నామినేషన్లు వేసే వారినే అడ్డుకుంటుంటే ఎస్ఈసీ ఏం చేస్తోంది?
తొలిరోజు ఇచ్చిన ఫిర్యాదులపై చర్యలు చేపట్టలేదు
అందుకే మొదట రోజుకన్నా రెండో రోజు టీడీపీ దాడులు పెరిగాయి.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు మరోసారి వినతిపత్రమిచ్చిన వైఎస్సార్సీపీ
నామినేషన్లు వేయడానికి వచ్చిన వారే దాడులు చేసినట్టు ఐజీ ప్రవీణ్ అంటున్నారు
ఆయన పరిధిలోనే దాడులన్నీ జరుగుతున్నాయి
ఎన్నికల విధుల నుంచి ఆయన్ని తప్పించాలని వైఎస్సార్సీపీ నేతల డిమాండ్
సాక్షి, అమరావతి: నామినేషన్లు వేసేందుకు వెళ్లుతున్న తమ పార్టీ అభ్యర్థులపై అధికారపక్షం గూండాలు దాడులకు పాల్పడుతూ అడ్డుకుంటున్న తీరుపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)కి ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకుండా పోయిందని వైఎస్సార్సీపీ మండిపడింది. తొలిరోజు ఘటనపై ఫిర్యాదు చేశామని, ఎస్ఈసీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో అధికార పార్టీ మూకలు రెండో రోజూ విధ్వంసాలకు పాల్పడ్డారని తూర్పారపట్టింది. వీటిని వివరిస్తూ ఎస్ఈసీకి శనివారం మరోమారు వినతిపత్రమిచ్చింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రుహుల్లా, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మలసాని మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతల బృందం శనివారం మరోసారి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠను కలిసి వినతిపత్రాలిచ్చారు.
అనంతరం అప్పిరెడ్డి, సుధాకర్‌బాబు విలేకరులతో మాట్లాడుతూ.. తిరుపతిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి నామినేషన్ ప్రతిపాదనల్ని తీసుకెళ్తున్న ఎంపీ గురుమూర్తిని పోలీసులు అడ్డుకోవడం, పేపర్లు చూపించమని అడగటం, అక్కడే ఉన్న టీడీపీ గూండాలు వీళ్ల చేతుల్లో నామినేషన్లు లాక్కెళ్లడం చూస్తుంటే అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అన్న అనుమానం కలుగుతోందన్నారు. నామినేషన్ల గడువు మరో రోజు పొడిగించాలని కోరారు. నామినేషన్లు వేయడానికి వచ్చిన వారే దాడులు చేసినట్టు డీఐజీ కోయ ప్రవీణ్ ఓ పార్టీకి కొమ్ముకాసేలా ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. జరిగిన çఘటనలకు బాధ్యత ఆయనదేనని, తక్షణమే ఆయన్ని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.


