ఏపీ: ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకోవడంపై నిషేధం)
33 శాతం మద్యం షాపులు తగ్గించాం
అక్రమ మద్యాన్ని నియంత్రించేందుకే ధరలను సవరించామని ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి తెలిపారు. దశల వారీ మద్య నియంత్రణకు అనేక చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. గురువారం ఆయన విజయవాడలో మాట్లాడుతూ.. ఎస్ఈబీ ద్వారా అక్రమ మద్యాన్ని నియంత్రిస్తున్నామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ రవాణా తగ్గించడానికే ధరలు తగ్గించామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 33 శాతం మద్యం షాపులను తగ్గించామని, అంటే 43 వేల బెల్టు షాపులను తొలగించామని పేర్కొన్నారు.