తిరుపతి: చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలని వైఎస్సార్‌సీపీ నేత, ప్రభుత్వ మాజీ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మండిపడ్డారు. చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీకి చెందిన 142 ఎంపీటీసీ నామినేషన్లు తిరస్కరించారని తెలిపారు. 40 మందికి పైగా వైఎస్సార్‌సీపీ నాయకులను నామినేషన్లు సమయంలో తీవ్రంగా గాయపరిచారని అన్నారు.
తిరుపతిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఇదేనా ప్రజాస్వామ్యం? గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ఇదేనా? నామినేషన్లు వేసిన అభ్యర్థులను భయపెట్టారు. అధికారులను అడ్డుపెట్టుకుని నామినేషన్లను తిరస్కరించారు. రేపు అప్పీళ్లకు వెళ్తాం. ఆ తర్వాత పోరాటం చేస్తాం. కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపై పోరాటం చేస్తాం’’ అని తెలిపారు.
వైఎస్సార్‌సీపీ చంద్రగిరి నియోజకవర్గం ఇన్‌చార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘చంద్రగిరిలో ఎమ్మెల్యే గూండారాజ్యం చేస్తున్నారు. తమిళనాడు గూండాలను తీసుకువచ్చి 1,200 మందిని మోహరించి నామినేషన్లను అడ్డుకున్నారు. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేసి, ఎన్నికల నామినేషన‍్లను స్వీకరించారు. 96 స్థానాల్లో 50కు పైగా ఏకగ్రీవం చేసుకున్నారు.
చంద్రగిరి, తిరుపతి రూరల్, పాకాలలో నామినేషన్లు తప్పించి ఏకగ్రీవం చేసుకున్నారు. చంద్రగిరి నుంచి ప్రజా పోరాటం మొదలవుతుంది. ప్రజాస్వామ్యం కాపాడండి, స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఈ సంస్కృతి మంచిది కాదు. డిక్లరేషన్ ఫామ్‌లు ఎత్తుకుపోయారు. నామినేషన్ ఫామ్‌లు స్క్రూటినీలో తప్పించారు’’ అని తెలిపారు.


