చిన్నారి మృతదేహం వద్ద తల్లి నాగలక్ష్మి (ఇన్సెట్లో) ఇన్షికా
పాప శరీరంపై కాల్చిన వాతలు, పంటిగాట్లు
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): మూడేళ్ల కూతురిని కన్నతల్లే కడతేర్చిన ఘటన గుంటూరులో శనివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నల్లచెరువు ప్రాంతానికి చెందిన నాగలక్ష్మి, సాయిలకు ఐదేళ్ల కిందట పెళ్లైంది. వీరికి ఇన్షికా (3) పాప ఉంది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో కొంతకాలంగా వేర్వేరుగా ఉంటున్నారు. ప్రస్తుతం నాగలక్ష్మి శారదాకాలనీ 1వ లైన్లో నివాసం ఉంటోంది. ఆమె సుభాష్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శనివారం చిన్నారి ఇన్షికా అపస్మార స్థితిలో కింద పడిందంటూ ఆమె తల్లి నాగలక్ష్మి గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రికి తీసుకొచ్చింది.
వైద్యులు పరీక్షలు నిర్వహించి పాప మృతి చెందినట్లు ధ్రువీకరించారు. పాప శరీరంపై కాల్చిన గాయాలు, పంటి గాట్లు ఉండటాన్ని గుర్తించి ఔట్పోస్ట్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు బాలిక తల్లిని విచారించగా పొంతనలేని సమాధానాలిచ్చింది. దీంతో ఔట్పోస్టు పోలీసులు అరండల్పేట పోలీసులకు సమాచారం ఇచ్చి ఎంఎల్సీ కేసు నమోదు చేసి పాప మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించేందుకు సిద్ధం చేశారు. దీనికి తల్లి నాగలక్ష్మి, ఆమె సహచరుడు సుభాష్ అభ్యంతరం తెలిపారు.
ఎలాంటి కేసులూ అవసరం లేదని గందరగోళం సృష్టించారు. అరండల్పేట ఎస్సై మహేష్ సిబ్బందితో ఆస్పత్రికి చేరుకుని నాగలక్ష్మిని గట్టిగా నిలదీయడంతో పాప మూత్రం పోస్తుండడంతో తానే వాతలు పెట్టానని, పంటితో కొరికానని అంగీకరించినట్టు సమాచారం. దీంతో పోలీసులు నాగలక్ష్మిని, సుభాష్లను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.


