గురుకులాల గురి కుదిరింది | Improved facilities record results with academic teaching in Gurukul Schools | Sakshi
Sakshi News home page

గురుకులాల గురి కుదిరింది

Dec 6 2021 3:32 AM | Updated on Dec 6 2021 8:44 AM

Improved facilities record results with academic teaching in Gurukul Schools - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న షెడ్యూల్డ్‌ కులాల (ఎస్సీ) గురుకుల విద్యాలయాల్లో మంచి ఫలితాలు లభిస్తున్నాయి. దీంతో ఎస్సీ గురుకులాలపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు గురి కుదిరింది. ఎస్సీ గురుకులాల్లో సాధిస్తున్న మెరుగైన ఫలితాలతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆదరణ పెరుగుతోంది. గురుకులాల విద్యార్థులు మునుపెన్నడూ లేనివిధంగా ఈ ఏడాది అత్యధిక మెడికల్, ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్షల్లోను తమ సత్తా చాటారు. నీట్‌లో అత్యంత ప్రతిభ కనబరిచిన గురుకుల విద్యార్థులు 17 మందికి ఎంబీబీఎస్‌లోను, 21 మందికి బీడీఎస్‌లోను సీట్లు లభించే అవకాశం ఉంది. ఏకంగా 13 మంది విద్యార్థులు నేరుగా ఐఐటీ అడ్మిషన్‌కు అర్హత సాధించారు. 34 మంది ప్రిపరేటరీ ఐఐటీ (ఏడాది తర్వాత ఎటువంటి పరీక్ష లేకుండా అడ్మిషన్‌)కి అర్హత సాధించగా 37 మంది ఎన్‌ఐటీకి అర్హత సాధించడం రాష్ట్ర చరిత్రలోనే రికార్డు. అదే 2014లో మన రాష్టంలోని ఎస్సీ గురుకుల విద్యాలయాల్లో సాధించిన ఐఐటీ సీటు ఒక్కటి మాత్రమే కావడం గమనార్హం. 

ఆరోగ్యానికీ ప్రాధాన్యం 
గురుకులాల విద్యార్థులకు విద్యతోపాటు ఆరోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఈ ఏడాది ‘కంటివెలుగు’ ద్వారా ఎస్సీ గురుకులాల్లో చదివే లక్షమంది విద్యార్థులకు ఉచిత పరీక్షలు నిర్వహించారు. 3,326 మందికి దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించి వారికి ఉచితంగా కళ్లజోడు అందించారు. ‘స్వేచ్ఛ’ కార్యక్రమం ద్వారా 55,763 మంది బాలికలకు ప్రతినెల పది చొప్పున నాణ్యమైన శానిటరీ న్యాప్‌కిన్స్‌ను ఉచితంగా అందిస్తున్నారు.  

ప్రత్యేక శ్రద్ధతోనే ఇది సాధ్యమైంది 
అట్టడుగు వర్గాలకు మెరుగైన విద్యావకాశాలు అందించాలనే లక్ష్యంతో సీఎం జగన్‌ తీసుకున్న ప్రత్యేకశ్రద్ధ వల్లే ఇది సాధ్యమైంది. రాష్ట్రంలోని 192 ఎస్సీ గురుకులాల్లోను మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రత్యేకశ్రద్ధ వహిస్తున్నాం. విద్యార్థులను సబ్జెక్టుల వారీగా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వారికి ఆయా సబ్జెక్టుల్లో నిపుణులైన ఉపాధ్యాయులతో బోధన, ప్రైవేట్‌ క్లాస్‌లు పెట్టిస్తున్నాం. ఈ ఏడాది ఐఐటీ, ఎన్‌ఐటీ, మెడికల్‌ సీట్లు సాధించడమే ఇందుకు నిదర్శనం. అమ్మఒడి వంటి పథకాలతోపాటు అనేక తోడ్పాటు చర్యలు తీసుకోవడం ద్వారా ఎస్సీ విద్యార్థులకు ఉన్నత చదువులను చేరువచేసే ప్రయత్నాలు సత్ఫలితాలిస్తున్నాయి.  
– పినిపే విశ్వరూప్, రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement