అమరావతి పార్టనర్‌.. ఈశ్వరన్‌కు జైలు శిక్ష | Jail sentence for Chandrababu Partner Iswaran | Sakshi
Sakshi News home page

అమరావతి పార్టనర్‌.. ఈశ్వరన్‌కు జైలు శిక్ష

Oct 4 2024 4:13 AM | Updated on Oct 4 2024 4:13 AM

Jail sentence for Chandrababu Partner Iswaran

సింగపూర్‌ రవాణా మంత్రిగా ఉండగా అవినీతికి పాల్పడినట్లు నిర్ధారణ

అమరావతిలో స్టార్టప్‌ ఏరియా పేరిట రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీలు

నాడు ఏకంగా సింగపూర్‌ ప్రభుత్వంతో ఒప్పందం అంటూ బురిడీ  

సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి పేరిట జరిగిన భూ దోపిడీలో కీలక పాత్రధారిగా వ్యవహరించిన సింగపూర్‌ మాజీ మంత్రి ఎస్‌.ఈశ్వరన్‌ స్వదేశంలో అవినీతికి పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో ఏడాది జైలు శిక్ష విధిస్తూ అక్కడి న్యాయస్థానం గురువారం తీర్పునిచ్చింది. రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఫార్ములా వన్‌ రేసింగ్‌ కాం­ట్రాక్టులో ఈశ్వరన్‌ అక్రమాలకు తెగబడినట్లు సింగపూర్‌ అవినీతి నిరోధక విభాగం ‘కరప్ట్‌ ప్రాక్టీసెస్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో’ (సీపీఐబీ) విచారణలో నిగ్గు తేలింది. ఈశ్వరన్‌ అవినీతికి పాల్పడినట్టు న్యాయ విచారణలో కూడా నిర్ధారణ కావడంతో ఏడాది జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తాజాగా తీర్పునిచ్చింది.  

జూనియర్‌ అధికారి నుంచి మంత్రిగా.. 
2008లో సింగపూర్‌ వాణిజ్య, పరిశ్రమల శాఖలో జూనియర్‌ ఆఫీసర్‌గా ఉన్న ఈశ్వరన్‌ అనతి కాలంలో ఉన్నత స్థానానికి ఎగబాకారు. మొదట పరిశ్రమల శాఖ మంత్రిగా, అనంతరం రవాణా శాఖ మంత్రిగా కీలక పదవులు పొందారు. ఫార్ములా వన్‌ కార్‌ రేసింగ్‌ ముసుగులో సింగపూర్‌ గ్రాండ్‌ ప్రిక్స్‌ నిర్వాహకుడు ఓంగ్‌ బెంగ్‌ సంగ్‌ నుంచి ఈశ్వరన్‌ భారీగా ముడుపులు తీసుకున్నట్లు అవినీతి నిరోధక విభాగం నిగ్గు తేల్చింది. సింగపూర్‌ గ్రాండ్‌ ప్రిక్స్‌ – సింగపూర్‌ పర్యాటక విభాగాల మధ్య కాంట్రాక్టు రూపంలో ఆయన ముడుపులు తీసుకున్నారు. 

సింగపూర్‌ గ్రాండ్‌ ప్రిక్స్‌ రేసింగ్, ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లు, మ్యూజికల్‌ షోస్, బ్రిటన్‌లో హ్యారీ పోటర్‌ షోలకు భారీ సంఖ్యలో టికెట్లు యథేచ్ఛగా విక్రయించారని వెల్లడైంది. సింగపూర్‌ గ్రాండ్‌ ప్రిక్స్‌ నిర్వాహకుడు ఓంగ్‌ బెంగ్‌ సంగ్‌తోపాటు ఈశ్వరన్‌ను గత ఏడాది జూలై 12న సీపీఐబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. దీంతో పదవికి రాజీనామా చేసిన ఈశ్వరన్‌ అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. 

సీపీఐబీ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి ఈశ్వరన్‌ అవినీతిని నిగ్గు తేలుస్తూ 27 అభియోగాలతో చార్జ్‌ïÙట్లు దాఖలు చేసింది. మంత్రి హోదాలో భారీ ముడుపులు తీసుకున్నట్లు 24 అభియోగాలు, అవినీతికి కేంద్ర బిందువుగా ఉన్నట్లు రెండు అభియోగాలు, న్యాయ విచారణకు అడ్డంకులు కల్పించినట్లు ఒక అభియోగం నమోదైంది. 

బాబు భూ దోపిడీలో పార్టనర్‌ 
2014–19 మధ్య టీడీపీ హయాంలో చంద్రబాబు బృందం రాజధాని పేరిట యథేచ్ఛగా సాగించిన భూ దోపిడీలో ఈశ్వరన్‌ ప్రధాన భూమిక పోషించారు. ఏపీ రాజధాని నిర్మాణం కోసం ఏకంగా సింగపూర్‌ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని భ్రమింపజేశారు. అమరావతి మాస్టర్‌ ప్లాన్‌లో అత్యంత కీలకమైన స్టార్టప్‌ ఏరియా అభివృద్ధి ప్రాజెక్ట్‌ను చంద్రబాబు, ఈశ్వరన్‌ ద్వయం కుట్రపూరితంగా తెరపైకి తెచ్చింది. 

ఒప్పందం సమయంలో సింగపూర్‌కు చెందిన ప్రైవేట్‌ కంపెనీ అసెందాస్‌–సిన్‌బ్రిడ్జ్‌–సెంబ్‌ కార్ప్‌ కన్సార్షియంను తెరపైకి తెచ్చారు. స్విస్‌ చాలెంజ్‌ విధానం ముసుగులో ఇతర సంస్థలేవీ పోటీ పడకుండా ఏకపక్షంగా 2017 మే 2న కట్టబెట్టేశారు. దీనికి నాటి చంద్రబాబు కేబినెట్‌ రాజముద్ర వేసింది. ఆ ఒప్పంద పత్రాలపై ఈశ్వరన్‌ సంతకాలు చేశారు. అప్పుడు ఆయన సింగపూర్‌ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు. 

ఏకంగా సింగపూర్‌ ప్రభుత్వంతోనే ఒప్పందం చేసుకున్నట్టు చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా హడావిడి చేసింది. స్టార్టప్‌ ఏరియా వాటాల కేటాయింపులోనూ చంద్రబాబు గోల్‌మాల్‌ చేశారు. స్టార్టప్‌ ఏరియా అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.5,721.9 కోట్లు వెచ్చించే రాష్ట్ర ప్రభుత్వానికి కేవలం 42 శాతం వాటా కల్పించారు. రూ.306.4 కోట్లు మాత్రమే వెచ్చించే అసెందాస్‌–సిన్‌బ్రిడ్జ్‌–సెంబ్‌ కార్ప్‌ కన్సార్షియానికి ఏకంగా 58 శాతం వాటా కట్టబెట్టేశారు. 

రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్‌గా అభివృద్ధి చేసే స్టార్టప్‌ ఏరియా స్థూల టర్నోవర్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి మొదట విడతలో 5 శాతం, రెండో విడతలో 7.5 శాతం, మూడో విడతలో 12 శాతం వాటా మాత్రమే కేటాయించారు. స్టార్టప్‌ ఏరియా టర్నోవర్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి సగటున కేవలం 8.7 శాతం వాటా దక్కనుండగా అసెందాస్‌–సిన్‌బ్రిడ్జ్‌–సెంబ్‌ కార్ప్‌ కన్సార్షియానికి మాత్రం 91.3 శాతం వాటా దక్కుతుందన్నది స్పష్టమైంది. 

ఆ కన్సార్షియం ముసుగులో చంద్రబాబు బినామీ పెట్టుబడులు పెట్టారు. అందుకు ఈశ్వరన్‌ సహకరించారు. తద్వారా స్టార్టప్‌ ఏరియాలో రూ.లక్షల కోట్ల విలువైన రియల్‌ ఎస్టేట్‌ సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలని చంద్రబాబు పథకం వేశారు. స్టార్టప్‌ ఏరియాను ఆనుకుని ఉన్న 1,400 ఎకరాల అసైన్డ్‌ భూములను చంద్రబాబు బృందం బినామీ పేర్లతో కొల్లగొట్టింది. 

ప్రతిపాదిత ఇన్నర్‌రింగ్‌ రోడ్డును ఆనుకుని భారీగా భూములు కొనుగోలు చేసింది. సింగపూర్‌లో చంద్రబాబు బినామీల పేరిట ఉన్న స్టార్‌ హోటళ్లు, ఇతర రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడులలోనూ ఈశ్వరన్‌ కీలక పాత్ర పోషించినట్లు అధికారిక, పారిశ్రామిక వర్గాలు చెబుతుండటం గమనార్హం.   

Advertisement
 
Advertisement
Advertisement