నేటి నుంచి ‘జగనన్నే మా భవిష్యత్తు’

Jagananna Amma bhavishyattu programme from friday - Sakshi

175 నియోజక వర్గాల్లో 14 రోజులపాటు నిర్వహణ: సజ్జల

1.60 కోట్ల కుటుంబాలను కలుసుకోనున్న గృహ సారథులు, కన్వీనర్లు 

నాడు – నేడు పాలనలో వ్యత్యాసాన్ని వివరిస్తూ ఇంటింటికీ 

ఐదు ప్రశ్నలతో వివరాలు సేకరించి ప్రజా మద్దతు పుస్తకంలో నమోదు

కార్యక్రమం పూర్తయ్యాక ప్రజా సర్వే ఫలితాలను వెల్లడిస్తాం

దేశంలో అధికార పార్టీ ఈ స్థాయిలో ప్రజలతో మమేకమై సర్వే చేయడం ఇదే తొలిసారి

ప్రభుత్వ సేవలను అందిస్తున్న వలంటీర్లు పాల్గొంటే తప్పేమిటి?

వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 1.60 కోట్ల కుటుంబాలను నేరుగా కలుసుకునే ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమానికి శుక్రవారం నుంచి వైఎస్సార్‌సీపీ శ్రీకారం చుడుతున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ‘మా నమ్మకం నువ్వే జగన్‌’  అన్నది ప్రజల నుంచి వచ్చిన నినాదమన్నారు. సీఎం జగన్‌ పలు సభల్లో చెప్పినట్లుగా గత నాలుగేళ్లుగా ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనం చేకూరితే మరోమారు ఆశీర్వదించాలని ఆయా కుటుంబాలను ఈ కార్యక్రమం ద్వారా కోరతామన్నారు.

అధికారంలో ఉన్న పార్టీ పదాతిదళం ప్రజలతో మమేకమై భారీ ఎత్తున ప్రజా సర్వే నిర్వహించడం దేశంలో ఇదే ప్రథమమని వెల్లడించారు. 175 నియోజక వర్గాలలో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం ఈనెల 20 వరకూ కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమం పూర్తయ్యాక ప్రజా సర్వే ఫలితాలను వెల్లడిస్తామన్నారు. ప్రభుత్వంపై బురద జల్లుతున్న చంద్రబాబు, ఎల్లో మీడియా ఇతర ప్రతిపక్షాలకు గుణపాఠం చెప్పేలా ప్రజా సర్వే ఫలితాలు ఉంటాయని విశ్వాసం వ్యక్తం చేశారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు.

14 రోజుల్లో 1.60 కోట్ల ఇళ్ల సందర్శన
జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్‌ సైనికులుగా పార్టీ పదాతిదళం ప్రతి ఇంటికీ వెళ్తుంది. దాదాపు 7 లక్షల మంది గృహ సారథులు, సచివాలయాల కన్వీనర్లు 1.60 కోట్ల ఇళ్లను 14 రోజుల్లో సందర్శిస్తారు. ఐదుకోట్ల మంది ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుంటారు. ‘మమ్మల్ని జగనన్న పంపారు. మీతో మాట్లాడి సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వ పనితీరుపై అభిప్రాయాల్ని తెలుసుకునేందుకు వచ్చాం’ అని చెబుతారు.

పదాతిదళం కలుసుకునే వారిలో అన్ని కులాలు, మతాలకు చెందిన వారితోపాటు రాజకీయంగా భిన్నాభిప్రాయాలు కలిగిన కుటుంబాలు కూడా ఉంటాయి. ఒక ఇంటికి వెళ్లినప్పుడు ‘మీకు ప్రభుత్వం ద్వారా ఏవి అందాయి? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏం గమనించారు?’ అని అడిగే సాహసోపేతమైన కార్యక్రమం ఇది. టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలు ప్రజలను జలగల్లా పీడించి లంచాలు వసూలు చేశాయి. ప్రభుత్వ సేవలను ప్రజల ఇళ్ల వద్దే అందించేందుకు సీఎం జగన్‌ వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశారు. వలంటీర్లు జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో పాల్గొంటే తప్పేమిటి? 

పేదల సంక్షేమమే ధ్యేయంగా
దేశంలో ఎక్కడా లేనివిధంగా నాలుగేళ్లు కూడా గడవక ముందే సంక్షేమ పథకాల ద్వారా పేదల ఖాతాల్లో రూ.2 లక్షల కోట్లను సీఎం జగన్‌ జమ చేశారు. ఆర్థిక ఇబ్బందులున్నా పేదల సంక్షేమం కోసమే తపిస్తున్నారు. ముందుగానే సంక్షేమ క్యాలెండర్‌ను ప్రకటించి అమలు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణ పేదలకు చేయూత అందించి పైకి తీసుకురావడం, ప్రధానంగా మహిళలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేయడంలో నిర్మాణాత్మకంగా వ్యవహరించారు.

సంతృప్తి స్థాయిని తెలుసుంటూ..
గృహ సారథులు ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల సంతృప్తి స్థాయిని తెలుసుకుంటారు. ఐదు ప్రశ్నలకు వివరాలు రాబట్టి ‘ప్రజా మద్దతు పుస్తకం’లో నమోదు చేస్తారు. సీఎం జగన్‌ నాయకత్వం ఆవశ్యకతను వివరిస్తారు. ఇతర పార్టీల మాదిరిగా టెలిఫోన్‌ సర్వేలతో చంకలు గుద్దుకునే ధోరణి మాది కాదు.

ఐదు ప్రశ్నలతో ఇంటింటికీ గృహ సారథులు
గత 46 నెలల్లో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమాభివృద్ధి పథకాలను ప్రతి ఇంటికీ వెళ్లి వివరిస్తారు.
 గత సర్కార్‌కు, ఈ ప్రభుత్వ పాలనకు వ్యత్యాసాన్ని తెలియచేసేలా కరపత్రాలు అందిస్తారు.
ఐదు ప్రశ్నలకు అభిప్రాయాలను సేకరించి  ప్రజా మద్దతు పుస్తకంలో నమోదు చేసి రసీదు అందచేస్తారు. 
 ప్రభుత్వానికి మద్దతు తెలిపిన వారిని 82960–82960 నెంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇవ్వాలని కోరుతారు. ఆ తర్వాత నిమిషం లోపే సంబంధిత కుటుంబానికి ఐవీఆర్‌ఎస్‌ కాల్‌ ద్వారా సీఎం వైఎస్‌ జగన్‌ కృతజజ్ఞతలు తెలియచేస్తారు.
 ప్రభుత్వానికి మద్దతు తెలిపిన వారి ఇంటి తలుపు (డోర్‌), మొబైల్‌ ఫోన్‌కు వారి అనుమతితో సీఎం జగన్‌ ఫోటోను అతికిస్తారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top