
రాజధానిలో సీబీఐకి ఎకరం రూ.4 కోట్ల చొప్పున 2 ఎకరాలు 60 ఏళ్లకు లీజు
పుల్లెల గోపీచంద్, ఎమ్మెస్కేకు ఎకరం రూ.10 లక్షల చొప్పున చెరో 12 ఎకరాలు
కిమ్స్ వైద్య కళాశాల ఏర్పాటుకు ఎకరం రూ.50 లక్షల చొప్పున 25 ఎకరాలు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో భూ కేటాయింపుల్లో ప్రభుత్వ పెద్దల దమననీతికి మరో నిదర్శనమిది. జాతీయ సంస్థలకు ఎకరం రూ.4 కోట్ల చొప్పున కేటాయించిన సర్కారు.. అస్మదీయులకు చెందిన ప్రయివేటు సంస్థలకు ఎకరం రూ.10 లక్షల చొప్పున ఇచ్చేసింది. రాజధాని ప్రాంతంలో మంత్రుల బృందం సిపార్సుల మేరకు కొత్తగా ఏడు సంస్థలకు భూకేటాయింపులు చేస్తూ.. ఆరు సంస్థలకు గతంలో చేసిన భూ కేటాయింపులను సవరిస్తూ.. గతంలో భూమి కేటాయించిన రెండు సంస్థలకు వాటిని రద్దు చేస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
» సీబీఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) సంస్థకు రాయపూడిలో గతంలో 3.50 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. ఇప్పుడు దాన్ని సవరిస్తూ రాయపూడిలో కేవలం 2 ఎకరాలను మాత్రమే అదీ ఎకరం రూ.4 కోట్ల చొప్పున 60 ఏళ్లకు లీజుకు ఇచ్చింది.
» జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జెడ్‌ఎస్‌ఐ)కు గతంలో అంబరాజుపాలెం–రాయపూడి వద్ద ఎకరం కేటాయించింది. ఇప్పుడు దాన్ని సవరిస్తూ అదే ప్రాంతంలో 2 ఎకరాలను ఎకరం రూ.కోటి చొప్పున 60 ఏళ్లకు లీజుకు ఇచ్చింది.
» స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు చదరపు మీటర్‌కు ఏడాదికి రూ.1 చొప్పున 5 ఎకరాలను 11 ఏళ్లకు లీజుకు ఇచ్చింది. ఆప్కాబ్‌కు గతంలో రాయపూడి వద్ద 3.095 ఎకరాలు కేటాయించిన సర్కార్.. ఇప్పుడు 0.495 ఎకరాలను ఎకరం రూ.2 కోట్ల చొప్పున కేటాయించింది.
» అబ్బరాజుపాలెంలో పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమికి 12 ఎకరాలు, ఎమ్మెస్కే ప్రసాద్ క్రికెట్ అకాడమికి 12 ఎకరాలు ఎకరం రూ.10 లక్షల చొప్పున కేటాయించింది.
» కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌కు ఎకరం రూ.4 కోట్ల చొప్పున 2 ఎకరాలు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుకు ఉద్దండరాయునిపాళెంలో ఎకరం రూ.4 కోట్ల చొప్పున 2 ఎకరాలను 60 ఏళ్లకు లీజుకు ఇచ్చింది. ఎస్‌ఐబీ(సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో)కు పిచ్చుకలపాలెం వద్ద 0.50, వెలగపూడి వద్ద కెనరా బ్యాంక్‌కు 0.40, అనంతవరంలో బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్‌కు 0.5 ఎకరాలను ఎకరం రూ.4 కోట్ల చొప్పున 60 ఏళ్లకు లీజుకు ఇచ్చింది.
» నిడమర్రులో కిమ్స్ వైద్య కళాశాలకు ఎకరం రూ.50 లక్షల చొప్పున 25 ఎకరాలను కేటాయించింది. పిచ్చుకలపాలెంలో బీజేపీ కార్యాలయం ఏర్పాటుకు ఏడాదికి రూ.వెయ్యి చొప్పున 2 ఎకరాలను 33 ఏళ్లకు లీజుకు ఇచ్చింది.
