
భార్యపై అనుమానమే కారణం
తిరుపతి జిల్లాలో ఘటన
చంద్రగిరి: భార్య మీద అనుమానంతో ఓ భర్త ఆమె గొంతు కోసి ప్రాణాలు తీశాడు. ఆ తర్వాత తాను కూడా ఉరేసుకుని ప్రాణాలు విడిచాడు. తిరుపతి జిల్లా తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం.. చిత్తూరు సమీపంలోని ఠాణాకు చెందిన లోకేశ్వర్(45)కు, మంగళం సమీపంలోని తిరుమల నగర్‌కు చెందిన ఉష(34)తో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 14 ఏళ్ల బాబు, 11 ఏళ్ల పాప ఉన్నారు. వీరిద్దరూ కోళ్లఫారం కాలనీలో నివాసం ఉంటున్నారు. లోకేశ్వర్ బీఎస్‌ఎన్‌ఎల్‌లో టెక్నీషియన్ కాగా, ఉష స్థానికంగా ఉండే ఓ కంపెనీలో పనిచేస్తోంది.
భార్య ఉషపై లోకేశ్వర్‌కు అనుమానం ఉండటంతో వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో గత నెల 30న భార్యభర్తల మధ్య గొడవ తీవ్రరూపం దాల్చింది. దీంతో ఉష.. కాలనీ సమీపంలోని తిరుమలనగర్‌లో ఉంటున్న తల్లిదండ్రుల వద్దకు చేరింది. ఇదిలా ఉండగా, ఉద్యోగానికి వెళ్లేందుకు శనివారం ఉదయం 5 గంటలకు ఉష తన అమ్మ ఇంటి నుంచి బయల్దేరింది. భార్య కోసం బొమ్మల క్వార్టర్స్ వద్ద లోకేశ్వర్ కాపు కాశాడు.
బస్సు కోసం బొమ్మల క్వార్టర్స్ వద్దకు వచి్చన ఉషపై ఒక్కసారిగా కత్తితో దాడి చేసి.. ఆమె గొంతు కోశాడు. దీంతో ఘటనా స్థలంలోనే ఉష ప్రాణాలు విడిచింది. ఉదయం అటుగా వెళ్తున్న స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి, సీఐ సునీల్‌కుమార్‌లు సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకున్నారు. లోకేశ్వర్ కోసం అతని ఇంటికి వెళ్లగా.. అప్పటికే ఇంట్లో లోకేశ్వర్ ఉరివేసుకుని మృతి చెంది ఉన్నాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి మెడికల్ కళాశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సునీల్‌కుమార్ తెలిపారు.