విదేశీ పర్యటనల వెనుక రహస్యం ఏమిటి?
కనీస సమాచారం ఇవ్వకుండా ఎందుకు వెళ్లినట్టు?
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
నెల్లూరు రూరల్: సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి లోకేశ్ వారం రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని, రాష్ట్ర ప్రజలకు కనీస సమాచారం ఇవ్వకుండా విదేశీ పర్యటనలు చేయడం వెనుక రహస్యం ఏమిటో చెప్పాలని వైఎస్సార్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం నెల్లూరులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘కనీస సమాచారం కూడా ఇవ్వకుండా వారిద్దరూ విదేశీ పర్యటనలకు ఎందుకు వెళ్లినట్టు. తండ్రీ కొడుకుల రహస్య పర్యటనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. జనం దృష్టి మరల్చడానికి మళ్లీ డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరతీశారు.
పెట్టుబడులు ఆకర్షించడంలో తమకు ఎవరూ సాటిలేరంటూ ఫోర్బ్స్ ఒక స్టోరీ రాసిందంటూ తండ్రీ కొడుకులు సోషల్ మీడియాలో నానా హంగామా చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచి్చన నాటినుంచి పెట్టుబడులన్నీ కట్టుకథలే తప్ప ఏ ఒక్కటీ నిజం లేదు. చంద్రబాబు రాష్ట్రంలో లేకపోయినా రెవెన్యూ పుస్తకాల ముద్రణ, పంపిణీ గురించి చర్చించినట్టు ఎక్స్‌లో పోస్టులు పెట్టి ప్రజలను డైవర్ట్ చేస్తున్నారు. బాధ్యతాయుతమైన రాజ్యాంగ పదవుల్లో ఉండి ఇలా రహస్య ప్రదేశాల నుంచి ట్వీట్లు వేయడం వెనుక ఉద్దేశం ఏమిటి. వైఎస్ జగన్ గతంలో తన కుమార్తె గ్రాడ్యుయేషన్ డే కోసం లండన్ వెళ్తున్నట్టు చెప్పి మరీ వెళ్లారు. అయినా దాని గురించి ఈ తండ్రీ కొడుకులు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కానీ.. చంద్రబాబు, లోకేశ్ ప్రత్యేక విమానాల్లో విదేశాలకు వెళ్లి కూడా ఎక్కడున్నారో చెప్పడం లేదు. అంత రహస్యంగా పర్యటనలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది’అని కాకాణి నిలదీశారు.
‘వీటిలో ఒకటైనా వచ్చిందా’
2014–19 మధ్య భాగస్వామ్య సదస్సుల ద్వారా 1,761 ఒప్పందాల ద్వారా రూ.18.87 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 30.91 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ఊదరగొట్టారు. పరిశ్రమల శాఖ కుదుర్చుకున్న రూ.7.68 లక్షల కోట్ల విలువైన 327 ఒప్పందాల్లో అమల్లోకి వచి్చనవి కేవలం 45 మాత్రమే. 2014–19 మధ్య మూడుసార్లు నిర్వహించిన సీఐఐ సదస్సు సహా అనేక సందర్భాల్లో చంద్రబాబు పెట్టుబడులు, పరిశ్రమలపై గొప్పగా ప్రకటనలు చేశారు. వీటిలో ఏ ఒక్కటీ కార్యరూపం దాల్చలేదు. అమరావతి నుంచి విశాఖకు నిమిషాల్లో చేరుకునే హైపర్ లూప్ అన్నారు.
దొనకొండ వద్ద డ్రోన్ డిఫెన్స్, సుఖోయ్ ఎయిర్ క్రాఫ్ట్ సైంటిఫిక్ ఇండ్రస్టియల్ కలిపి యూనిట్ ఏర్పాటవుతాయన్నారు. నెక్స్ట్ ఆర్బిట్ వెంచర్స్ ద్వారా సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేష¯న్ యూనిట్, కాకినాడ వద్ద పెట్రో కెమికల్ యూనిట్ అంటూ హడావుడి చేశారు. టైటాన్ ఏవియేషన్ విమానాల తయారీ, స్విట్జర్లాండ్‌కి చెందిన ఏరో స్పేస్ వెంచర్స్ రూ.10 వేల కోట్ల పెట్టుబడి, ఎయిర్ బస్, మైక్రోసాఫ్ట్, బ్లాక్ చైన్ టెక్నాలజీకి విశాఖ కేరాఫ్ అన్నారు. వీటిలో ఏ ఒక్కటీ ఏపీకి రాలేదు. చంద్రబాబు హయాంలో బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ నాశనమైంది’అని కాకాణి గోవర్దన్ రెడ్డి ఎద్దేవా చేశారు.


