సాక్షి, అనంతపురం: ఏపీలో టీడీపీ కూటమి పాలనలో స్థానిక సంస్థల ఎన్నికలు అభాసుపాలు అయ్యాయని ఆరోపించారు మాజీ మంత్రి శైలజానాథ్. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయని చోట్ల నైతిక బాధ్యత పోలీసులదా లేక ఎస్ఈసీదా అని ప్రశ్నించారు. నామినేషన్ కేంద్రాలను టీడీపీ నేతలు ఆక్రమించారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి శైలజానాథ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా.. నిష్పక్షపాతంగా జరిగాయి. అప్పట్లో స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌గా ఉన్నది చంద్రబాబు తాబేదార్ నిమ్మగడ్డ రమేష్. అయినప్పటికీ ఎన్నికలను ఎదుర్కొని గెలిచిన సత్తా వైఎస్సార్‌సీపీదే. టీడీపీ కూటమి పాలనలో స్థానిక సంస్థల ఎన్నికలు అభాసుపాలు అయ్యాయి. నామినేషన్ కేంద్రాలను టీడీపీ నేతలు ఆక్రమించారు. ఆడవారు అని కూడా చూడకుండా టీడీపీ గూండాలు, పోలీసులు దాడులు చేస్తున్నారు.
పుట్లూరు, ఎలనూరు మండలాల్లో నామినేషన్లు వేయడానికే చాలా కష్టపడ్డాం. మా వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని నామినేషన్ వేయనీయకుండా పీఎస్‌లో కూర్చోబెట్టారు. నామినేషన్ వేయకుండా ఘర్షణ క్రియేట్ చేసి కేసు పెట్టారు. పై నుంచి ఫోన్ రాగానే నామినేషన్లు తిరస్కరిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లను టీడీపీ నేతలతో పాటు పోలీసులు కూడా అడ్డుకోవడం దుర్మార్గం. శింగనమల నియోజకవర్గం తిమ్మంపల్లి గ్రామ వైఎస్సార్ ఎమ్పీటీసీ అభ్యర్థిని నామినేషన్ వేయకుండా నిర్భందించాల్సిన అవసరం పోలీసులకు ఏంటి?. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయని చోట్ల నైతిక బాధ్యత ఎవరిది’ అని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: శకునిమామ ‘స్థానిక’ సినిమా!


