
సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్, ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి
బనకచర్లపై సాంకేతిక కమిటీ వేస్తామని కేంద్ర మంత్రి చెప్పారన్న రామానాయుడు
అసలు సమావేశంలో ప్రాజెక్టు ప్రస్తావనే రాలేదని స్పష్టం చేసిన తెలంగాణ సీఎం రేవంత్
కేంద్ర జల్ శక్తి శాఖ పీఐబీ ద్వారా విడుదల చేసిన ప్రకటనలోనూ ‘బనకచర్ల’ లేదు
బనకచర్ల ఏకైక ఎజెండాగా ఢిల్లీ వెళ్లినా.. ఆ ప్రాజెక్టుపై చర్చ జరిగిందా? లేదా?
బనకచర్లపై సీఎం చంద్రబాబు చిత్తశుద్ధి ఏమిటో బట్టబయలైందంటున్న నిపుణులు.. పాలనలో, హామీ అమలులో వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకేనని ధ్వజం
రెండు నెలలుగా ఈ ప్రాజెక్టు విషయమై తెలుగు రాష్ట్రాల్లో తీవ్రస్థాయిలో వివాదం.. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే
ఇదంతా చేస్తున్నారంటూ అభిప్రాయం
బనకచర్లపై ఏపీ ప్రస్తావన తేలేదు
అసలు బనకచర్లను ఏపీ వాళ్లు కడతామని ప్రస్తావిస్తేనే కదా? ఆపమని మేం అభ్యంతరం తెలిపేది? ఈ ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వ సంస్థలే అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. కేంద్ర మంత్రి వద్ద జరిగిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కేవలం అనధికార భేటీ మాత్రమే. – తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి
బనకచర్లపై సానుకూలం
పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన నివేదిక, తెలంగాణ ప్రభుత్వం వ్యక్తం చేసిన అభ్యంతరాలపై సానుకూల స్పందన వ్యక్తమైంది. చర్చలు ఫలప్రదమయ్యాయి. – రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు
సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో రెండు నెలల నుంచి తీవ్ర వివాదాస్పదంగా మారిన బనకచర్ల ప్రాజెక్టుపై ఢిల్లీ వేదికగా చంద్రబాబు ప్రభుత్వ కపటత్వం బట్టబయలైంది. బనకచర్ల ఏ ఎజెండాగా బుధవారం కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ సమక్షంలో తెలంగాణ సీఎంతో సమావేశం అవుతున్నట్లు బీరాలు పలికినా... అసలు ఆ ప్రాజెక్టు చర్చకే రాలేదని తేలింది. దీంతో బనకచర్లపై ఆయనకున్న చిత్తశుద్ధి ఏపాటిదో తేలిపోయింది. కేంద్ర మంత్రి వద్ద జరిగిన భేటీలో బనకచర్ల ప్రస్తావనే రాలేదంటూ మీడియా సమావేశంలో సాక్షాత్తు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కుండబద్దలు కొట్టినట్లు చెప్పడంతో... చంద్రబాబు సర్కారు హైడ్రామా బయటపడింది.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం అనధికార భేటీ మాత్రమేనని రేవంత్ పేర్కొనడం, అసలు బనకచర్ల కడతామని ఏపీ వాళ్లు ప్రస్తావిస్తేనే కదా? ఆపమని తాము అభ్యంతరం తెలిపేది అనడం... కేంద్రం ఎలాంటి ఎజెండా పెట్టుకోకుండా, వేదిక అందించిందని స్పష్టం చేయడంతో చంద్రబాబు ప్రభుత్వ బండారం వెలుగులోకి వచ్చింది.
బనకచర్లపై చర్చించలేదని కేంద్రమూ చెప్పింది...
కేంద్ర మంత్రితో భేటీ అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడగా, చంద్రబాబు మాత్రం మొహం చాటేశారు. తమది అపెక్స్ కౌన్సిల్ సమావేశం కాదని, సమస్యలపై సీఎంల స్థాయిలో జరిగిన అనధికార (ఇన్‌ఫార్మల్) సమావేశమని కూడా రేవంత్ పేర్కొన్నారు. అయితే, ఏపీ జల వనరుల మంత్రి నిమ్మల రామానాయుడు ఏకంగా బనకచర్లపై నిపుణులతో కూడిన సాంకేతిక కమిటీ వేస్తామని కేంద్ర మంత్రి చెప్పారని ప్రకటించేశారు. కానీ, సమావేశంలో చర్చించిన అంశాలపై కేంద్ర జలశక్తి శాఖ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో బుధవారం రాత్రి 7.27 గంటలకు విడుదల చేసిన ప్రకటనలో బనకచర్ల ప్రస్తావనే లేకపోవడం గమనార్హం. తాము సాధారణ అంశాలే చర్చించామంటూ రేవంత్ కూడా తెలిపారు. ఈ నేపథ్యంలో బనకచర్ల సింగిల్ పాయింట్ అజెండా అంటూ బీరాలు పోతూ సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లినా ఆ ప్రాజెక్టుపై చర్చనే జరగలేదని తేలిపోయింది.
సింగిల్ పాయింట్ అజెండాగా వెళ్లినా...
అసలు బనకచర్ల ప్రతిపాదనలోనే చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని సాగునీటి నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే. ఎర్త్ వర్క్‌లు చేసి భారీఎత్తున కమీషన్లను కొట్టేసేందుకే బనకచర్లను తెరపైకి తెచ్చారని ఆరోపిస్తున్నారు. మరోవైపు బనకచర్ల అసాధ్యం అంటూ పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) తేల్చి చెప్పింది. పోలవరంలో 45.72 మీటర్ల ఎత్తుతో నీటిని నిల్వ చేస్తేనే బనకచర్లకు గోదావరి జలాలను తరలించే వీలుంటుందని, 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా పోలవరం పూర్తికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర జల్‌శక్తి శాఖకు స్పష్టం చేస్తూ లేఖ రాసింది.
ఇదిలాఉంటే పోలవరంలో 42 మీటర్ల ఎత్తు నుంచి బనకచర్లకు తరలిస్తామని కేంద్రానికి చంద్రబాబు ప్రతిపాదించారు. కానీ, పోలవరంలో 41.15 మీటర్ల ఎత్తున నీటి నిల్వకు పరిమితమైతే.. 42 మీటర్లలో నీళ్లే నిల్వ ఉండవు. లేని నీటిని తరలించేందుకు బనకచర్ల ప్రతిపాదన తేవడం చూస్తుంటే.. చంద్రబాబుకు గోదావరి వరద జలాలను కరువు పీడిత ప్రాంతాలకు తరలించి సస్యశ్యామలం చేయాలన్న చిత్తశుద్ధి లేదని బహిర్గతమైంది. బనకచర్ల ఏకైక ఎజెండాగా ఢిల్లీ వెళ్లి ఆ ప్రాజెక్టుపై చర్చే లేకుండా వెనుదిరగనుండడం కూడా దీనిని బలపరుస్తోంది.
డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమే...
సూపర్ సిక్స్ సహా ఎన్నికల్లో ఇచ్చిన 143 హామీల అమలు, పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా బనకచర్లను చంద్రబాబు పావుగా వాడుకున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సీఎంల సమావేశంలో పరిష్కారం కుదిరిందని చెబుతున్న నాలుగు అంశాలు కూడా కృష్ణా–గోదావరి బోర్డుల స్థాయిలోనే పరిష్కారం అయ్యేవేనని స్పష్టం చేస్తున్నారు.
బనకచర్లపై ఏపీ ప్రస్తావన తేలేదు: రేవంత్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో బనకచర్ల అంశమే ప్రస్తావనకు రాలేదని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘‘అసలు బనకచర్లను ఏపీ వాళ్లు కడతామని ప్రస్తావిస్తేనే కదా...? ఆపమని మేం అభ్యంతరం తెలిపేది..? ఈ ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వ సంస్థలే అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. కేంద్ర మంత్రి వద్ద జరిగిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కేవలం అనధికార భేటీ మాత్రమే’’ అని తేల్చి చెప్పారు. కేంద్రం ఎటువంటి ఎజెండా పెట్టుకోకుండా, వేదికను అందించి మధ్యవర్తిలా వ్యవహరించిందని తెలిపారు.
బుధవారం ఢిల్లీలో సీఆర్ పాటిల్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ, ఏపీ సీఎంలు, నీటి పారుదల శాఖల మంత్రుల సమావేశం అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడారు. సమావేశంలో నాలుగు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపారు. ఇది అపెక్స్ కౌన్సిల్ సమావేశం కాదని... సమస్యలపై సీఎంల స్థాయిలో జరిగిన అనధికార సమావేశమని పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి నదీ జలాల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేయనున్న కమిటీ అన్ని అంశాలను గుర్తించి చర్యలు తీసుకుంటుందన్నారు.
బనకచర్లపై సానుకూలం చర్చలు ఫలప్రదం: మంత్రి నిమ్మల
పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన నివేదిక, తెలంగాణ ప్రభుత్వం వ్యక్తం చేసిన అభ్యంతరాలపై సానుకూల స్పందన వ్యక్తమైందని మంత్రి రామానాయుడు తెలిపారు. బనకచర్లతో అనేక సాంకేతిక అంశాలు ముడిపడి ఉన్నందున ఇరు రాష్ట్రాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఓ కమిటీ వేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో పనిచేసే ఈ కమిటీలో సాంకేతిక నిపుణులు, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు ఉంటారని పేర్కొన్నారు.
సోమవారంలోగానే బనకచర్లపై కమిటీ నియామకం జరుగుతుందన్నారు. గోదావరి నది నుంచి ఏటా సముద్రంలోకి వృథాగా పోతున్న 3 వేల టీఎంసీలపై కూడా కమిటీ ఆరా తీసి నివేదికలో పొందుపరుస్తుందని చెప్పారు. వీలైనంత త్వరగా సాంకేతిక సమస్యల పరిష్కారాన్ని ప్రభుత్వాలకు నివేదిస్తుందన్నారు. తర్వాత మరోసారి సీఎంలు సమావేశమై జల వివాదాలపై చర్చించే అవకాశం ఉందని మంత్రి నిమ్మల పేర్కొన్నారు.
కృష్ణా, గోదావరి నదీ జలాలకు సంబంధించి కేంద్ర మంత్రి ఆధ్వర్యంలో సమావేశం స్నేహపూరిత, సుహృద్భావ వాతావరణంలో జరిగిందన్నారు. కృష్ణా బోర్డు అమరావతిలో, గోదావరి బోర్డు హైదరాబాద్‌లో ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు రామానాయుడు వివరించారు. శ్రీశైలం ప్రాజెక్టును ఏపీ, తెలంగాణ కలిసి కాపాడుకోవాలని, మరమ్మతులు, ప్లంజ్‌పూల్ రక్షణ విషయంలో సీడబ్ల్యూసీ సిఫార్సులు, నిపుణుల సూచనలు పాటించి సత్వరమే చర్యలు తీసుకోవాలని ఏకాభిప్రాయం వ్యక్తమైందన్నారు.
జల వివాదాలపై సాంకేతిక కమిటీ
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా, గోదావరి నదీ జలాలకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య ఉన్న వివాదాల పరిష్కారానికి.. కేంద్ర ప్రభుత్వ, రెండు రాష్ట్రాల అధికారులు, నిపుణులు, ఇంజనీర్లతో సాంకేతిక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర జలశక్తి శాఖ తెలిపింది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో బుధవారం ఢిల్లీలో నిర్వహించిన సమావేశం అనంతరం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ‘రెండు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న జల వివాదాలపై సమావేశం జరిగింది. భేటీలో నీటి నిర్వహణకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించాం.
ప్రాజెక్టులపై టెలిమెట్రీ పరికరాల ఏర్పాటుకు, శ్రీశైలం నిర్వహణ, రక్షణ సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. కృష్ణా యాజమాన్య బోర్డు ఏపీలో, గోదావరి బోర్డు తెలంగాణలో ఉండేందుకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. మిగిలిన సమస్యలను సమగ్రంగా, సాంకేతికంగా పరిష్కరించేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఈ కమిటీ అపరిష్కృత సమస్యలపై అధ్యయనం చేయడంతో పాటు సమర్థవంతమైన నీటి భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి ఆచరణీయమైన పరిష్కారాలను సూచిస్తుంది.
వారంలోగా కమిటీ ఏర్పాటవుతుంది. రెండు రాష్ట్రాల మధ్య సహకారాన్ని పెంపొందించేందుకు, రెండు రాష్ట్రాల ప్రయోజనం కోసం స్థిరమైన నీటి నిర్వహణ పద్ధతులను సులభతరం చేసేందుకు జలశక్తి శాఖ నిబద్ధతతో ఉంది..’ అని పేర్కొంది. ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో సుమారు గంటన్నర పాటు జరిగిన సమావేశంలో.. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్, జల వనరుల శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీతో పాటు తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి, చంద్రబాబు, నీటి పారుదల శాఖల మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నిమ్మల రామానాయుడు, రెండు రాష్ట్రాల సీఎస్‌లు, నీటి పారుదల శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు.