సాక్షి,తిరుపతి: కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల పక్రియలో అధికార కూటమి అరాచక పాలన పరాకాష్టకు చేరింది. ఓటమి భయంతో తమని నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ అభ్యర్థులు నిరసనలకు దిగారు.
ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత తిరుపతి మున్సిపల్ కార్యాలయం వద్ద పగటిపూట నామినేషన్ వేయకుండా తీవ్ర ఆటంకాలు ఎదుర్కొన్న వైఎస్సార్సీపీ మేయర్ అభ్యర్థి ఎచ్చెం వాసుదేవ యాదవ్ (వాసు యాదవ్).. కురుస్తున్న జోరు వానను సైతం లెక్కచేయకుండా తన తల్లి రేణుకా యాదవ్తో కలిసి అర్ధరాత్రి వేళ నడిరోడ్డుపైనే బైఠాయించి ‘గాంధీ గిరి’ శైలిలో శాంతియుత పోరాటానికి దిగారు.
కళ్లముందే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, తమకు నామినేషన్ వేసే అవకాశం కల్పించాలని కన్నీటి పర్యంతమవుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను వేడుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
అంతకుముందు పగటిపూట నామినేషన్ల ప్రక్రియలో తిరుపతి మున్సిపల్ ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యంతో కలిసి శనివారం మధ్యాహ్నం 2:40 గంటల ప్రాంతంలో వాసు యాదవ్ నామినేషన్ వేసేందుకు రాగా.. అధికార పార్టీ శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో ఎంపీ చేతిలో ఉన్న నామినేషన్ పత్రాలను గుర్తుతెలియని వ్యక్తులు బలవంతంగా లాక్కొని పరారయ్యారు. వాహనాలపై రాళ్ల దాడి చేశారు. సాయంత్రం 3 గంటల గడువు ముగిసిపోయిందనే నెపంతో అధికారులు నామినేషన్ తీసుకోలేదు. దీంతో న్యాయం కోసం వాసు యాదవ్ తన కుటుంబంతో కలిసి రాత్రి వేళ వీధిపోరాటానికి దిగాల్సి వచ్చింది.
వానలో తడుస్తూనే దీక్ష
రాత్రి సమయానికి తిరుపతిలో భారీ వర్షం కురుస్తున్నప్పటికీ.. వాసు యాదవ్, ఆయన తల్లి రేణుకా యాదవ్ మున్సిపల్ కార్యాలయం గేటు ముందే రోడ్డుపై కూర్చుండిపోయారు. యాదవ బిడ్డకు ఎన్నికల్లో పోటీ చేసే హక్కు లేదా? అధికార బలంతో మా నామినేషన్ పత్రాలు లాక్కుని, పోలీసుల సమక్షంలోనే ఇంత అన్యాయం చేస్తుంటే మేము ఎవరికి చెప్పుకోవాలి?’ అంటూ రేణుకా యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జరిగిన అన్యాయాన్ని పరిశీలించి, నామినేషన్ దాఖలు చేయడానికి ప్రత్యేకంగా అనుమతి ఇవ్వాలని వారు రాష్ట్ర ఎన్నికల కమిషన్ను వేడుకున్నారు.
పోలీసుల వైఫల్యంపై ఎంపీ ఆగ్రహం
ఈ ఘటనపై తిరుపతి ఎంపీ గురుమూర్తి తీవ్రంగా మండిపడ్డారు. సాక్షాత్తూ పార్లమెంట్ సభ్యుడు, ఎమ్మెల్సీ తోడుగా వెళ్లినా రక్షణ కల్పించలేకపోయిన పోలీసులు..సామాన్య అభ్యర్థులకు ఎలా భరోసా ఇస్తారని ప్రశ్నించారు. కూటమి నేతలు ఏకగ్రీవాల కోసం ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అర్ధరాత్రి వానలో సాగిన మేయర్ అభ్యర్థి ఆందోళనతో తిరుపతి నగరంలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.


