విప్ల‌వాత్మ‌క సంస్క‌ర‌ణ‌ల‌తో దేవదాయ శాఖ‌లో సువ‌ర్ణాధ్య‌యం | Sakshi
Sakshi News home page

విప్ల‌వాత్మ‌క సంస్క‌ర‌ణ‌ల‌తో దేవదాయ శాఖ‌లో సువ‌ర్ణాధ్య‌యం

Published Thu, Feb 8 2024 8:35 PM

Kottu Satyanarayana Slams Chandrababu Over Endowment Developments - Sakshi

సాక్షి, అమ‌రావ‌తి: రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్ళ పాల‌న‌లో దేవదాయ‌, ధ‌ర్మాదాయ శాఖ‌లో తీసుకొచ్చిన విప్ల‌వాత్మ‌క‌మైన సంస్క‌ర‌ణ‌లు దేవదాయ శాఖ‌లో ఒక సువ‌ర్ణాధ్యాయం అని రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి, దేవ‌దాయ శాఖ మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ పేర్కొన్నారు. వెల‌గ‌పూడి స‌చివాల‌యంలో మంత్రి ఛాంబ‌రులో గురువారం ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో మాట్లాడారు. గ‌డ‌చిన ఐదేళ్ళ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప‌రిపాల‌న స‌మ‌ర్ధవంతంగా జ‌రిగింద‌ని, అర్హులైన పేద‌లంద‌రికీ ల‌బ్ధి చేకూరింద‌ని అన్నారు. ఇచ్చిన హామీల‌ను అన్నింటిని అమ‌లు చేసిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్ర‌భుత్వంపై ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శించ‌డం బాధాక‌ర‌మ‌న్నారు.

తెలుగుదేశం ప్ర‌భుత్వంలో అనేక దేవాల‌యాల‌ను కూల్చేయ‌గా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం వాటిన్నంటిని పున‌రుద్ధ‌రించ‌డ‌మే కాకుండా 4500 కొత్త ఆల‌యాల‌ను నిర్మించింద‌న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.1600 కోట్ల వ్య‌యంతో ప్ర‌ముఖ దేవాల‌యాల అభివృద్ధికి శ్రీకారం చుట్టామ‌న్నారు. శ్రీశైలం దేవాల‌యంలో భ‌క్తుల‌కు సౌక‌ర్యం క‌ల్పించే దిశ‌గా సాల‌మండ‌పాలు నిర్మాణాల‌ను త్వ‌ర‌లో ప్రారంభించ‌నున్నామ‌ని తెలిపారు. విజ‌య‌వాడ‌లో ఇటీవ‌ల జ‌రిగిన మ‌హాల‌క్ష్మి య‌జ్ఞం ఫ‌లితంగా కేంద్రం నుంచి నిధులు వ‌ర‌ద‌ల్లా పారాయ‌న్నారు. 2018 వ‌ర‌కు 1621 దేవాల‌యాల‌కు మాత్ర‌మే ధూప‌దీప నైవేధ్యాల సౌక‌ర్యం ఉండేద‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక 10వేల దేవాల‌యాల వ‌ర‌కు ధూప‌దీప నైవేధ్యాలు జ‌రిగేలా నిర్ణ‌యం తీసుకున్నామ‌న్నారు.

హిందూ ధ‌ర్మం గొప్ప‌త‌నాన్ని తెలియ‌జేసే విధంగా హిందూ ధ‌ర్మ ప్ర‌చార ప‌రిష‌త్ ద్వారా వార‌, మాసోత్స‌వాల‌ను నిర్వ‌హిస్తున్నామ‌న్నారు. అర్చ‌క వెల్ఫేర్ బోర్డు, ఆగ‌మ స‌ల‌హామండ‌లి, అర్చ‌క ట్రైనింగ్ అకాడ‌మీని ఏర్పాటు చేశామ‌న్నారు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలోని ప్ర‌ముఖ ఆల‌యాల్లో ఆన్‌లైన్ ద్వారా బుకింగ్ సౌక‌ర్యం క‌ల్పించే విధంగా సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకువ‌స్తున్నామ‌ని పేర్కొన్నారు. అలాగే ఆన్‌లైన్ బుకింగ్ కోసం యాప్‌ను కూడా రూపొందించామ‌న్నారు.

దేవాల‌యాల భూముల‌ను అన్యాక్రాంతం కాకుండా కాపాడుకునేందుకు క‌మిటీని ఏర్పాటు చేశామ‌న్నారు. ఎండోమెంట్ ఆస్తుల లీజు గ‌డువు ముగిశాక ఖాళీ చేసే విధంగా ఒక చ‌ట్టాన్ని అమ‌ల్లోకి తెచ్చామ‌న్నారు. ఆ చ‌ట్టం ప్ర‌కారం వారిని ఖాళీ చేసేలా చ‌ర్య‌లు తీసుకుంటుంద‌న్నారు. అర్చ‌కులు ప‌నిచేసే దేవాల‌యాల ప‌రిధిలో వారికి ఇళ్ళ స్థ‌లాలు కేటాయించామ‌న్నారు. అందులో భాగంగా ఇళ్ళు లేని పేద అర్చ‌కుల‌కు ఇళ్ళు మంజూరు చేశామ‌ని  చెప్పారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాల‌యాల ఉద్యోగుల‌కు ప‌దోన్న‌తులు క‌ల్పించామ‌ని చెప్పారు. చ‌రిత్ర‌లో ఏ ముఖ్య‌మంత్రి చేయ‌ని విధంగా ప‌దోన్న‌తులు క‌ల్పించ‌డ‌మే కాకుండా ఆల‌యాల నిర్మాణాల‌లో క్వాలిటీని పెంచేందుకు ఇంజ‌నీర్ల‌ను నియ‌మిస్తున్నామ‌న్నారు. ప్రీ ఆడిట్ సిస్టంను అమ‌ల్లోకి తెచ్చింది వైసీపీ ప్ర‌భుత్వమేన‌ని పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆల‌యాల ఉద్యోగుల ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సు పెంపు, ప‌దోన్న‌తులు క‌ల్పించిన సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని ప‌లు దేవాయాల‌కు చెందిన ఉద్యోగులు మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ‌కు అభినంద‌న‌లు తెలిపి గ‌జ‌మాల‌తో స‌త్క‌రించారు.

Advertisement
Advertisement