
దేవస్థానం అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి దేహశుద్ధి, ఆపై ఫిర్యాదు
ఉద్యోగిని విధుల నుంచి తొలగించిన ఈఓ మూర్తి
ద్వారకాతిరుమల: శ్రీవారి దేవస్థానం టీటీడీ సదనంలో ఒక భక్తురాలి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉద్యోగికి భక్తురాలి కుటుంబ సభ్యులు దేహశుద్ధి చేశారు. ఆపై అధికారులకు ఫిర్యాదు చేయగా, సదరు ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున జరిగింది. వివరాల్లోకి వెళితే. విశాఖపట్నంకు చెందిన ఒక భక్తుడి కుటుంబం (15 మంది) స్వామివారి దర్శనార్థం సోమవారం సాయంత్రం క్షేత్రానికి విచ్చేశారు.
శ్రీవారి దర్శనానంతరం వారు మద్ది ఆంజనేయ స్వామి క్షేత్రాన్ని సందర్శించారు. తిరుగు ప్రయాణంలో స్థానిక టీటీడీ సదనం వద్దకు చేరుకుని గదులు అద్దెకు తీసుకున్నారు. ఆ సమయంలో అక్కడ గుమస్తాగా విధులు నిర్వర్తిస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నారాయణ వారితో కలివిడిగా మాట్లాడాడు. అదే సమయంలో బాధిత భక్తురాలు జ్వరంతో బాధపడుతున్నట్టు తెలుసుకున్నాడు. కొద్ది సేపటి తరువాత గదిలోంచి బయటకు వచ్చిన ఆమెను ఏమ్మా.. ట్యాబ్లెట్ వేసుకున్నావా అని ఆరా తీశాడు. తిరిగి మంగళవారం తెల్లవారుజామున ఆమె కనబడగా ఏరా.. జ్వరం తగ్గిందా అని చేయి పట్టుకున్నాడు.
దాంతో భక్తురాలి భర్త, కుటుంబ సభ్యులు కోపోద్రిక్తులై నారాయణపై దాడి చేశారు. అనంతరం స్వామివారి పాదుకా మండపం వద్ద ఉన్న సమాచార కేంద్రంలో బాధిత భక్తురాలు సదరు ఉద్యోగిపై ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై వెంటనే ఆలయ ఏఈఓ ఐనంపూడి రమణరాజు, సూపరింటెండెంట్ కోటగిరి కిషోర్ ప్రాథమిక విచారణ జరపగా, ఈఓ ఎన్‌వీఎస్‌ఎన్ మూర్తి నారాయణను ఉద్యోగం నుంచి తొలగించారు. కాగా సదరు ఉద్యోగి సుమారు పదేళ్ల నుంచి దేవస్థానంలో పనిచేస్తున్నాడని, ఇప్పటి వరకు అతడిపై ఒక్క ఫిర్యాదు కూడా లేదని, అందరితో కలివిడిగా ఉంటాడని తోటి ఉద్యోగులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ ఘటనపై అధికారులు పూర్తిస్థాయి విచారణ జరపాల్సి ఉంది.