
ఎమ్మిగనూరులోని ఎంఎస్ జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో చెట్ల కింద విద్యా బోధన
అసౌకర్యాల విద్య
సంఖ్యా పరంగా రాష్ట్రంలోనే మొదటిస్థానం
3,630 మంది విద్యార్థినులతో కిటకిటలాడుతున్న ఎమ్మిగనూరు పాఠశాల
సరిపడా తరగతి గదులు లేక ఆరుబయట చదువులు
మరుగుదొడ్ల కొరతతో తప్పని క్యూలు
ఏడాదైనా అసంపూర్తిగానే అదనపు తరగతి గదులు
ఎమ్మిగనూరు టౌన్: విద్యాభివృద్ధికి గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలతో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్‌ను తలదన్నేలా రూపుదిద్దుకున్నాయి. నాడు–నేడులో భాగంగా కల్పించిన మౌలిక సదుపాయాలతో అడ్మిషన్ల సంఖ్య కూడా మునుపెన్నడూ లేనివిధంగా పెరిగింది. దశాబ్దాలుగా శిథిలమైన పాఠశాలలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో చూడచక్కన రూపాన్ని సంతరించుకుని విద్యార్థులను ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. ఇదే సమయంలో జగనన్న విద్యా కానుకతో పాటు రుచికరమైన మధ్యాహ్న భోజనం అందించడంతో తల్లిదండ్రులు ప్రయివేట్ చదువులను మాన్పించి ప్రభుత్వ పాఠశాల దిశగా అడుగులు వేయించడం విశేషం.
విద్యార్థినుల అడ్మిషన్లలో రాష్ట్రంలోనే మొదటిస్థానం
ప్రస్తుత విద్యాసంవత్సరంలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు జెడ్పీ పాఠశాలలో విద్యార్థినుల సంఖ్య 3,680. వీరిలో ఒక్క 6వ తరగతిలోనే కొత్తగా 850 మంది విద్యార్థినులు ప్రవేశం పొందడం విశేషం. ఫలితంగా ఈ ఒక్క తరగతికే 11 సెక్షన్లు నిర్వహిస్తున్నారు. విద్యార్థినుల సంఖ్య పరంగా ఈ పాఠశాల రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. 7వ తరగతిలో 680 మంది విద్యార్థినులకు 10 సెక్షన్లు, 8వ తరగతిలో 750 మందికి 10 సెక్షన్లు, 9వ తరగతిలో 700 మందికి 10 సెక్షన్లు, 10వ తరగతికి 9 సెక్షన్లతో బోధన సాగిస్తున్నారు. విద్యార్థినుల సంఖ్యకు అనుగుణంగా 94 మంది ఉపాధ్యాయులు ఇక్కడ పనిచేస్తున్నారు. ఇంకా 5 హిందీ, 6 ఒకేషనల్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది.
ఏడాదైనా పూర్తికాని అదనపు తరగతి గదులు
గత ప్రభుత్వ హయాంలో విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా రెండవ విడత నాడు–నేడు కింద 12 అదనపు తరగతి గదుల నిర్మాణానికి పూనుకుంది. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పనులను పూర్తిగా విస్మరించింది. ఈ కారణంగా విద్యార్థినులు పాఠశాల ఆవరణలోని చెట్ల కింద, వరండాల్లో అష్టకష్టాలు పడుతూ చదువుకుంటున్నారు. ఇదే సమయంలో విద్యార్థినుల సంఖ్యకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో నేల చదువులు తప్పడం లేదు. ఒకే తరగతి గదిలో కొందరు డెస్‌్కలపై, మరికొందరు నేలపై కూర్చోవడం వల్ల వివక్షను ఎదుర్కొంటున్నారు.
3,630 మంది విద్యార్థినులకు 22 మరుగుదొడ్లే..
రాష్ట్రంలోనే విద్యార్థినుల సంఖ్య పరంగా ఈ పాఠశాల మొదటిస్థానంలో ఉంది. మొత్తం 3,630 మంది విద్యార్థినీలు ఉన్న ఈ పాఠశాలలో 22 మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి. ఈ కారణంగా విద్యార్థినీలు అత్యవసరమై మరుగుదొడ్లను ఉపయోగించుకోవాల్సి వస్తే క్యూలో నిల్చోవాల్సిన దుస్థితి నెలకొంది. సంఖ్యకు అనుగుణంగా మరో 20 మరుగుదొడ్లు అవసరం కాగా, ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించని పరిస్థితి. ఇక విద్యార్థినుల సంఖ్య అధికంగానే ఉన్నప్పటికీ కేవలం నలుగురు మాత్రమే ఆయాలు పని చేస్తున్నారు. ఈ కారణంగా పాఠశాలలో పారిశుద్ధ్య లోపం కొట్టిచ్చినట్లుగా కనిపిస్తోంది.
నాడు–నేడు రెండో విడతకు రూ.2.08కోట్లు
గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో మొదటి విడత నాడు–నేడు కింది టాయిలెట్స్ ఇతర మౌలిక సదుపాయాలకు రూ.1.01కోట్లు మంజురు కాగా ఆయా పనులన్నీ పూర్తయ్యాయి. ఇక రెండో విడత నాడు–నేడు కింద 20 అదనపు తరగతి గదులకు రూ.2.08కోట్లు మంజూరయ్యాయి. కాగా అందులో 8 తరగతి గదులు అసంపూర్తిగా ఉన్నాయి. ఆయా గదుల బయట ప్లాస్టింగ్ చేయకపోయినా సున్నం కొట్టించి వాటిలోనే తరగతులను నిర్వహిస్తున్నారు. మిగిలిన 12 గదుల నిర్మాణాలు పిల్లర్లకే పరిమితమయ్యాయి. ఏడాది కాలంగా ప్రస్తుత ప్రభుత్వం వీటిని పట్టించుకోకపోవడం గమనార్హం.
పాఠశాలలో అన్నీ సమస్యలే..
⇒ ఇక్కడ ఆర్‌ఓ ప్లాంట్ గత ఏడాది నుంచి పనిచేయక మూలనపడింది.
⇒ విధిలేని పరిస్థితుల్లో విద్యార్థినీలు ఇంటి నుంచి బాటిళ్లలో నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తోంది.
⇒ మధ్యాహ్న భోజన సమయంలో వెక్కిళ్లు వస్తే వీళ్ల పరిస్థితి వర్ణనాతీతం.
⇒ వర్షాకాలంలో పాఠశాల ఆవరణ తడిచి ముద్దవుతోంది.
⇒ గ్రౌండ్‌లోనూ వర్షం నీరు నిలుస్తుండటంతో అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి.
ఈ విద్యార్థినులు మరుగు దొడ్లను వినియోగించుకునేందుకు ఇలా క్యూలో నిల్చొన్నారు. పాఠశాలలో 3,630 మంది విద్యార్థినులు ఉండగా 22 మరుగుదొడ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో విధిలేని పరిస్థితుల్లో ఇలా క్యూలో నిల్చొని వీరు ఎదుర్కొంటున్న అవస్థలు వర్ణనాతీతం.
పాఠశాల విద్యలోనూ రాజకీయమే..
గత ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్న కూటమి ప్రభుత్వం పాఠశాల విద్యలోనూ రాజకీయం చొప్పించింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నాడు–నేడు కింద విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా చేపట్టిన అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని ఏడాది కాలంగా ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితి. ఈ కారణంగా విద్యార్థుల అవస్థలు వర్ణనాతీతం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని ఎంఎస్ బాలికల జెడ్పీ ఉన్నత పాఠశాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం
మా పాఠశాలలో విద్యార్థినీల సంఖ్యకు తగ్గట్టుగా తరగతి గదుల్లేవు. నాడు–నేడు కింద నిలిచిపోయిన 12 తరగతి గదుల నిర్మాణాలను పూర్తి చేయాలని ఉన్నతాధికారులకు నివేదించాం. పాఠశాల అభివృద్ధికి దాతలు కూడా ముందుకొస్తున్నారు. అధికారుల ఆదేశాలతో అవసరమైతే వారి సహకారం కూడా తీసుకొంటాం. అదనపు మరుగుదొడ్లు అత్యవసరం. – కృష్ణమూర్తి, ప్రధానోఫాధ్యాయులు, ఎంఎస్, జెడ్పీ బాలికల హైస్కూల్, ఎమ్మిగనూరు
ప్రభుత్వం ఎప్పుడు మేల్కొంటుందో?
మరుగుదొడ్లకు వెళ్లేందుకు కూడా విద్యార్థినులు క్యూలో నిల్చోవాల్సిన దుస్థితి చూస్తే ఈ ప్రభుత్వం ఎంతటి దిగజారుడు పాలన సాగిస్తుందో అర్థమవుతోంది. విద్యార్థుల విషయంలో కూడా రాజకీయం చేయడం సిగ్గుచేటు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సర్కారు పాఠశాలలను బలోపేతం చేసే దిశగా అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టింది. ప్రస్తుత ప్రభుత్వం వీటిని పూర్తి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఏడాది గడిచినా ఇప్పటికీ ప్రభుత్వం మేల్కోకపోవడం దారుణం. – బుట్టా రేణుక, వైఎస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎమ్మిగనూరు