
సాక్షి, ప్రకాశం జిల్లా: అటవీ శాఖ సిబ్బందిపై టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి దాడి చేసిన కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుల జాబితాను పోలీసులు విడుదల చేశారు. అయితే అందులో శ్రీశైలం జనసేన ఇంఛార్జి అశోక్ రౌత్‌ను A1 నిందితుడిగా చేర్చడం చర్చనీయాంశమైంది.
ఆగస్టు 19 మంగళవారం.. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం సమీపంలో అటవీ శాఖ సిబ్బందిని కిడ్నాప్ చేసి మరీ బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, ఆయన అనుచరులు దాడి చేశారు. తమ పార్టీ అధికారంలో ఉన్నా.. ఫారెస్ట్ సిబ్బంది తమకు అనుకూలంగా పని చేయడం లేదని దూషించారు. పైగా సీసీకెమెరాల్లోనూ సిబ్బందిపై ఎమ్మెల్యే బుడ్డా దాడి చేసినట్లు స్పష్టంగా కనిపించింది. అయితే.. అనూహ్యంగా.. జనసేన నేత పేరును ఈ కేసులో ఏ1గా చేర్చి, దాడి చేసిన ఎమ్మెల్యే బుడ్డాను మాత్రం A2 గా చేర్చారు. పైగా ఇద్దరి పైనా బెయిలబుల్ కేసులే పెట్టారు.
ఫారెస్ట్ అధికారులు చెప్పింది ఏంటంటే.. శ్రీశైలం శిఖరం చెక్‌పోస్ట్ దగ్గర ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్, ఆయన అనుచరులు అటవీశాఖ సిబ్బందిని అడ్డుకుని వారిని దుర్భాషలాడడం ప్రారంభించారు. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఉద్యోగులు తమకు అనుకూలంగా పనిచేయడం లేదని దూషించారు. అటవీ శాఖ వాహనంలోకి బలవంతంగా ఎక్కించి శ్రీశైలం అడవుల వైపు అర్ధరాత్రి తీసుకెళ్లారు. పైగా ఎమ్మెల్యే తన మనుషులను సిబ్బందిపై శారీరకంగా దాడి చేయమని ఆదేశించాడు. అంతేకాదు.. నలుగురు సిబ్బందిని గెస్ట్ హౌస్‌లో బంధించి వేధించాడు.
ఇదీ చదవండి: అరాచకాలకు కేరాఫ్ ‘బుడ్డా’
ఈ సంఘటనపై అటవీ శాఖ సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. తరువాత శ్రీశైలం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాడిని నిరసిస్తూ చెంచు, ఇతర గిరిజన సంఘాల సభ్యులు సున్నిపెంట, శ్రీశైలం, దోర్నాల, యర్రగొండపాలెంలో నిరసన చేపట్టారు. ఉద్యోగ సంఘాలు ఈ దాడికి తీవ్రంగా ఖండించాయి. చివరకు అటవీశాఖ సిబ్బంది,అసోషియేషన్ నాయకులు ఉపముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్‌కు కలిసి ఫిర్యాదు చేశారు.

పవన్ ఆదేశాల మేరకు.. ఎట్టకేలకు పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో జనసేన ఇంఛార్జి అశోక్ రౌత్ , ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి లపై 115(2),127(2),351(2),132 r/w ,3(5) BNS act సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే టీడీపీ ఎమ్మెల్యేని పక్కనపెట్టి అటవీ శాఖ మంత్రిగా ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీకి చెందిన వ్యక్తికే కేసును అంట గట్టడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. ”ఇదేమీ బానిసత్వం రా దేవుడా.. ఇన్నాళ్లూ జెండాలే అనుకుంటే.. ఇప్పుడు వాళ్ల కేసులు కూడా మోయాలా..?” అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.