తొండవాడ ముక్కోటి ఉత్సవాలు ప్రారంభం | Tondavada Rudrapadalu Festival Begins | Sakshi
Sakshi News home page

తొండవాడ ముక్కోటి ఉత్సవాలు ప్రారంభం

Oct 26 2026 1:32 AM | Updated on Oct 26 2026 1:32 AM

Tondavada Rudrapadalu Festival Begins

ముక్కంటికి వైభవంగా అన్నాభిషేకం అంకురార్పణతో ప్రారంభమైన తొండవాడ రుద్రపాదాల ముక్కోటి ఉత్సవాలు

తొండవాడ: చంద్రగిరి మండలం తొండవాడలోని ముక్కోటి క్షేత్రంలో రుద్రపాదాల ముక్కోటి ఉత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ధర్మకర్త మొగిలి ఇందుమౌళి రెడ్డి ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించనున్న ఈ ఉత్సవాలకు అంకురార్పణతో శ్రీకారం చుట్టారు.

ఉత్సవాల ప్రారంభ సూచికగా శనివారం ఉదయం మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల మధ్య అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం శ్రీ మహాగణపతి హోమం నిర్వహించి, శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వినాయక స్వామివారి ఉత్సవమూర్తులను ఊరేగించారు.

సాయంత్రం శ్రీ వళ్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఊరేగింపు భక్తిశ్రద్ధలతో సాగింది. అంతకుముందు శ్రీ ఆనందవల్లి అమ్మవారికి, శ్రీ అగస్త్యేశ్వర స్వామివారికి విశేషంగా అన్నాభిషేకం నిర్వహించారు. స్వామివార్లను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పలువురు  శివ భక్తులు పాల్గొన్నారు.

ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు
రుద్రపాదాల ముక్కోటి ఉత్సవాలను పురస్కరించుకుని వివిధ ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. దుబాయ్‌కు చెందిన కౌశిక్ శ్రీపతి పండితారాధ్యులు, కార్తీక్ శ్రీపతి పండితారాధ్యులు లలిత సంగీత కార్యక్రమంతో భక్తులను అలరించారు. శ్రీ విభీషణ శర్మ శ్రీ అగస్త్యేశ్వర స్వామివారి వైభవంపై ధార్మికోపన్యాసం చేశారు.
మూడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.

భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ ధర్మకర్త మొగిలి ఇందుమౌళి రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement