పవన్ 9 జెడ్పీ పీఠాలు అడిగితే ఇంకా ఎటూ తేల్చని చంద్రబాబు
జెడ్పీటీసీ, ఎంపీటీసీల్లో 30 శాతం కోరితే ఇచ్చినవి తీసుకోవాలని ఒత్తిడి
బాబు చెప్పినట్లు తలాడిస్తున్న పవన్ కళ్యాణ్
పొత్తు పేరుతో అవమానిస్తున్నారని జనసేన శ్రేణుల ఆందోళన
అరకొరగా ఇచ్చిన చోటా ఓడించేస్తున్నారని ఆవేదన
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల కేటాయింపులో కూటమి భాగస్వామి అయిన తమ పార్టీతో చంద్రబాబు ఆటలాడుకుంటున్నారని జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి. తమ పార్టీకి రావాల్సిన వాటా సీట్లు ఇవ్వకుండా మున్సిపల్ ఎన్నికల్లో తొండాట ఆడిన చంద్రబాబు.. జెడ్పీ ఛైర్‌పర్సన్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ పదవుల విషయంలోనూ అదే ఆట ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు చెప్పినట్లే తలూపుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీల సీట్ల కోసం టీడీపీ ముందు దేబిరింపు ఎందుకని మండిపడుతున్నాయి.
మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన సీట్లు తీసుకుని సర్దుకున్నట్టే, పరిషత్ ఎన్నికల్లోనూ తలవంచక తప్పడం లేదని రగిలిపోతున్నాయి. తమ అధినేత పెట్టిన ప్రతిపాదనపై నిలబడక పోవడం వల్లే చంద్రబాబు ఆడుకుంటున్నారని వాపోతున్నాయి. ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల పంపకాన్ని జిల్లా స్థాయిలో సర్దుబాటు చేసుకోవాలని చంద్రబాబు చెప్పడం, పవన్ అందుకు అంగీకరించడం ఏమిటని మండిపడుతున్నాయి. రాష్ట్ర స్థాయిలో తేల్చాల్సిన 28 జెడ్పీ ఛైర్‌పర్సన్ పీఠాల పంపకంలోనూ అధినేత వంగిపోవడం ఏమాత్రం సరికాదని జనసేన పార్టీ శ్రేణులు తప్పు పడుతున్నాయి.
జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీల్లోనూ అంతే
రాష్ట్ర వ్యాప్తంగా 659 జెడ్పీటీసీ, 9,829 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో 30 శాతం అంటే దాదాపు 200 జెడ్పీటీసీ స్థానాలు తమకు కావాలని పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు. అన్నిస్తే తమ కేడర్ తిరగబడుతుందని చంద్రబాబు తేల్చి చెప్పినట్లు సమాచారం. స్థానిక బలాన్ని బట్టే పంపకం ఉంటుందని, ఎక్కడికక్కడ స్థానికంగానే తేల్చుకోవాలని చెప్పడం ద్వారా జనసేన పవన్ కళ్యాణ్ ప్రతిపాదనను తిరస్కరించారు.పీఠం ఎవరిదో తెలియకుండానే కుమ్ములాట పశ్చిమ గోదావరి జెడ్పీ పీఠాన్ని జనసేనకే ఇవ్వాలని ఆ పార్టీ పట్టుబడుతోంది.
జనసేన తరపున జెడ్పీ ఛైర్మన్ పీఠాన్ని ఆశిస్తున్న పీవీఎల్ నరసింహరాజు ఉండి జెడ్పీటీసీ స్థానం నుంచి నామినేషన్ వేశారు. కానీ, అదే ఉండి స్థానం నుంచి జెడ్పీ ఛైర్మన్ పీఠం ఆశిస్తున్న పొత్తూరి రామరాజును టీడీపీ పోటీకి దింపింది. ఇలా జనసేనకు పశ్చిమ గోదావరిలో చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోంది. గణపవరంలోనూ రెండు పార్టీలు ముఖాముఖి తలపడుతున్నాయి. కాకినాడ జెడ్పీ పీఠంపైనా టీడీపీ, జనసేన మధ్య హోరాహోరీ నడుస్తోంది. ఏలూరు కార్పొరేషన్ జనసేనకు ఇచ్చినందున జెడ్పీ పీఠం తమదేనని టీడీపీ వాదిస్తోంది.
మున్సిపల్‌లోనూ ఇదే తంతు
మున్సిపల్ ఎన్నికల్లో 40.1 శాతం పదవులు కావాలని జనసేన డిమాండ్ చేసింది. ఆరు మేయర్ పీఠాలు సహా 2,091 పదవులు కోరింది. చివరికి నాలుగు కార్పొరేషన్లు, 21 మున్సిపాలిటీలతో సరిపెట్టుకుంది. ఇప్పుడు పరిషత్‌లలోనూ అదే జరుగుతోందని జన సైనికులు ఆవేదన చెందుతున్నారు. 2024లో త్యాగం చేశాం.. ఈసారి అలా కుదరదని పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించినా, సర్దుబాటు లొంగుబాటుగా మారడంపై కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చర్చల పేరుతో అధినాయకత్వం కాలయాపన చేస్తుంటే, క్షేత్ర స్థాయిలో తాము బలవుతున్నామని జన సైనికులు మండిపడుతున్నారు.
జనసేన నేతలపై టీడీపీ దాడుల ప్రస్తావనే లేకుండా సీట్ల చర్చలేంటని నిలదీస్తున్నారు. నెల్లూరు కార్పొరేషన్ ఆరో డివిజన్‌లో జనసేన అభ్యర్థిని చిత్తుగా ఓడించాలని.. ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రాకూడదని మంత్రి నారాయణ టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌లో దిశా నిర్దేశం చేసిన ఆడియో వైరల్‌గా మారింది. ఓ పక్క పొత్తు ధర్మం అంటూనే మరోపక్క ఓడించాలంటూ మంత్రులే పిలుపు ఇవ్వడం ఏమిటని జనసేన శ్రేణులు భగ్గుమంటున్నాయి. చంద్రబాబు జనసేనను చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన చెందుతున్నాయి. జనసేన నాయకులు టికెట్ల కోసం టీడీపీ ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ తిరగాల్సిన దుస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ విదిల్చిన సీట్లతో సర్దుకుపోవడం ఇంకెన్నాళ్లని ప్రశ్నిస్తున్నారు.
మూడు జెడ్పీలేనా?
28 జెడ్పీ ఛైర్‌పర్సన్ పీఠాల్లో తొమ్మిది కావాలని జనసేన కోరినట్లు తెలిసింది. ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర, తిరుపతి, అ న్నమయ్య జిల్లా పరిషత్‌లు కావాలని ప్రతిపాదించింది. అయితే చంద్రబాబు శిబిరం మొదట మూడు ఇస్తామని చెప్పి, బేరసారాల తర్వాత ఐదుకు వచ్చినట్లు తెలిసింది. పవన్ మళ్లీ గట్టిగా అడిగితే మరొకటి పెంచవచ్చని సమాచారం.
మొత్తంగా ఆరు జెడ్పీ పీఠాలు మాత్రమే ఇచ్చేందుకు టీడీపీ సిద్ధమవుతున్నట్లు తెలిసింది. దాన్ని కూడా ఇంకా ఖరారు చేయలేదు. జెడ్పీ ఛైర్‌పర్సన్ ఎన్నిక పరోక్షంగా (జెడ్పీటీసీ సభ్యులు ఎన్నుకుంటారు) జరుగుతుంది కాబట్టి ఫలితాల తర్వాత చూద్దామని చంద్రబాబు దాటవేస్తున్నట్లు సమాచారం. కాకినాడ, అనకాపల్లి, ఉమ్మడి పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాలు ఇచ్చే అవకాశం ఉందని టీడీపీ లీకులు ఇచ్చింది. బీజేపీకి ఒక్కటి కూడా ఇచ్చే అవకాశం లేదని సమాచారం.


