బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేక ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తున్న మత్స్యకార నాయకులపై అక్రమ కేసులు
అరెస్టులతో వేడెక్కిన అనకాపల్లి జిల్లా రాజయ్యపేట
నిరాహార దీక్షా శిబిరం వద్దకు వందలాదిగా చేరుకున్న మత్స్యకారులు
నక్కపల్లి: అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు వ్యతిరేక ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తున్న నాయకులపై అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టు చేయడంపై మత్స్యకారులు మండిపడ్డారు. ‘అరెస్టులు.. అక్రమ కేసులు ఉద్యమాన్ని ఆపలేవు’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు.
మత్స్యకార నాయకుల్ని అరెస్టు చేయడంతో రాజయ్యపేట గ్రామం ఒక్కసారిగా వేడెక్కింది. మత్స్యకార నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడానికి నిరసిస్తూ శనివారం వందలాది మంది మత్స్యకారులు రాజయ్యపేటలో నూకతాత ఆలయం వద్ద కొనసాగుతున్న నిరాహార దీక్ష శిబిరం వద్దకు చేరుకుని ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఉద్యమకారులపై అక్రమ కేసులా!
వారం రోజుల క్రితం తుపాను షెల్టర్‌లో బాధితులకు భోజనాలు పెడుతుండగా తనపై దౌర్జన్యం చేశారని, కులం పేరుతో దూషించారని పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మత్స్యకార నాయకుడు, మాజీ ఎంపీటీసీ పిక్కి తాతీలు తదితర 13 మందిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. శుక్రవారం రాత్రి పిక్కి తాతీలు, పిక్కి రామ్‌చరణ్‌లను నక్కపల్లిలో అరెస్టు చేశారు. దీంతో మత్స్యకారుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవు™తోంది.
శనివారం ఉదయం మత్స్యకారులంతా దీక్షా శిబిరం వద్దకు చేరుకుని బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటును నిరసిస్తూ చేపట్టిన ఉద్యమాన్ని అణగదొక్కేందుకే మత్స్యకారులపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. గ్రామంలోకి వచ్చిన హోంమంత్రిని అడ్డుకోవడం, జాతీయ రహదారిని ముట్టడించడం వల్ల ప్రభుత్వం కక్షగట్టి తమపై కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తోందన్నారు. తక్షణమే కేసులు ఎత్తివేయాలని, అరెస్టు చేసిన మత్స్యకారులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కులాల మధ్య చిచ్చుపెట్టిన ప్రభుత్వం
దీక్షా శిబిరం వద్ద మత్స్యకార నాయకులు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం గ్రామంలో కులాల మధ్య చిచ్చుపెట్టిందని, పంచాయతీ కార్యదర్శిని పావులా వాడుకుని బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేక ఉద్యమాన్ని అణచివేయాలని ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. మత్స్యకారులు గోసల స్వామి, కోడ కాశీరావు, పిక్కి స్వామి, మహేష్ చేపల సోమేష్ మాట్లాడుతూ తుపాను సందర్భంగా రక్షిత భవనం వద్ద భోజనాలు పెడుతున్నారని విషయం తెలిసి గ్రామానికి చెందిన సుమారు 200 మంది వెళ్లి గ్రామస్తులందరికీ భోజనాలు పెట్టాలని కార్యదర్శిని కోరినట్టు చెప్పారు.
అంతే తప్ప కార్యదర్శిపై దౌర్జన్యం చేయలేదన్నారు. జరిగిన ఘటనపై గ్రామంలో బహిరంగ విచారణ జరపాలని డీఎస్పీని కోరినప్పటికీ పట్టించుకోలేదన్నారు. తమపై అక్రమ కేసుల వెనుక రాజకీయ కుట్ర ఉందన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారన్నారు.
భారీగా మోహరించిన పోలీసులు
మత్స్యకార నాయకుల అరెస్టు నేపథ్యంలో ఎటువంటి ఆందోళనలు జరగకుండా పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో వందలాది మంది పోలీసులు నక్కపల్లి, రాజయ్యపేటలో మోహరించారు. నక్కపల్లి జంక్షన్, రాజయ్యపేట జంక్షన్ వద్ద గ్రామాల్లోకి వచ్చేవారిని, వాహనాలను తనిఖీ చేశారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణను రెండో రోజు కూడా గృహనిర్బంధం చేశారు.


