అధికారిక సమావేశంలో ఉన్నతాధికారులతో పాటు కూర్చున్న ప్రైవేటు సంస్థ ప్రతినిధి
విద్యుత్ సంస్థలపై అజమాయిషీ చెలాయిస్తున్న ఓ సంస్థ
కీలక నేత తాలూకా అంటూ అధికారులను హడలెత్తిస్తున్న వైనం
సమీక్షల్లో నేరుగా పాల్గొంటూ టెండర్ పత్రాలు తయారీ
ఎవరికి దక్కాలో వారికి అనుకూలంగా నిబంధనలు తయారు
రూ.50 లక్షల కాంట్రాక్టు నుంచి రూ.100 కోట్లపైగా ప్రతిదీ దిశానిర్దేశం
సాక్షి, అమరావతి: ఉద్యోగుల బదిలీల్లో కొందరు, ఉన్నత పదవుల నియామకాల్లో మరికొందరు అందినంత దోపిడీ.. కాంట్రాక్టుల్లో ఇంకొందరు భారీగా కమీషన్లు వసూలు...! కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర్నుంచి విద్యుత్ సంస్థలను దోచుకుంటున్న తీరు ఇది...! ఈ దందాలో అనేకమంది అనేక విధాల ప్రయత్నాలు... వీరిలో రాజకీయ నేతలు, ఉన్నతాధికారులతో పాటు ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు కూడా ఉన్నారు..! తాజాగా ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లలో ఓ ప్రైవేటు సంస్థ ప్రతినిధి అన్నీ తానే అయి ఉన్నతాధికారులను శాసిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏకంగా అధికారిక సమీక్షల్లో నేరుగా పాల్గొంటూ, ప్రభుత్వంలోని కీలక నేత తాలూకా అని చెబుతూ హడలెత్తిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
పని కాకుంటే బదిలీనే బహుమానం...
ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్)లో ఇటీవల జరిగిన ఓ అధికారిక సమీక్షలో ఉన్నతాధికారులతో పాటు ఓ వ్యక్తి దర్జాగా కూర్చున్నారు. ఆయనను చూసిన ఇతర అధికారులు, సిబ్బంది ఎవరో ఉన్నతాధికారి అని భ్రమపడ్డారు. కానీ, ఆయన ప్రైవేటు కన్సల్టెంట్ సంస్థ ప్రతినిధి. సీఎండీ కార్యాలయం నుంచి నేరుగా వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనే స్థాయిలో విద్యుత్ సంస్థల్లో పవర్ పెంచుకున్నారు ఆ వ్యక్తి. ఇందుకోసం రాష్ట్రంలోని ఓ మంత్రి పేరును వాడుకుంటున్నాడని చెబుతున్నారు. ప్రస్తుతం ఆ మంత్రి చెప్పిందే అన్ని శాఖల్లో జరుగుతోంది.
దీంతో ఆయన తాలూకా అని చెబుతున్న ప్రైవేటు వ్యక్తికి అధికారులు అంతే విలువ ఇస్తున్నారు. ఈ ఒక్క డిస్కంలోనే కాదు, మిగిలిన రెండు డిస్కంలలోనూ ఓ ప్రైవేట్ సంస్థ ప్రతినిధులే పెత్తనం చెలాయిస్తున్నారు. టెండర్లు తయారీ, ఒప్పంద పత్రాలను రూపొందించడం వంటివి ఈ సంస్థ చేతుల మీదుగానే జరుగుతోంది. దీనికి చెందిన ‘చౌదరి’ అనే వ్యక్తి వివిధ శాఖల్లో లాబీయింగ్ చేస్తూ పారిశ్రామికవేత్తలు, డిస్కంల ఉన్నతాధికారుల మధ్య వారధిగా వ్యవహరిస్తున్నారని సమాచారం. కొన్ని సందర్భాల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించేలా ఉన్నతాధికారులను ఒత్తిడి చేస్తున్నాడని విమర్శలు వినిపిస్తున్నాయి. తమకు అనుకూలంగా టెండర్లు విడుదల చేయించేందుకు యతి్నంచడం, అది జరగకపోతే బదిలీ చేయిస్తామని బెదిరించడం అతడికి పరిపాటిగా మారిందని డిస్కం వర్గాలు అంటున్నాయి.
ఆయన ఓ బ్యాంకు ఐటీ మాజీ ఉద్యోగి
గతంలో చౌదరి ఓ బ్యాంకు ఐటీ విభాగంలో పనిచేశాడని, అవినీతి ఆరోపణల వల్ల తొలగించారని సమాచారం. ప్రస్తుతం విద్యుత్‌తో పాటు అనేక శాఖల్లో పెత్తనం చెలాయిస్తున్నాడు. ప్రైవేటు సంస్థకు చెందిన చౌదరి తెలంగాణలో ఉంటూ, ఏపీ డిస్కంలపై అజమాయిషీ చేస్తున్నాడు. రూ.50 లక్షల కాంట్రాక్టు నుంచి రూ.100 కోట్లపైగా ప్రతిదీ ఆయన కనుసన్నల్లోనే జరుగుతోందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
విజిలెన్స్ వెన్నువిరిచి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ సంస్థల్లో అక్రమాలను, అవినీతిని పసిగట్టి చర్యలు తీసుకునే ట్రాన్స్‌కో విజిలెన్స్ విభాగాన్ని నిర్వీర్యం చేసింది. మొక్కుబడి విభాగంగా మార్చేసింది. ఇప్పటికీ ఆ శాఖకు రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారి లేరు. ఒకవేళ విజిలెన్స్ ఉండి ఉంటే... చౌదరి వ్యవహారంపై దృష్టిసారించి ఉండేవారనే వాదనలు వినిపిస్తున్నాయి.
అక్కడే అన్ని వ్యవహారాలు
కొందరు ప్రముఖులు, బడా బాబులతో హైదరాబాద్‌లో చౌదరి సమావేశమవుతాడని, అక్కడే వివిధ కంపెనీల ప్రతినిధులతో ఒప్పందాలపై చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. సదరన్ పవర్ డి్రస్టిబ్యూషన్ కంపెనీ ఇటీవల ఓ సంస్థతో చౌదరి నివాసంలోనే ఒప్పందం కుదుర్చుకుందని, ఆ టెండర్ పత్రాలనూ డిస్కం సిబ్బంది కాకుండా చౌదరి స్వయంగా రూపొందించాడనే ఆరోపణలున్నాయి. టెండర్ పత్రం పూర్తిగా ప్రైవేటు సంస్థకు అనుకూలంగా, ఇతర పోటీదారులు పాల్గొనే అవకాశం లేకుండా రూపొందించారని, దీనిలో కొందరు అధికారులు, చౌదరి బాగా నే లాభపడ్డారని సమాచారం. తాజాగా ఓ డిస్కంలో డిజాస్టర్ రికవరీ ప్రాజెక్టుకు టెండర్ విడుదలైంది. దానినీ చౌదరి వ్యక్తులే రూపొందించారని తెలిసింది. ఈ–ప్రొక్యూర్మెంట్ పోర్టల్‌లో పెట్టిన టెండర్ డాక్యుమెంట్ ఈ విషయాన్ని ధ్రువీకరిస్తోంది.


