టెకీ రాధా గాయత్రి కేసులో కీలక పరిణామం | latest update on Vizag Techie Radha Gayatri Death Case | Sakshi
Sakshi News home page

టెకీ రాధా గాయత్రి కేసులో కీలక పరిణామం

Jun 21 2026 5:54 PM | Updated on Jun 21 2026 6:28 PM

latest update on Vizag Techie Radha Gayatri Death Case

ముస్సోరీ: ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీ హిల్ స్టేషన్‌లో గల ఒక హోటల్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించిన తెలుగు సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని రాధా గాయత్రి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాధా గాయత్రి మృతిపై ఆమె తండ్రి ముస్సోరీ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా మృతురాలి భర్త శ్రీచరణ్‌పై పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

తన కుమార్తె మరణం వెనుక బలమైన అనుమానాలు ఉన్నాయని, దీనిని హత్యగా పరిగణించి సమగ్ర విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.తన ఫిర్యాదులో శ్రీచరణ్‌ ప్రవర్తనపై రాధా గాయత్రి తండ్రి పలు సంచలన ఆరోపణలు చేశారు.

పెళ్లయినప్పటి నుంచి శ్రీచరణ్ తన కుమార్తెతో సరిగ్గా కలిసి ఉండేవాడు కాదని, ఆమెను తీవ్ర మానసిక వేధింపులకు గురిచేసేవాడని పేర్కొన్నారు. శ్రీచరణ్‌ ఒక సైకోలా ప్రవర్తించేవాడని, నిరంతరం నిఘా ఉంచేందుకు గాయత్రి బ్యాగులో ట్రాకర్ కూడా పెట్టేవాడని ఆవేదన వ్యక్తం చేశారు. భర్త పెట్టే వేధింపుల గురించి గాయత్రి గతంలో తమతో పలుమార్లు చెప్పి ఏడ్చిందని ఆయన ఫిర్యాదులో వివరించారు. కుమార్తె మరణంపై భర్త శ్రీచరణ్‌ వ్యవహరిస్తున్న తీరుపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

రాధా గాయత్రికి లోబీపీ ఉందని శ్రీచరణ్ అబద్ధాలు చెబుతున్నాడని, కానీ ఆమె ఆరోగ్య చరిత్రలో ఎప్పుడూ బీపీ సమస్యే లేదని స్పష్టం చేశారు. భార్య చనిపోతే శ్రీచరణ్ ఎందుకు మౌనంగా ఉన్నాడని ఆయన ప్రశ్నించారు. అలాగే, హోటల్‌లో బీరులో మత్తు పదార్థాలు కలిపారనే వార్తలు మీడియాలో వస్తున్నాయని, ఈ కోణంలో కూడా పోలీసులు లోతుగా విచారణ జరపాలని కోరారు.ఈ కేసులో పోలీసులు ప్రాథమిక ఆధారాలను సేకరించడంలో నిర్లక్ష్యం వహించారని రాధా గాయత్రి తండ్రి ఆరోపించారు.

ఘటన జరిగిన రోజున భర్త శ్రీచరణ్‌ రక్త నమూనాలను ఎందుకు సేకరించలేదని ఆయన నిలదీశారు. ఈ కేసులో నిజాలు బయటకు రావాలంటే ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా శాస్త్రీయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఘటనకు ముందు జరిగిన 48 గంటల ఆర్థిక లావాదేవీలను పరిశీలించాలని, రాధకు నిజంగానే మత్తు పదార్థాలు ఇచ్చారా లేదా అనేది తేల్చాలన్నారు. దీంతో పాటు హోటల్ రికార్డులు, ఫోన్ కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజీలను తక్షణమే భద్రపరచాలని ముస్సోరీ పోలీసులను కోరారు. తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తును వేగవంతం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement