అందరూ మహానుభావులే.. మరి ఎ‍వరి పేరు పెట్టాలి? | Kakinada District Name Change Controversy News In Telugu | Sakshi
Sakshi News home page

అందరూ మహానుభావులే.. మరి ఎ‍వరి పేరు పెట్టాలి?

Sep 24 2025 9:05 AM | Updated on Sep 24 2025 9:05 AM

Kakinada District Name Change Controversy News In Telugu

 కాకినాడ జిల్లా పేరు మార్పుపై రగడ

ఒకరి పేరు పెడితే మరొకరిని తక్కువ చేసినట్టే..

తేనెతుట్టెను కదిల్చినట్టే..  

సాక్షి ప్రతినిధి, కాకినాడ: ప్రశాంతతకు మారుపేరుగా.. పెన్షనర్స్‌ పేరడైజ్‌గా పేరొందిన కాకినాడలో శేషజీవితం గడపాలని ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని చాలా మంది రిటైర్డ్‌ ఉద్యోగులు అనుకుంటారు. అటువంటి కాకినాడ పేరు మార్పు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. కూటమి సర్కార్‌ ఏర్పడిన ఏడాదిన్నర తరువాత జిల్లాలు, మండలాల పునరి్వభజన, ఊరు పేర్ల మార్పు అంటూ హడావుడి చేస్తోంది. ఈ క్రమంలో కాకినాడ జిల్లా పేరు మార్చాలనే డిమాండ్‌ తెర మీదకు వచ్చింది. 500 ఏళ్ల చరిత్ర కలిగిన కాకినాడ మార్చాలనే ప్రతిపాదనపై విభిన్న వర్గాలు భిన్న రీతుల్లో స్పందిస్తున్నాయి. పేరు మార్పు అనే అంశం తెరపైకి వచ్చినదే తడవుగా అనేక మంది ప్రముఖుల పేర్లు కూడా చర్చకు వచ్చాయి. ఒకప్పటి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడతో విడదీయరాని అనుబంధం ఉన్న మహానుభావులు ఎందరో ఉన్నారు. పేదల విద్యాభివృద్ధి కోసం రూ.కోట్ల విలువైన ఆస్తులను తృణప్రాయంగా, నిస్వార్థంగా, నిబద్ధతతో దానం చేసిన ప్రముఖులకు ఇక్కడ కొదవ లేదు. 

పిఠాపురం మహారాజా 
పిఠాపురం రాజా రావు వెంకట కుమార మహీపతి సూర్యారావు బహుదూర్‌. ఈయన దానం చేసిన వేల ఎకరాల్లో ఇప్పుడు అనేక పాఠశాలలు, కళాశాలలు, సత్రాలు నడుస్తున్నాయి. తనకు వారసత్వంగా వచ్చిన ఆస్తులను ఆయన ప్రజల మేలు కోరి ఎంతో ఉదారంగా దానం చేశారు. 

మల్లాడి సత్యలింగ నాయకర్‌ 
కాకినాడ సమీపాన కోరంగి వద్ద బలహీనవర్గాల కుటుంబంలో జన్మించిన మల్లాడి సత్యలింగ నాయకర్‌ స్వశక్తితో కష్టపడి ఉన్నత స్థితికి చేరుకున్నారు. అమ్మ, నాన్న చనిపోతే మేనమామ వద్ద పెరిగిన నాయకర్‌ 12 ఏళ్ల వయస్సులో కోరంగిలోని ఓడ రేవులో పని చేస్తూండేవారు. అక్కడి నుంచి రంగూన్‌ వెళ్లి పని చేయడమే కాకుండా.. కూలీలను తీసుకువెళ్లేవారు. అనంతరం ఎగుమతి, దిగుమతుల కాంట్రాక్టులు చేశారు. 

పిల్లలు లేకపోవడంతో సుబ్రహ్మణ్య నాయకర్‌ను దత్తత తీసుకున్నారు. ధనవంతులు మాత్రమే చదువుకునే రోజులవి. రూపాయి జీతానికి ఒక అధికారి నెలంతా పని చేసే రోజుల్లో నాయకర్‌ రూ.8 లక్షలు సంపాదించి 1,800 ఎకరాలు కొనుగోలు చేసి ఎంఎస్‌ఎన్‌ చారిటీస్‌ సంస్థకు ఇచ్చి, ఈ ప్రాంతంలో విద్యాభ్యున్నతికి బాటలు వేశారు. నాడు బ్రిటిష్‌ ప్రభుత్వ హయాంలో ఆయన రాసిన మరణ శాసనంలో ‘నా వంశంలో ఎవరైనా ప్రాణాలతో లేకుంటే నా యావదాస్తిని ప్రభుత్వానికి అప్పగించేందుకు వీలు లేదు. అవసరమైతే స్థానిక సంస్థలకు అప్పగించాలి’ అని రాశారు. తన సేవలతో ప్రతి ఒక్కరి హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్నారు. 

  • ఇంకా ఎందరో.. 
    కాకినాడకు చెందిన మహర్షి బులుసు సాంబమూర్తి తనకున్న కోట్ల విలువైన యావదాస్తిని దేశ స్వాతంత్య్రం కోసం అఖిల భారత కాంగ్రెస్‌ మహాసభలకు ధారాదత్తం చేశారు. 

  • మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ దివంగత జ్యోతుల సీతారామ్మూర్తి ముత్తాత జ్యోతుల వెంకయ్య అప్పట్లో విక్టోరియా మహారాణికి 100 ఎకరాల భూమిని దానంగా ఇచ్చారని చరిత్ర చెబుతోంది. కాకినాడలో ప్రస్తుతం కుళాయి చెరువు ఉన్న ప్రాంతం అదేనని చెబుతున్నారు. 

  • హిందూ శ్మశానం కోసం 100 ఎకరాలు దానంగా ఇచ్చిన విజ్జపురెడ్డి వంశీయులతో పాటు మూడు తరాల కిందట ముత్తా వంశీయులు, మంత్రిప్రగడ, పైండా, పైడా తదితర వంశీయులు అప్పట్లో సత్రాలు నిర్మించి, అన్నదానాలకు, విద్యాభివృద్ధికి ఇతోధికంగా తోడ్పాటునందించారు. 

  • దివంగత పంతం పద్మనాభం పేరు కూడా ప్రముఖంగానే వినిపిస్తోంది. 

  • ఆగర్భ శ్రీమంతుడు సీవీకే రావు అప్పట్లోనే విదేశాల్లో ఐఏఎస్‌ చదువుకుని స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్నారు. కాకినాడ మున్సిపల్‌ చైర్మన్‌గా, ఎమ్మెల్యేగా రెండు పదవులూ ఏకకాలంలో నిర్వహించారు. రెల్లి వృత్తి పనివార్లను గత సంస్కృతి నుంచి విముక్తికి బాటలు వేసి, వినూత్న సంస్కరణలతో నిస్వార్థ ప్రజాజీవితానికి నిలువుటద్దంగా నిలిచారు. 

  • ఇంకా ఈ జాబితాలో కేఎస్‌ఆర్‌ మూర్తి, జ్ఞానానంద కవి, రఘుపతి వెంకటరత్నం నాయుడు, కృత్తివెంటి పేర్రాజు పంతులు, మద్దూరి అన్నపూర్ణయ్య, దుర్గాబాయి దేశ్‌ముఖ్, మెక్‌లారెన్‌ దంపతులు, విశ్వవిజ్ఞాన మదీనా కబీర్‌ షా వంటి మహనీయులు ఎందరో ఉన్నారు. 

‘పేరు’ కోసం పోరు 
జిల్లాలు, ప్రాంతాల పేర్లు మార్చాలనే ప్రతిపాదనను కూటమి సర్కారు తెర పైకి తెచ్చినప్పటి నుంచీ కాకినాడ జిల్లా పేరు మార్పు డిమాండ్‌ ముందుకు వచ్చింది. కాకినాడ పేరుకు ముందు పిఠాపురం రాజా, మల్లాడి సత్యలింగ నాయకర్‌ పేర్లు పెట్టాలనే డిమాండుతో సాధన సమితులు కూడా ఏర్పాటయ్యాయి. కలెక్టరేట్‌ వరకూ ర్యాలీలు, రౌండ్‌టేబుల్‌ సమావేశాలు కూడా నిర్వహించారు. అయితే, ఘనకీర్తిని సొంతం చేసుకున్న మహానుభావులు ఎంతో మంది కాకినాడలో ఉన్నారు. వీరిలో ఎవరి పేరు పెట్టినా మరొకరిని తక్కువ చేసినట్టే అవుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అందువలన పేరు మార్పు వద్దన్నది వారి వాదన. కాకినాడ పేరు మార్పు జరుగుతుందా లేదా అనేది పక్కన పెడితే ప్రభుత్వం ఎటు మొగ్గు చూపినా అనవసరంగా తేనెతుట్టెను కదిల్చినట్టు అవుతుందని మేధావి వర్గం అభిప్రాయపడుతోంది.

‘కాకినాడ’ పేరు ఇలా..
ఈ ప్రాంతాన్ని 500 ఏళ్లు పరిపాలించిన కాకనందివాడ వంశీయుల పేరిట కాకినాడ పేరు వచ్చిందని చరిత్రకారులు చెబుతారు. చాళుక్యుల కాలం నుంచీ ప్రసిద్ధి చెందిన కాకనందివాడ వంశీయులు ఇప్పుడు లేకపోయినా.. పూర్వ చరిత్రకు సంబంధించిన కాకినాడ పేరును యథాతథంగా ఉంచాలనే డిమాండు కూడా ఉంది. కాకనందివాడ వంశీయులు.. ఆ తరువాత ఫ్రెంచ్, డచ్, బ్రిటిష్‌ వారు పాలించిన సమయంలో కాకినాడకు కో కెనడాగా కూడా దేశ, విదేశాల్లో ఘన చరిత్ర ఉంది. చరిత్రాత్మక కాకినాడ 160 ఏళ్ల మున్సిపాలిటీగా ప్రసిద్ధి.  

పిఠాపురం మహారాజా పేరు పెట్టాలి 
కాకినాడ జిల్లాకు పిఠాపురం మహారాజా రావు సూర్యారావు బహదూర్‌ పేరు పెట్టాలి. ఆయన తెలుగు భాషకు చిరస్మరణీయమైన రచనలు అందించి, గొప్ప సంస్కరణవాదిగా తెలుగు ప్రజలకు ఎనలేని సేవలు చేసిన మహనీయుడు. విద్యాభివృద్ధితో పాటు దళిత జనోద్ధరణకు విశేషంగా కృషి చేశారు. తెలుగు భాషా వికాసానికి శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు తయారు చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. కవులు, రచయితలను శ్రీకృష్ణదేవరాయలు తరువాత అదే స్థాయిలో ఆదరించి, మహిళల అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారు. తెలుగు ప్రాంతంలో సాంస్కృతిక వికాసానికి దోహదం చేసి ఆయన పేరును జిల్లాకు పెట్టడం సముచితం. 
– నల్లమిల్లి శేషారెడ్డి, చాన్సలర్, ఆదిత్య యూనివర్సిటీ 

ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దారు 
పిఠాపురం మహారాజా 1852లో కాకినాడలో పీఆర్‌ హైసూ్కల్‌ను స్థాపించారు. అప్పట్లో బాలికా విద్యకు అవకాశం కలి్పంచారు. 1884లో పిఠాపురం రాజా కళాశాలను స్థాపించారు. రాజమండ్రిలో కందుకూరి వీరేశలింగం స్థాపించిన విద్యా సంస్థలకు భారీ విరాళం ఇచ్చారు. కాకినాడలో బ్రహ్మసమాజ మందిరం, అనాథ శరణాలయం తదితర ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టారు. కాకినాడలో 100 ఏళ్ల క్రితం పీఆర్‌ డిగ్రీ కళాశాల, పిఠాపురంలో జూనియర్, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసి, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని వేలాది మంది విద్యార్థుల విద్యాభ్యున్నతికి బాట వేశారు. విద్యార్థి లోకంతో పాటు అటు అధ్యాపక సంఘాలు కూడా పిఠాపురం రాజా పేరు పెట్టాలని కోరుతున్నాయి. 
– వలవల శ్రీనివాసరావు, రిటైర్డ్‌ ప్రొఫెసర్, పీఆర్‌ డిగ్రీ కళాశాల

నాయకర్‌ పేరు సముచితమే.. 
వందల ఎకరాలు దానం చేసిన మహానీయుడు నాయకర్‌. ఆ రోజుల్లో చాలా మంది వారసత్వంగా వచ్చిన ఆస్తులను మాత్రమే దానం చేశారు. కానీ, స్వశక్తితో సంపాదించిన యావదాస్తినీ పేద విద్యార్థుల అభ్యున్నతికి నాయకర్‌ ధార పోశారు. ఎటువంటి చదువు, వారసత్వంగా వచ్చిన ఆస్తి లేనప్పటికీ పేద కుటుంబాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో నాయకర్‌ చేసిన దానం వెలకట్టలేనిది. జిల్లాకు ఆయన పేరు పెట్టడంలో సందేహించాల్సిందేమీ లేదు. 
– పంపన రామకృష్ణ, ఉపాధ్యక్షుడు, నాయకర్‌ సాధన సమితి 

యావదాస్తినీ ధార పోశారు 
కోరంగి ఓడరేవులో ఒక శ్రామికుడిగా మూటలు మోసి, తన తెలివితేటలతో రంగూన్‌ వెళ్లి, అక్కడ కాంట్రాక్టర్‌గా అంచెలంచెలుగా ఎదిగి, కష్టంతో సంపాదించిన యావదాస్తినీ విద్యాభివృద్ధికి దానం చేసిన మహనీయుడు నాయకర్‌. జిల్లాకు ఆయన పేరు పెట్టాలి. ఇందుకు అన్ని వర్గాలూ ఆమోదం తెలియజేస్తాయనే నమ్మకం ఉంది. రెక్కల కష్టంపై సంపాదించిన ఆస్తినంతటినీ దానం చేసిన, ఉదారమైన మనస్తత్వం కలిగిన నాయకర్‌ అందరివాడు. 
– మల్లాడి రాజు, అధ్యక్షుడు ఎంఎస్‌ఎన్‌ చారీ్టస్‌ పరిరక్షణ సమితి 

పేరు మార్పు వద్దు 
దేశ విదేశాల్లో ఘన చరిత్ర కలిగిన కాకినాడ పేరు మార్పునకు కూటమి ప్రభుత్వం అంగీకరించకూడదు. చరిత్రాత్మక కాకినాడ పేరు రాజమహేంద్రవరం కంటే కూడా ముందుగా అవతరించింది. కాకినాడతో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధికి పిఠాపురం మహారాజా, మల్లాడి సత్యలింగ నాయకర్, బులుసు సాంబమూర్తి, సీవీకే రావు, జ్యోతుల, ముత్తా, పైడా, పైండా తదితరుల కుటుంబాలు తమ ఆస్తులను ధార పోశారు. పలు ఆస్తులు అన్యాక్రాంతంలో ఉన్నాయి. వాటిని తిరిగి ఆయా సంస్థలకు అప్పగించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేయాలి. 
– దూసర్లపూడి రమణరాజు, పురపాలక సంఘం పూర్వ పాలక సభ్యుడు 

పేరు మార్పుతో విభేదాలు 
జిల్లాలో ఎన్నో ఆస్తులు ఇచ్చిన మహనీయులకు గుర్తింపు ఉండేలా అనేక నిర్మాణాలకు వారి పేరు పెట్టాలి. జిల్లాకు ఎవరికి తోచిన పేరు వారు కోరుకుంటారు. దీనివల్ల వర్గ విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. మన జిల్లాకు కాకినాడ పేరు ఉంటేనే బాగుంటుంది. మెజార్టీ ప్రజల అభిప్రాయం కూడా ఇదే అనుకుంటున్నాను. 
– కొటికలపూడి సత్య శ్రీనివాసరావు, 
మాజీ అధ్యక్షుడు, కాకినాడ బార్‌ అసోసియేషన్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement