సాక్షి, ఏలూరు: కైకలూరు బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌కు ఊహించని షాక్ తగిలింది. ఎమ్మెల్యే కామినేనిపై కొల్లేరు వాసులు తిరగబడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని కామినేని శ్రీనివాస్‌ను ప్రజలు నిలదీశారు. దీంతో, అసహనానికి గురైన ఎమ్మెల్యే.. ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఊగిపోయారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.
వివరాల మేరకు.. ఎన్నికల ముందు కూటమి అధికారంలోకి వస్తే కొల్లేరు స్థానికులకే ఇచ్చేస్తామని కామినేని శ్రీనివాస్, కూటమి నేతలు.. స్థానికులకు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ తాజాగా కొల్లేరు ప్రాంతానికి వెళ్లడంతో స్థానికులు హామీ విషయమై నిలదీశారు. చెరువుల విషయంలో ఫారెస్ట్ అధికారులు ఇబ్బంది పెడుతున్నారంటూ కామినేనితో స్థానికులు చెబుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం తమకు ఏం చేశారంటూ కామినేనిని కొల్లేరు వాసులు నిలదీశారు.
ఇదే సమయంలో గత ప్రభుత్వంలో తాము ఎలాంటి ఇబ్బంది పడలేదని కొల్లేరు వాసులు చెప్పుకొచ్చారు. అనంతరం, చెరువుల విషయంలో కామినేనిని నిలదీయడంతో ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు. కొల్లేరు వాసులపై అసహనం వ్యక్తం చేశారు. నేను పట్టించుకోను ఎక్కడికి వెళ్తారో వెళ్లండి.. ఓవరాక్షన్ చేశారు. నోరు మూయండి అంటూ కొల్లేరు వాసులపై నోరు పారేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. అధికార కూటమికి చెందిన ఎమ్మెల్యే అయి ఉండి.. ఇలా మాట్లాడటం ఏంటని స్థానికులు మండిపడుతున్నారు.


