హైకోర్టులో కూటమి సర్కార్‌కు చుక్కెదురు | High Court Intervenes After Alliance Shifts Focus to Stop YSRCP Nominations | Sakshi
Sakshi News home page

హైకోర్టులో కూటమి సర్కార్‌కు చుక్కెదురు .. వైఎస్సార్సీపీ అభ్యర్థులకు లైన్ క్లియర్!

Oct 18 2026 8:03 AM | Updated on Oct 18 2026 8:15 AM

High Court Intervenes After Alliance Shifts Focus to Stop YSRCP Nominations

సాక్షి,వైఎస్సార్‌ కడప: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ఓటమి భయం పట్టుకుంటుంది. అందుకే తమని నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ శ్రేణులు అడ్డుకుంటున్నాయని వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు హైకోర్టులో అత్యవసరంగా మాండమస్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు కూటమి సర్కార్‌కు కీలక ఆదేశాలు జారీ చేసింది. నామినేషన్‌ దాఖలు చేస్తున్న అభ్యర్థులకు రక్షణ కల్పించాలని స్పష్టం చేసింది. 

కడప మున్సిపల్ పరిధిలో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తూ, నామినేషన్ కేంద్రాల వద్ద టీడీపీ శ్రేణులు సృష్టిస్తున్న అడ్డంకులను పిటిషనర్లు న్యాయస్థానానికి వివరించారు. ఈ మేరకు అభ్యర్థుల ప్రాణాలకు, స్వేచ్ఛకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత యంత్రాంగంపై ఉందని న్యాయస్థానాన్ని వేడుకున్నారు.

వైఎస్సార్సీపీ అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల్లో పోటీ చేసే ఏ అభ్యర్థికైనా చట్టప్రకారం రక్షణ కల్పించాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వం, పోలీసు యంత్రాంగంపై ఉంటుందని స్పష్టం చేసింది. ఎవరూ కూడా అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియను బలవంతంగా అడ్డుకోవడానికి వీల్లేదని పేర్కొంది. పిటిషన్ దాఖలు చేసిన వైఎస్సార్సీపీ మేయర్ అభ్యర్థి బండి దీప్తి, ఇతర కౌన్సిలర్ అభ్యర్థులకు చట్టప్రకారం తగిన పోలీసు రక్షణ కల్పించాలని ఉన్నతాధికారులను హైకోర్టు ఆదేశించింది.

హైకోర్టు ఆదేశాలపై వైఎస్సార్సీపీ మేయర్ అభ్యర్థి బండి దీప్తి హర్షం వ్యక్తం చేశారు. కడపలో టీడీపీ నేతలు ఓటమి భయంతోనే ఇటువంటి అరాచకాలకు దిగుతున్నారని ఆమె మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో తమకు ఎదురుగాలి వీస్తుండటంతో, కనీసం పోటీలో నిలబడకుండా అభ్యర్థులను బెదిరిస్తున్నారని ధ్వజమెత్తారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యం నిలబడింది. పోలీసుల రక్షణతో మేము సజావుగా నామినేషన్లు దాఖలు చేసి, ఎన్నికల బరిలో నిలిచి వైఎస్సార్సీపీ జెండాను ఎగురవేస్తాం’ అని బండి దీప్తి ధీమా వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో  వైఎస్సార్‌ కడప జిల్లాలో నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement