చంద్రబాబు అమలుచేస్తే జగన్ తొలగించినట్లుగా నిస్సిగ్గుగా అబద్ధాలా!?
కన్నా లక్ష్మీనారాయణ, రామానాయుడు తప్పుడు ప్రచారంపై కాపు రిజర్వేషన్ పోరాట సమితి ఫైర్
కాపులకు చంద్రబాబు ఏ రిజర్వేషన్లు అమలుచేయలేదు
బీసీ–ఎఫ్ ద్వారా 5 శాతం రిజర్వేషన్లని ఒకసారి మోసం చేశారని మండిపాటు
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు ఏమాత్రం అమలుచేయని కాపుల రిజర్వేషన్లను వైఎస్ జగన్ రద్దుచేసే అవకాశం ఎక్కడుంటుందని కాపు రిజర్వేషన్ పోరాట సమితి (కేఆర్‌పీఎస్) సూటిగా ప్రశ్నించింది. చంద్రబాబు వాటిని అమలుచేస్తే.. జగన్ తొలగించినట్లు టీడీపీ కూటమి నేతలు నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు చెప్పడం మానుకోవాలని సమితి తీవ్రస్థాయిలో హెచ్చరించింది. ఈ రిజర్వేషన్ల విషయమై మీడియా సమావేశాల్లో మంత్రి నిమ్మల రామానాయుడు, మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ నోటికొచ్చినట్లు అబద్ధాలు చెప్పడంపై తీవ్రంగా స్పందించిన కేఆర్‌పీఎస్ నేతలు గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు.
ఆ లేఖను కేఆర్‌పీఎస్ గౌరవ చైర్మన్ దాసరి రాము, చైర్మన్ చనమల్ల ప్రసాదరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ మాసాబత్తుల శ్రీనివాస్, కన్వీనర్ రావి శ్రీనివాస్, కో చైర్మన్లు కాజా సత్యనారాయణ, కర్రి వెంకటరమణ, మెర్ల నాగ సత్యనారాయణ తదితరులు మీడియాకు విడుదల చేశారు. కాపులకు చంద్రబాబు ఏ రిజర్వేషన్లు అమలుచేయలేదని, ఆయన్ను దామోదరం సంజీవయ్యతో పోల్చడం సరికాదన్నారు. లేఖలో వారు ఏం పేర్కొన్నారంటే..
కాపులకు అన్యాయం చేసింది బాబే..
కాపులకు మేలు చేస్తూ 1994లో కోట్ల విజయభాస్కరరెడ్డి జీఓ–30 ఇచ్చారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 1995 నుంచి 2004 వరకు దీనిని అమలుచేయలేదు. జస్టిస్ పుట్టుస్వామి కమిషన్ నివేదికను కూడా అటకెక్కించారు. అప్పటికి రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్లు 46 శాతమే ఉన్నప్పటికీ కాపులకు రిజర్వేషన్లు అమలుచేయకుండా తీవ్ర అన్యాయం చేసింది చంద్రబాబే.
అప్పట్లో కాపు విద్యార్థులకు స్కాలర్షిప్లు, మెస్ బిల్లులు కూడా మంజూరుచేయని చంద్రబాబును దామోదరం సంజీవయ్యతో పోలుస్తూ మంత్రి నిమ్మల రామానాయుడు కీర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం నిర్వహించిన కాపు రిజర్వేషన్ ఉద్యమంలో పాల్గొన్న నిమ్మల రామానాయుడు అన్నీ తెలిసి అబద్ధాలు చెప్పడం సరికాదు.
రిజర్వేషన్లపై అడుగడుగునా మోసం..
అధికారంలోకి వచ్చిన ఆర్నెలల్లో కాపు రిజర్వేషన్లు అమలుచేస్తానంటూ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి అత్యంత పకడ్బందీగా చంద్రబాబు మోసం చేశారు. బీసీ–ఎఫ్ ద్వారా కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఒకసారి, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పది శాతంలో కాపులకు ఐదు శాతం ఇస్తామంటూ మరోసారి చంద్రబాబు దగా చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని చంద్రబాబు హామీలిచ్చారేగానీ ఆచరణలో ఆయనెక్కడ అమలుచేశారు? ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ఆనాడే రోస్టర్ పాయింట్లను ఎందుకు నిర్ణయించలేదు?
ఇంకెంత కాలం మోసం చేస్తారు?..
వాస్తవానికి.. భారత రాజ్యాంగ సవరణ ద్వారా మోదీ ప్రభుత్వం 2018 చివర్లో 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ప్రకటించింది. 2019 ప్రారంభంలో దేశమంతా దీనిని అమలుచేసినా తెలుగు రాష్ట్రాల్లో అమలుచేయలేదు. అనుమతి కోసం అనే సాకుతో చంద్రబాబు అవసరంలేకపోయినా కేంద్రానికి లేఖలు రాసి కాలయాపన చేసి చేతులు దులిపేసుకున్నారే తప్ప.. రిజర్వేషన్లు అమలుచేయలేదు. వాస్తవ విషయాలను మరుగుపరిచి చంద్రబాబు రిజర్వేషన్లు ఇచ్చేసినట్టు.. వాటిని వైఎస్ జగన్ తీసేసినట్టు కూటమి నేతలు కన్నా, నిమ్మల దారుణమైన అబద్ధాన్ని ప్రచారం చేయడం తగదు.
ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా.. ఇచ్చిన హామీలు అమలుచేయకుండా వైఎస్ జగన్‌పై నెపం నెట్టి ఇంకెంత కాలం కాపులను మోసం చేస్తారు? జనాభా ప్రాతిపదికగా కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల వారికి 12 శాతం రిజర్వేషన్లు అమలుచేయాలనే మా డిమాండ్‌పై టీడీపీ కూటమిలోని కాపు నేతలు ఎందుకు స్పందించరు? అబద్ధాలతో కాపులను మోసగించే ప్రయత్నం చేస్తున్న కన్నా, నిమ్మల వంటి కూటమి నేతలు ఎవరైనా మీడియా సమక్షంలో బహిరంగ చర్చకు వస్తే రిజర్వేషన్ల అమలులోని వాస్తవాలు నిరూపిస్తాం.


