
సాక్షి, విజయవాడ: గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్.. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. బెంగుళూరు నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన విమానం గన్నవరంలో ల్యాండ్ అయ్యింది. హైదరాబాద్‌లో ల్యాండింగ్‌కి వాతావరణం అనుకూలించకపోవడంతో ఏటీసీ అధికారులు గన్నవరం విమానాశ్రయానికి దారి మళ్లించారు. ఇండిగో విమానంలో మొత్తం 222 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం అత్యవసర ల్యాండింగ్ కావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
అహ్మదాబాద్ ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదం తర్వాత ప్రయాణికులు హడలెత్తిపోతున్నారు. వరుసగా విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తడం.. విమాన ప్రయాణం అంటేనే భయపడేలా చేస్తున్నాయి. తాజాగా ఓ విమానానికి పెను ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. జూన్ 14వ తేదీన ఢిల్లీ నుంచి వియన్నా బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పై నుంచి కిందకు దిగిపోయింది. ఉన్నపళంగా 900 అడుగుల ఎత్తు నుంచి కిందకు దిగి పోవడంతో పైలట్లు చాకచక్యంగా వ్యవహరించి నియంత్రణలోకి తీసుకొచ్చారు.