ఆధ్యాత్మిక క్షేత్రానికి పారిశ్రామిక శోభ

Industrial Charm To The Spiritual Realm With Initiative Of  CM YS Jagan - Sakshi

సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఆధ్యాత్మిక క్షేత్రంగా విలసిల్లుతున్న తిరుపతి జిల్లా పారిశ్రామిక కాంతులతో విరాజిల్లనుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో శ్రీకాళహస్తి, ఏర్పేడు మండలాల్లో కొత్త పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. శ్రీనివాసుడి మాతృమూర్తి వకుళమాత ఆలయం మహాసంప్రోక్షణ క్రతువులో పాల్గొనేందుకు గురువారం తిరుపతి జిల్లాకు వస్తున్న సీఎం జగన్‌ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 

బంగారు వకుళమాత ఆలయం 
తిరుపతి సమీపంలోని పేరూరు కొండపై 900 ఏళ్ల చరిత్ర కలిగిన వకుళమాత ఆలయం ఉంది. సుమారు 350 ఏళ్ల క్రితం మహమ్మదీయుల దండయాత్రల్లో దెబ్బతిన్న ఆలయం ధూపదీప నైవేద్యాలకు నోచుకోలేదు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చొరవ చూపి దీన్ని సీఎం జగన్‌ దృష్టికి తీసుకొచ్చి టీటీడీని ఒప్పించి జీర్ణోద్ధరణ పనులు ప్రారంభించారు. నిర్మాణ పనులు త్వరగా పూర్తయ్యేలా ప్రభుత్వపరంగా సీఎం పూర్తి సహకారం అందించారు. ఆలయానికి 83.41ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించి టీటీడీకి అప్పగించారు. వకుళమాత ఆలయాన్ని స్వర్ణమయం చేయాలని మంత్రి పెద్దిరెడ్డి సంకల్పించి 42 కిలోల బంగారంతో ఆర్నెల్లలోనే ఆలయ గోపురాన్ని స్వర్ణమయం చేశారు. సొంత నిధులతో అమ్మవారికి బంగారు అభరణాలు, కనకపు కవచాలను పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు చేయించారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా బంగారు ఆభరణాలను టీటీడీకి అందించనున్నారు. 

3 భారీ పరిశ్రమలు.. 4,550 మందికి ఉపాధి 
తిరుపతి జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు కోసం సీఎం జగన్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. రేణిగుంట మండలం జీపాళ్యెం, ఏర్పేడు మండలం వికృతమాల పరిధిలో టీసీఎల్‌కి అనుబంధంగా రూ.1,702 కోట్లతో ఏర్పాటవుతున్న ప్యానల్‌ ఆప్టో డిస్‌ప్లే టెక్నాలజీ సంస్థ, సెవెన్‌ హిల్స్‌ డిజిటల్‌ పార్కులో సన్నీ ఓపోటెక్‌ ఇండియా సంస్థ రూ.350 కోట్లతో నెలకొల్పే ప్రాజెక్టు, ఇదే పార్క్‌లో ఫాక్స్‌లింక్‌ ఇండియా ఎలక్ట్రిక్‌ రూ.355 కోట్లతో నెలకొల్పే భారీ ప్రాజెక్టులను సీఎం జగన్‌ గురువారం లాంఛనంగా ప్రారంభించనున్నారు.

మొత్తంగా రూ.2,407 కోట్లతో 4,550 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. కాగా ఏర్పేడు–వెంకటగిరి రహదారిలో శ్రీకాళహస్తి మండలం ఇనగలూరు వద్ద 125 ఎకరాల్లో అపాచీ నెలకొల్పుతున్న పరిశ్రమకు సీఎం జగన్‌ శంకుస్థాపన చేస్తారు. ఫాక్స్‌లింక్‌ ఇండియా ఎలక్ట్రిక్‌ సంస్థ చేపట్టనున్న విస్తరణ ప్రాజెక్టు, డిక్సన్‌ టెక్నాలజీస్‌కి చెందిన టీవీ యూనిట్‌ పనులకు కూడా సీఎం భూమి పూజ నిర్వహిస్తారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top