విజయవాడ: కేరళలోని శబరిమల పంపానదితోపాటు చుట్టుపక్కల సరస్సులు, జలాశయాల్లో మెదడును తినే అమీబా ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్న దృష్ట్యా జిల్లా నుంచి కేరళ వెళ్లే అయ్యప్ప భక్తులు, టూరిస్టులు అప్రమత్తంగా ఉండాలని ఎనీ్టఆర్ జిల్లా డీఎంహెచ్‌వో డాక్టర్ మాచర్ల సుహాసిని శనివారం సూచించారు. పంపానది, చుట్టుపక్కల సరస్సులు, జలాశయాల్లో స్నానము ఆచరిస్తే ‘మెదడు తినే అమీబా’ బారిన పడే అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటున్నట్లు ఆమె తెలిపారు. దీనిని బ్రెయిన్ ఈటింగ్ అమీబా అని పిలుస్తారని తెలిపారు. ఇది మనుషుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందదని స్పష్టం చేశారు. కేవలం జలాశయాలు, నదుల్లో స్నానం చేసినప్పుడు ముక్కు, నోటి ద్వారా మాత్రమే శరీరంలోకి ప్రవేశించి అమీబిక్ మీనింగో ఎన్ సఫిలిటీస్ అనే రక్తాక్రమ వ్యాధి రావడానికి కారణమవుతుందన్నారు. ఈ వ్యాధికి పూర్తిస్థాయి చికిత్స లేదన్నారు.
ఐదు రోజుల్లో ప్రభావం..
ఈ మెదడు తినే అమీబా సోకిన వారిలో ఐదు రోజుల తర్వాత తీవ్రమైన తలనొప్పి, జ్వరం, ముక్కులో శ్వాసకు ఆటంకం ఏర్పడటం, వాంతులు, మెడనొప్పి, మెడ భాగంలో మంట, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని డీఎంహెచ్‌వో తెలిపారు. నిర్లక్ష్యం చేస్తే బాధితులు కోమాలోకి వెళ్లే పరిస్థితి ఏర్పడుతుందన్నారు.
జాగ్రత్తలు ఇలా..
నదులు, జలాశయాల్లో స్నానం చేసేటప్పుడు ముక్కు, నోరు మూసుకోవాలి. నోటిలోకి నీరు వెళ్లకుండా తగు జాగ్రత్తలు పాటించాలి. కేరళ వెళ్లే పర్యాటకులు, శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులు ఈ ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని డీఎంహెచ్‌వో సుహాసిని సూచించారు.


