వడివడిగా ఒడిసిపడుతూ

Krishna River Projects Full Of Water Heavy Rains Andhra Pradesh - Sakshi

శ్రీశైలంపై ఆధారపడ్డ కృష్ణా ప్రాజెక్టులు కళకళ

గత మూడేళ్ల తరహాలో ఈసారీ అధిక ఆయకట్టుకు నీళ్లందించేలా ప్రణాళిక

సీఎం జగన్‌ ఆదేశాల మేరకు అధికారులు సన్నద్ధం

సాక్షి, అమరావతి: కృష్ణా వరద ఉద్ధృతికి జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్‌లు నిండిపోవడంతో గేట్లు ఎత్తివేసి సముద్రంలోకి నీటిని వదిలేస్తున్నారు. కడలిలో కలిసే సమయంలో కృష్ణా జలాలను రెండు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం మళ్లించుకున్నా వాటిని నికర జలాల్లో(కోటా) కలపకూడదన్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపాదనకు కృష్ణా బోర్డు ఆమోదం తెలిపింది. దీంతో గత మూడేళ్ల తరహాలోనే ఈ ఏడాదీ శ్రీశైలం ప్రాజెక్టుపై ఆధారపడ్డ అన్ని ప్రాజెక్టులనూ వరద జలాలతో నింపాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు.

ఈ మేరకు శ్రీశైలం ప్రాజెక్టులో పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి కుడిగట్టు ప్రధాన కాలువ ద్వారా వరద జలాలను తరలిస్తూ– తెలుగుగంగ, గాలేరు–నగరి సుజల స్రవంతి, శ్రీశైలం కుడిగట్టు కాలువ(ఎస్సార్బీసీ)లో అంతర్భాగమైన ప్రాజెక్టులను నింపడంలో అధికారులు నిమగ్నమయ్యారు. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి 14 వేల క్యూసెక్కులతో ప్రారంభించి గరిష్టంగా 44 వేల క్యూసెక్కులను తరలించి ప్రాజెక్టులన్నీ యుద్ధప్రాతిపదికన నింపేలా చర్యలు చేపట్టారు.

శ్రీశైలం ప్రాజెక్టులో మల్యాల ఎత్తిపోతల నుంచి హంద్రీ–నీవా సుజల స్రవంతి కాలువలోకి 1,688 క్యూసెక్కులను ఎత్తిపోస్తున్నారు. గత మూడేళ్ల తరహాలోనే ఈ ఏడాదీ సామర్థ్యం కంటే అధికంగా అంటే 40 టీఎంసీల కంటే ఎక్కువగా తరలించి దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేసేలా చర్యలు చేపట్టారు. ఎన్నడూ లేని రీతిలో పెన్నా బేసిన్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో శ్రీసత్యసాయి, అనంతపురం, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో ప్రాజెక్టులకు జలకళ చేకూరింది.

కృష్ణా ఉప నదులైన వేదవతి, హంద్రీలు ఉరకలెత్తుతుండటంతో వాటిపై ఉన్న భైరవానితిప్ప ప్రాజెక్టు, గాజులదిన్నె ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. తుంగభద్ర డ్యామ్‌లో పుష్కలంగా నీటి లభ్యత ఉండటంతో ఎగువ ప్రధాన కాలువ(హెచ్చెల్సీ), దిగువ కాలువ(ఎల్లెల్సీ)లకు కోటా జలాలు వస్తాయి. తుంగభద్ర డ్యామ్‌ దిగువన తుంగభద్రలో నీటి లభ్యత మెరుగ్గా ఉండటంతో కేసీ కెనాల్‌ ఆయకట్టుకు సమృద్ధిగా నీళ్లందనున్నాయి. గత మూడేళ్ల తరహాలోనే ఈ ఏడాదీ రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో రికార్డు స్థాయిలో పంటల సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top