సమీకృత సమాచారం.. సమస్యలన్నీ దూరం  | Sakshi
Sakshi News home page

సమీకృత సమాచారం.. సమస్యలన్నీ దూరం 

Published Sat, Jan 30 2021 4:59 AM

An integrated information center for the benefit of farmers - Sakshi

సాక్షి, అమరావతి: ఒక్క ఫోన్‌ కాల్‌.. వాట్సాప్‌లో చిన్న మెసేజ్‌.. అంతే.. క్షణాల్లో సమస్యలు, సందేహాలు తీరతాయి. వ్యవసాయ, దాని అనుబంధ రంగాల్లో సమస్యలు, సందేహాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమీకృత సమాచార కేంద్రం అద్భుత ఫలితాలనిస్తోంది. విజయవాడ కేంద్రంగా గతేడాది మేలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం క్షేత్రస్థాయిలో రైతులకు ఎంతో ఉపయోగపడుతోంది. క్లిష్ట పరిస్థితుల్లో పంటను కాపాడుకునే విషయంలో ఈ కేంద్రం ద్వారా శాస్త్రవేత్తలందించే సలహాలు, సూచనలు నిజంగా ఎంతో మేలుచేస్తున్నాయి. సమస్య తీవ్రతను బట్టి 24 గంటల్లోనే ఆయా ప్రాంతాలకు వెళ్లి ప్రయోగాత్మకంగా కూడా అవగాహన కల్పిస్తున్నారు. ఇక వైఎస్సార్‌ రైతు భరోసా, సున్నా వడ్డీ రుణాలు, పంటల బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఈ–క్రాప్, సాగునీరు, పంట కొనుగోళ్లు, మార్కెటింగ్‌ వంటి ఎన్నో సమస్యలపై వస్తున్న ఫోన్‌కాల్స్, వాట్సాప్‌ మెసేజ్‌లకు సంబంధిత శాఖల అధికారులు, నిపుణులు వెంటనే సమాధానమిస్తుండటంతో ఈ కేంద్రం అన్నదాతల మన్ననలందుకుంటోంది. 

రికార్డుస్థాయిలో సమస్యల పరిష్కారం 
వ్యవసాయశాఖకు అంతర్భాగంగా గత మే 30న ఏర్పాటైన ఈ కేంద్రంలో 67 మంది సిబ్బంది ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు నిర్విరామంగా సేవలందిస్తున్నారు. వ్యవసాయ, ఉద్యాన, మత్స్య, పశుసంవర్ధకశాఖలకు చెందిన విశేష అనుభవం కలిగిన ఆరుగురు శాస్త్రవేత్తలు రైతుల సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తున్నారు. ఈ కేంద్రానికి గతేడాది మే 30 నుంచి ఈ ఏడాది జనవరి 28వ తేదీ వరకు రోజుకు సగటున 600 నుంచి 700 చొప్పున ఫోన్‌ కాల్స్, మెసేజ్‌లు కలిపి 1,87,603 వచ్చాయి. వీటిలో 1,84,946 ఫోన్‌కాల్స్, 2,657 వాట్సాప్‌ మెసేజ్‌లు ఉన్నాయి. ఫోన్‌ కాల్స్, మెసేజ్‌లు కలిపి అత్యధికంగా డిసెంబర్‌లో 73,315 రాగా, అత్యల్పంగా మే/జూన్‌లో 7,316 వచ్చాయి. ఇక జూలైలో 20,033, ఆగస్టులో 9,914, సెప్టెంబర్‌లో 11,672, అక్టోబర్‌లో 16,136, నవంబర్‌లో 26,307, ఈనెలలో 28వ తేదీ (గురువారం) వరకు 22,910 కాల్స్, మెసేజ్‌లు వచ్చాయి. 

ఫోన్‌ చేసి చెప్పా అంతే.. 
మా గ్రామంలో రైతులందరికి వైఎస్సార్‌ రైతు భరోసా సొమ్ములు వచ్చాయి. నాకు మాత్రం పడలేదు. కాల్‌ సెంటర్‌కు ఫోన్‌చేసి చెప్పా. ఆధార్‌ లింక్‌ కాలేదని చెప్పి వాళ్లే ఇక్కడ అధికారులు, బ్యాంకు వాళ్లతో మాట్లాడి డబ్బులు పడేటట్టు చేశారు. గతనెలలో రూ.7,500 జమయ్యాయి. చాలా సంతోషంగా ఉంది. 
– చిరట్ల సూరిబాబు, సహపురం, పెదపూడి మండలం తూర్పు గోదావరి జిల్లా (ఫోన్‌: 9290384999) 

నారును కాపాడుకోగలిగా.. 
నేను ఎకరంలో ఉల్లి వేశా. విత్తనం వేసిన 25 రోజులకు దోమ పీల్చడంతో కొనలు ఎండిపోవడం మొదలైంది. కాల్‌ సెంటర్‌కు ఫోన్‌చేసి సమస్య చెప్పా. అక్కడున్న శాస్త్రవేత్తలు చెప్పిన సూచనలు పాటిస్తూ ఎసిఫేట్‌ 1.5 ఎం.ఎల్‌., ఫిప్రియోలిన్‌ 2 ఎం.ఎల్‌. పిచికారీ చేశా. దోమ చనిపోవడంతో నారు బతికింది. ప్రస్తుతం నారుమళ్లు పోసి నెలరోజులైంది. పంట బాగుంది.
– జనార్ధన్, మైనపురం, గుంతకల్లు, అనంతపురం జిల్లా (ఫోన్‌:  8464977324) 

90 శాతం పరిష్కరించగలిగాం 
సమీకృత సమాచార కేంద్రానికి మంచి స్పందన వస్తోంది. వచ్చిన ప్రతి కాల్‌ను అటెండ్‌ అవుతున్నాం. రైతులడిగే ప్రతి సమస్యను మా సిబ్బంది ఓపిగ్గా వినడమే కాదు వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. రోజూ వస్తున్న కాల్స్‌లో 90 శాతం సమస్యలకు పరిష్కార మార్గాలు చూపగలుగుతున్నాం. చాలా సంతోషంగా ఉంది.
– డాక్టర్‌ శైలజ, సమీకృత సమాచార కేంద్రం ఇన్‌చార్జి  

Advertisement
Advertisement